పెళ్లిని, భర్తని నెట్టేస్తున్న కెరీర్‌ | self respect of ‘Ms.,’, writes samanya kiran | Sakshi
Sakshi News home page

పెళ్లిని, భర్తని నెట్టేస్తున్న కెరీర్‌

Published Tue, Jul 11 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

ప్రముఖ స్త్రీవాది షీలా మైకేల్స్‌ (ఫైల్‌ ఫొటోలు)

ప్రముఖ స్త్రీవాది షీలా మైకేల్స్‌ (ఫైల్‌ ఫొటోలు)

ఆలోచనం
తమ ఆలోచనల్లో ఇంకిపోయిన సెక్సిజం నుంచి బయటపడనంత కాలం, మన మగవాళ్లకి ఈ కాలంలో పెళ్లిళ్లు కావడం కష్టమవడమే కాదు, ఆ పెళ్లిళ్లను అవలీలగా పెటాకులు చేసి ఆడవాళ్లు వెళ్ళిపోతారు కూడా.

కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన మిజ్‌. షీలా మైకేల్స్‌ మరణించారు. అప్ప టివరకూ పురుషుడిని వివాహ పూర్వమూ, అనంతరమూ మిస్టర్‌గా పరిగణిస్తూ ఉండగా స్త్రీని వివాహమనే జీవన మధ్యధరా రేఖ నుంచి అటు వైపు ఉన్నపుడు తండ్రి అనే మగవాడికి చెందిన కుమారి గాను, ఇటు వైపు ఉన్నపుడు భర్త అనే మగాడి ఆస్తిగా శ్రీమతి గాను  పరిగణిస్తూ వచ్చేవారు. స్త్రీవాది అయిన షీలా దీనిని ‘‘నేను నా తండ్రికీ చెందను, అలాగని నేనేం చేయాలో నాకు పదేపదే చెబుతుండే ఒక భర్తకూ చెందాలనుకోలేదు’’ అని ఒక అస్థిత్వ ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఏ మగవాడికీ చెందాలనుకోని ఒక స్త్రీని ఏమని సంబో ధించాలి అని వెతికాను. నాకేమీ కనిపించలేదు’’ అన్న షీలా దానికి పరిష్కారంగా మిజ్‌ (ఝట) పదాన్ని వాడా లని ప్రపంచానికి సూచించింది. ‘మిజ్‌ పదం వాడట మంటే నువ్వు స్త్రీని వివాహార్హతతో కాకుండా, ఎవరి భాగస్వామిగానో కాకుండా ఆమెని ఒక మనిషిగా మాత్రమే గుర్తిస్తున్నావని అర్థం’ అని చెప్పింది.

1963లో ప్రచురితమైన బెట్టీ ఫ్రైడెన్‌ ‘ఫెమినైన్‌ మిస్టిక్‌’ పుస్తకం, ప్రపంచం చెప్తున్నట్టు ఆడవాళ్ళు శ్రీమ తులుగా భర్తల వెనకాల, చెల్లెళ్లుగా అన్నల పక్కన, తల్లు లుగా కొడుకుల కోసం కష్టపడుతూ, నగలు వేసుకుని, ఆస్తులు చూసుకుని మురిసిపోతూ ఏమీ లేరనీ, వాళ్లు తమ తెలివితేటలకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు రావటం లేదని బాధపడుతున్నారని తెలిపింది. స్త్రీత్వం, మాతృత్వం అత్యద్భుతమైనవి అంటూ స్త్రీల చుట్టూ మగవాళ్ళు అల్లిపెట్టిన భ్రమాత్మక అద్భుతత్వాన్ని స్త్రీవా దులు అలా బద్దలు కొట్టారు. దానిని అనుసరిస్తూ తెలు గులో కూడా ఓల్గా, జయప్రభ, వసంత లక్ష్మి వంటి స్త్రీవా దులు స్త్రీ పురుషులిద్దరికీ ‘శ్రీ’ అనే గౌరవ వాచకాన్ని వాడితే చాలని సూచించారు. అనుసరించారు.

ఫెమినైన్‌ మిస్టిక్‌ ప్రచురణ జరిగి అనేక ఏళ్ళు గడిచి పోయాయి. అత్యంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయిన పుస్తకంగా అది రికార్డులు సాధించింది. కానీ మగవాళ్ళు మాత్రం ఇంకా తదనుగుణంగా తర్ఫీదు కాలేదు. స్త్రీని లైంగికంగా చూడటమూ మానలేదు. రాజదీప్‌ సర్దేశాయ్‌ ఆధునికుడైన అభ్యుదయ జర్నలిస్ట్‌. ఆయన సానియా మీర్జాను ఇంటర్వ్యూ చేస్తూ చాలా సాదా సీదా మగవాడి లాగా ‘‘మరి తల్లి కావడం ఎప్పుడు? సెటిలవడం ఎప్పు డు?’’ అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి చాలా తీవ్రంగా స్పందించి ‘‘ఈ సమయంలో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉండటం కంటే మాతృత్వాన్ని నేను ఎంచుకోనందుకు మీరు ఆశాభంగంతో ఉన్నట్లు మీ మాటలు ధ్వనిస్తున్నాయి. ఒక మహిళగా అన్ని సమయాల్లో నేను ఈ ప్రశ్ననే ఎదుర్కొంటున్నాను. అదేమిటంటే మొదట పెళ్లి, తర్వాత మాతృత్వం. మేం సెటిల్‌ కావడం అంటే ఇదేనన్నమాట. ‘‘ఎన్ని వింబుల్డన్‌లు మేం గెల్చుకున్నా, ఎన్ని సార్లు  ప్రపంచ నంబర్‌ వన్‌లుగా మారినా, మేం సెటిల్‌ కానట్లే మరి’’ అని సమాధానమిచ్చింది.

ఇటీవలే ఒక తెలుగు దినపత్రిక స్త్రీ శిశు హత్యల కారణంగా స్త్రీల సంఖ్య తగ్గిపోయిందని మగ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకక బాధపడుతున్నా రని వేదన చెందుతూ పెద్ద వార్త రాసింది. స్త్రీ శిశు హత్యలు జరగటం వలన అమ్మాయిల సంఖ్య తగ్గి పోవడమనేది నిజమే అయినా వాళ్లకి అమ్మాయిలు దొర కకపోవడం వల్లే పెళ్లి కావడం లేదా అనేది ప్రశ్న. విద్య జ్ఞానపు పరిధులను విస్తరించగా, ఆర్థిక స్వాతంత్య్రం దేన్నయినా ఎదుర్కునే ధైర్యాన్ని ఇస్తుంది.

మా అమ్మమ్మ నాతో ఎప్పుడూ ‘‘నీకేమమ్మా నిన్నెవరేం చేయగలరు, నీకు సరస్వతి తోడుగా ఉంది’’ అనేది. నా సరస్వతి నాకు ధనాన్నివ్వడమే కాదు ఎలాటి భర్తను ఎంపిక చేసుకో వాలో నేర్పింది. ఇవాళ్టి ఆడపిల్లలందరూ నాకూ, సాని యాకు ప్రతినిధులే, గాయని మేఘన్‌ ట్రయ్నర్‌ పాట ‘‘డియర్‌ ఫ్యూచర్‌ హస్బెండ్‌’’లో ‘‘నేను వంట చేయడం ఎన్నడూ నేర్చుకోలేదు కానీ, నేను జనాకర్షకమైన పాట  రాయగలను.. రా నాతో కలిసి పాడు!’’ అన్నట్టు అన డమూ నేర్పింది. బహుశా ఈ నాటి చదువుకున్న అమ్మా యిల ఈ మనస్తత్వాలు అనుగుణమైన అబ్బాయిలు దొరకకపోవడం చేత వాళ్ళు అంత త్వరగా పెళ్ళికి సిద్ధ పడటం లేదేమో.

కాలం మారింది కానీ ఈ సంధి కాలంలో అబ్బాయి, అతని తరఫు వారూ మాత్రమే కాదు రాజ దీప్‌ సర్దేశాయ్‌ లాంటి ఆధునికులూ తమ ఆలోచనలలో ఇంకిపోయిన సెక్సిజం నుంచి బయట పడలేక పోతు న్నారు. అలా బయటపడనంత కాలం మన మగవాళ్ళకి ఈ కాలంలో పెళ్లిళ్లు కావడం కష్టమవడమే కాదు, ఆ పెళ్లిళ్లను అవలీలగా పెటాకులు చేసి ఆడవాళ్లు వెళ్లి పోతారు కూడా.

‘‘కొంతమంది మహిళలు పురుషులను అనుసరిస్తారు. కొంతమంది స్త్రీలు తమ స్వప్నాలను అనుసరిస్తారు. ఏ మార్గాన్ని అనుసరించాలని మీరు  సందేహిస్తున్నట్లయితే, తెలుసుకోండి. మీ ఉద్యోగం ఒకానొకరోజు మిమ్మల్ని నిద్రలేపి, నేనింక నిన్ను ప్రేమించబోవటం లేదు అని చెప్పి మిమ్మల్ని మధ్యలో వదిలేయదు’’ అని గాయని లేడీ గాగా అన్న మాటలు నాకు భలే ఇష్టం. నేనో సారి ఆ మాటలను పన్నెండేళ్ల నా కూతురితో పంచుకున్నాను. ఆ మాటలను నా కూతురు భట్టీయం వేసుకుంది. తననెప్పుడూ వదిలిపోని చదువు, ఉద్యోగమే భర్తకన్నా, వివాహం కన్నా ముఖ్యమని అను కుంటోంది. రాబోయే కాలమంతా ఇలాంటి అమ్మాయిలే కనిపించబోతున్నారు. కనుక మగవాళ్లూ మారండి! మారకపోతే వివాహాలు కావండీ!


- సామాన్య కిరణ్‌

వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement