నరేంద్రమోదీ, భారత ప్రధాన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న సాంవత్సరీక పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ధైర్యం చెప్పారు. ఇప్పటికే మన్ కీబాత్ అనే రేడియో కార్యక్రమం ద్వారా తనకు కుదిరినప్పుడల్లా విద్యార్థులకు పలుసలహాలు, సూచనలు ఇచ్చే మోదీ ఈసారి వారితో ముఖాముఖి అయ్యి పరీక్షల్లో విజయం సాధించే చిట్కాలు వివరించారు. తాల్కాతోరా స్టేడియంలో మోదీ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరీక్షలంటే అస్సలు భయపడవద్దని, వాటిని కూడా పండుగల్లాగే భావించాలని, చాలా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రశ్నలకు కూడా మోదీ సమాధానం చెప్పారు. ‘మంచి మార్కుల జాబితా రహస్యం ఉత్సాహంగా ఉండే మనసు మాత్రమే’ అని మోదీ చెప్పారు. ఎక్కువ ఉల్లాసంగా ఉండటం ద్వారా మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని, దాంతో భారం తగ్గి తేలికగా పరీక్షలు రాసి విజయాలు అందుకోవచ్చని అన్నారు.
ఎప్పుడూ ఏ దశలో కూడా నిరుత్సాహ పడొద్దని మోదీ కోరారు. అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఉదాహరణగా చెప్పారు. ‘ఏపీజే అబ్దుల్ కలాం ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని అనుకున్నారు. కానీ, అందులో విఫలం అయినా తన ప్రయత్నాన్ని ఆపకుండా మరో మార్గం ఎంచుకోవడంతో మంచి శాస్త్రవేత్త అయ్యారు’ అని కలాంను మోదీ గుర్తు చేశారు. అయితే, విద్యార్థుల నుంచి మోదీ ఊహించని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఆ విద్యార్థుల్లో ఒక విద్యార్థి మోదీకి ఓ ప్రశ్న వేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారో చెప్పాలని కోరాడు. అయితే, మోదీ మాత్రం ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా..
‘నేను నీకు టీచర్‌ను అయి ఉన్నట్లయితే కచ్చితంగా నిన్ను జర్నలిజం వైపు వెళ్లాలని సలహా ఇస్తాను. ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఇలాంటి మెలిక ఉండే ప్రశ్నలు వేస్తారు’ అని చెప్పారు. మరో విద్యార్థి టీచర్ విద్యార్థి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలని ప్రశ్నించగా.. ‘మన సమాజంలో టీచర్లంటే మన కుటుంబ సభ్యులే. వారితో ఎప్పటికీ చాలా దగ్గరి సంబంధాలను కొనసాగించాలి. మీ భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని మీతల్లిదండ్రుల మాదిరిగా తీర్చిదిద్దేది వారే’ అని మోదీ చెప్పారు. ప్రతిరోజు ఒక పరీక్షలాంటిదేనని వాటన్నింటిని మనం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అందరికీ ఆల్‌ది బెస్ట్ చెప్పిన మోదీ.. వారి విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సారీ అంటూ కార్యక్రమాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment