నాకూ బిడ్డను కనాలని ఉంది!
పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు సోమనాథ్ బెనర్జీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన పుత్ర సంతానంగా మురిసిపోయారు తల్లిదండ్రులు. కొంత వయసు రాగానే తానసలు మగవాడినే కాదనీ, పురుష శరీరంలో చిక్కడిపోయిన స్త్రీనని తెలుసుకుని, ఆ శరీరం నుంచి విముక్తి కోసం, స్వాధీనత కోసం, స్వాతంత్రం కోసం పెనుగులాడి, పోరాడి చివరికి సెక్స్ మార్పిడి ఆపరేషన్‌తో సోమనాథ్ బెనర్జీ నుంచి ‘మానవి’గా మారింది.
భారత దేశంలోనే మొదటి సారి కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక ‘ట్రాన్స్ జెండర్’. శ్రీమతి మానవి బెనర్జీ... కాలేజ్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు కూడా అనేక మంది మహిళా ప్రిన్సిపల్స్ మనకు తెలుసు. అయితే... మానవి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం ఎందుకంటే...మనదేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం ఆమెతోనే మొదలు.
మానవి బెంగాల్ లోని నదియ జిల్లా కృష్ణ నగర్ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నేను వెళ్లి కలిసాను. బెంగాలీ సాహిత్యంలో పీ.హెచ్ డీ చేసిన ఆమెకు కథకళి, భరత నాట్యాలలో ప్రవేశం వుంది. ఆమె ప్రతి మాటలోనూ రవీంద్ర సంగీతం పెనవేసుకుని వుంటుంది. ‘సాంగ్’ అనే నాటక సమాజాన్ని స్థాపించారామె. హిజ్రాల దుఃఖాలకు నాటక రూపమిచ్చి దర్శకత్వం వహిస్తుంటారు. ‘అమానవ్’ అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, ‘అద్వితీయ’ అనే మరో స్త్రీల పత్రికలో ‘లజ్జావతి’ అనే కాలమ్ నిర్వహిస్తున్నారు.
ఇవికాక దేశంలోనే మొట్ట మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ సర్కార్ స్థాపించిన ‘ట్రాన్స్ జెండర్ డెవలప్‌మెంట్ బోర్డ్’కు వైస్ చైర్‌పర్సన్ మానవి. థర్డ్ జెండర్ వ్యక్తులతో మన సమాజం ఎలా వ్యవహరిస్తోంది? అనే ప్రశ్నతోపాటు అనేక సంఘటనలు, దృశ్యాలు మానవిని చూడగానే గుర్తుకు వచ్చాయి. చెదరని చిరునవ్వుతో చక చకా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ‘థర్డ్ జెండర్’ గా అనేక ఒత్తిడుల మధ్య పీ.హెచ్‌డీ ఎలా చేసారు, ఇంత గొప్ప వృత్తిలోకి ఎలా వచ్చారు? తల్లిదండ్రుల సహకారమే కారణమా ?’’అని ప్రశ్నిస్తే అందుకు కూడా ఆమె నవ్వారు. మెల్లగా ప్రసన్నంగా నోరు విప్పారామె.
‘‘భారతీయ సమాజం, కుటుంబ వ్యవస్థలు భిన్నమైన పనిని ఎవరు చేసినా, అది మంచిదయినా సరే మొదట శంకించి, ఆ తర్వాత భయపడి ఆ భిన్నమైన దారిని ఎన్నుకున్న వారి మీద దాడి చేస్తుంది. నా కుటుంబమూ ఇందుకు అతీతం కాదు. నేను ఎన్నిసార్లు ఆత్మాహత్య వరకు వెళ్ళానో చెప్పలేను. అన్నిసార్లూ రవీంద్రుడి సంగీతమే ఆదుకుంది. ఈ ప్రపంచంలో ఏ బంధుత్వాలు లేని ఒంటరిని నేను. అయినా సరే బతికే తీరాలి అనుకున్నాను’’ అన్నారామె. ‘ఇలాటి పుట్టుక నా నిర్ణయం కాదు’ అని మానవి ఒక విలువయిన మాట చెప్పారు. ‘హిజ్రా ఆత్మ కథ’ పేరుతో తన జీవితాన్ని రాసిన రేవతి కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తారు.
న్యాయాన్ని పాటించడమే నాగరకత!
సుప్రీంకోర్ట్ దీనిని మానవ హక్కులకు సంబంధించిన విషయంగా గుర్తించి హిజ్రాలని థర్డ్ జెండర్‌గా గుర్తించడం భారతీయ సమాజం నాగరికత వైపుచురుకైన అడుగులు వేస్తుందని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వారికి ఓబీసీ రిజర్వేషన్‌ను కల్పించ మనడమే కాక వారికి సంబంధించిన ఏ అంశాన్నీ విడువకుండా విపులమైన తీర్పునిచ్చింది. దీని గురించి మాట్లాడుతూ మానవి ‘‘సుప్రీం కోర్టు తీర్పుకి సాల్యూట్ చేస్తున్నాం అలాగే మా సంక్షేమానికి కాక మా అభివృద్దికి దేశంలోనే మొదటి సారి ట్రాన్స్ జెండర్ డెవలప్‌మెంట్ బోర్డ్ పెట్టిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు’’ అన్నారు.
మా సంభాషణ ముగింపులో మానవి ఒక మాట అన్నారు. ‘స్త్రీగా నా గర్భం నుంచి ఒక బిడ్డకి జన్మనివ్వాలి’ అనే బలమైన కోరిక వుంది. కానీ అది ఎప్పటికీ నెరవేరదు కదా. టాగోర్ ‘దుయి బిఘా జమీ...’ కవితలో తనకున్న అరెకరం పొలాన్ని కోల్పోయిన వ్యక్తి... ‘‘భగవంతుడు నన్నీ అరెకరం పొలానికే పరిమితం చేయ్యదలచుకోలేదు. అందుకే నన్ను నా భూమి నుంచి దూరం చేసాడు. మంచిదే ఇప్పుడీ పృథ్వి అంతా నాదే’’ అంటాడు. నా పరిస్థితీ అంతే... కాలేజ్ పిల్లలూ, బయటి పిల్లలూ నా పిల్లలే. సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలను దాటుకుని వ్యక్తులు ఒక హక్కు కోసం ఉద్యమిస్తున్నారంటే అది తప్పనిసరిగా ఆలోచించదగిందే అది థర్డ్ జెండర్ విషయమైనా మరోటయినా. కదా...?
- సామాన్య కిరణ్