యోగికి పట్టం కట్టిన వ్యూహం
ఆలోచనం
బీజేపీతో యుద్ధానికి దిగిన పార్టీలు... ఇది లౌకిక భారతం అని నమ్మి వచ్చి తమ కొమ్ముకాసిన వారి కోసం శత్రుత్వాలను, కుమ్ములాటలనూ మరచి బిహార్ తరహా సయోధ్య వ్యూహాన్ని ఎందుకు అనుసరించలేకపోయాయి?
నోట్ల రద్దుతో అట్టుడికిన భారతదేశం ఉత్తర ప్రదేశ్ ఎన్ని కల ఫలితాల దిశగా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ యుద్ధం లో మోదీ శత్రు కూటమిలో ఎస్పీ, బీఎస్పీ , కాంగ్రెస్‌లు మాత్రమే కాదు భారతదేశం లౌకిక రాజ్యం అని నమ్మే ప్రజాస్వామిక ప్రియులు గోద్రా మారణ హోమం గురించి తెలిసిన అధ్యయనకారులూ పరో క్షంగా మోహరించారు. కానీ వీరి ఆశలపై నీళ్లు చల్లుతూ ‘‘అబ్ కి బార్–300 పార్ ’’ అని యుద్ధ నినాదం చేసిన బీజేపీ అవలీలగా ఆ సంఖ్యని దాటేసి ఉత్తరప్రదేశ్‌పై హిందుత్వ జెండాని రెపరెప లాడించింది.
20% వరకూ ముస్లింలు ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లింకి కూడా టిక్కెట్ ఇవ్వకుండా విజయాన్ని కైవ సం చేసుకోవడమే కాక యోగి ఆదిత్యనాథ్‌ని ముఖ్య మంత్రిగా ప్రతిష్టించి బీజేపీ దేశానికి ఏం సందేశాన్ని ఇచ్చిందో తప్పకుండా పరిశీలించాల్సి వుంది.
ఎన్నికల ప్రచారంలో ముస్లింల ఖబరస్తాన్, దీపా వళి, రంజాన్ వంటి అంశాలను ప్రస్తావించిన బీజేపీ అక్కడితో ఆగి ఉంటే అది గెలుపు ఎత్తుగడకు పన్నిన మత చీలిక వ్యూహం మాత్రమే అయి ఉండేది. కానీ ఆదిత్య నాథ్ ఎంపిక ఆ ప్రచారపు అంతిమ లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఆదిత్యనాథ్ తూర్పు ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఘోరక్‌నాథ్ మఠ వారసుడు. ఈ మఠానికి చెందిన యోగులు ధార్మికతను ప్రచారం చేస్తూ, యోగా భ్యాసంలో మునిగి లోకాన్ని మరచిన మునులు కాదు. ఈ మఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్‌నాథ్, గాంధీజీ అహింసావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాక, గాంధీజీ హత్యకు ఆజ్యం పోసిన వాళ్లలో ఒకడిగా పేర్కొనబడి 9 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. 1949 రామ జన్మ భూమి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఇతని వారసుడు మహంత్ అవైద్యనాథ్, బీజేపీ రామ జన్మభూమి ఉద్యమాన్ని తన భుజస్కం ధాల మీదకి ఎత్తుకున్నాక, అంతవరకు ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఏగా గెలుస్తూ వచ్చినవాడు బీజేపీలో చేరి ఎంపీ అయ్యాడు. వారి వారసుడు యోగి ఆదిత్యనాథ్ ‘‘లవ్ జిహాద్ ’’ ప్రకటించడం, ఘర్వాపసీ పేరిట బల వంత మత మార్పిడులు చేయించడం, మత విద్వే షాన్ని రెచ్చకొట్టే వ్యాఖ్యానాలు చేయడం ద్వారా తను ఆ తానులో ముక్కనేనని, బీజేపీ కిరీటానికి కలికి తురాయి కాదగ్గ వాడినని అవకాశం వచ్చిన ప్రతిసారి సంఘ్ పరివార్‌కి నిరూపించడానికి తాపత్రయపడుతూ వచ్చిన హిందుత్వవాది.
పారంపర్యం, కులం వంటివి తమ నాయకుల ఎంపికకు ప్రామాణికాలు ఎంత మాత్రమూ కావని బీజేపీ తేల్చి చెబుతూనే మరోవైపున తమ ప్రాధాన్యత ఏమిటో, తన గమన, గమ్యాలు ఏమిటో ఆదిత్యనాథ్‌ను ముందుకు తెచ్చి తేటతెల్లం చేసేసింది. అంతవరకూ తీసుకుంటే బీజేపీకి తమ సిద్ధాంతం పట్ల ఉన్న స్పష్టత, పటిష్టంగా వేస్తున్న అడుగులు ఘనంగా శ్లాఘించదగి నవి. అయితే బీజేపీ గెలుపు 39% ఓట్ల గెలుపు మాత్రమే. ఆ పార్టీ ‘‘ఫస్ట్ వన్ హూ పాస్డ్ ది పోస్ట్’’. అయితే మరి మిగిలిన పార్టీల పక్షాన నిలిచి బీజేపీ వ్యతిరేక ఓటింగ్ చేసిన ఓటర్ల మాట ఏమిటి? వారి ఆకాంక్షల మాట ఏమిటి? అవి పరిగణనీయం కాదా? అందరూ చెప్తున్నట్లు ఇది మరో ‘‘సునమో’’ ఎందు కవుతుంది?
అదలా ఉంచితే బీజేపీతో యుద్ధానికి దిగిన పార్టీలు, తమ శత్రువు, గెలుపుకోసం అధికారాన్ని విని యోగించుకోగల స్థితిలో ఉన్నవాడనీ, ‘‘the rules of fair play do not apply in love and war'’’ అని నమ్మే వాడని ఎందుకు గుర్తించలేకపోయాయి? ఇది లౌకిక భారతం అని నమ్మి వచ్చి తమ కొమ్ముకాసిన వారి కోసం శతృత్వాలను, కుమ్ములాటలనూ మరచి బిహార్ తరహా సయోధ్య వ్యూహాన్ని ఎందుకు అను సరించలేక పోయాయి? లౌకిక దేశంలో 20% ముస్లిం లకు ప్రతినిధి లేకుండా ఒక పార్టీ ఘన విజయం సాధిం చడం ఎటువంటి భవిష్యత్తును దేశానికి వాగ్దానం చేయ బోతున్నది అన్నది ప్రధాన ప్రశ్న.
ప్రశ్న అక్కడితో ముగియలేదు. నాయకుల ఎంపి కలో తాము కులాన్నో, పారంపర్యాన్నో పరిగణనలోకి తీసుకోమని చెప్పే బీజేపీ తు.చ. తప్పకుండా ఆ మాట లను ఆచరణలో పెడుతూ వస్తూ ఉంది. ఈ దేశపు మధ్య తరగతి చదువరులకు టీ అమ్ముకునే ఒక సాధా రణ కార్యకర్తను కూడా బీజేపీ గౌరవిస్తుందనే నమ్మ కాన్ని ఇవ్వడమే కాదు, యోగులు కూడా పరిపాలనలో భాగం కావచ్చు అనే సఫల స్వప్నాలను అది నిర్మిస్తూ వస్తూ ఉంటే, మరోవైపు స్వాతంత్రోద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కాంగ్రెస్, సమసమాజ స్వప్నాలను ఎరవేసే కమ్యూనిస్టులు నేలలోంచి పుట్టిన నాయకు లను తమ ప్రతినిధులుగా ఎందుకు ముందుకు తేలేక పోతున్నారు?
‘‘ముస్లింలు తమ విశ్వాసాన్ని అనన్యంగా ప్రక టించేంతవరకు వారికి ఓటు హక్కు లేకుండా చెయ్యా లని’’ 1952లో స్టేట్స్‌మెన్ పత్రికకు చెప్పిన దిగ్విజయ్ నాథ్ వారసుడైన ఆదిత్యనాథ్‌ని ముఖ్యమంత్రిని చేసిన బీజేపీకి తన లక్ష్యం ఏమిటో, పం«థా ఏమిటో, పథం ఏమిటో వందకి వెయ్యిశాతమన్నంత స్పష్టమైన అవ గాహన ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త.
- సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
మొబైల్ : 91635 69966