పౌరులుగా గుర్తించండి
* నినదించిన హిజ్రాలు,ట్రాన్స్‌జెండర్లు
* గోశాల నుంచి ఇందిరా పార్కు వరకూ ర్యాలీ
* ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కవాడిగూడ: ‘సమాజంలోని పౌరులలో మేమూ భాగమే. ఈ దేశంలోని పౌరులకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కుల్లో మాకూ వాటా కావాలి. మాపై పక్షపాతం, హింసా ధోరణి విడనాడాలి’అంటూ ట్రాన్స్‌జెండర్లు, హిజ్రాలు నినదించారు. తమ హక్కుల కోసం గళమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానత్వం, చట్టపరమైన రక్షణ, స్వేచ్ఛ, వివక్షనుంచి రక్షణ, లింగ వ్యక్తీకరణకు స్వాతంత్య్రాన్ని కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల నుంచి గాంధీనగర్, అశోక్‌నగర్ మీదుగా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకూ ‘హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన్ కవాతు’ పేరుతో ర్యాలీ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైనసామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు, హిజ్రాలను తోటి పురుషులు, స్త్రీలతో సమానంగా చూడాలన్నారు. హిజ్రాలకు సమాన హక్కులు లేవంటే అంబేద్కర్‌ను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. వారి హక్కులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం వైజయంతి, చంద్రముఖి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ పౌరులకు సమానత్వం, చట్టపరమైన రక్షణ వంటి హక్కులు ఉంటాయని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ట్రాన్స్‌జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. భౌతిక, లైంగిక దాడుల నుంచి రక్షణ ఉండేలా సమగ్ర అత్యాచారాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
హిజ్రాల జనాభాను ప్రభుత్వమే అధికారికంగా లెక్కించాలని కోరారు. ఓయూ విద్యార్థి సంఘ నేత శరత్ వారికి సంఘీభావం తెలిపారు. నవదీప్, రచన, గ్రీష్మ, మిస్కాన్, అఖిల, బిట్టు, తమన్నా, అరునాంగే తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజులు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.