సంఘ బహిష్కరణకు శిక్షేది?
ఆలోచనం
ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్ ఎస్.ఆర్. శంకరన్ ఎవరికయినా తలవంచారా?
గరగపర్రు గ్రామంలో చెరువొడ్డున బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం నిలబెట్టడం కోసం దళితులు సంఘ బహిష్కరణకు గురికావడం నాకు అనేక జ్ఞాపకాలను తెచ్చింది. అందులో మొదటిది 1927వ సంవత్సరంలో అంబేడ్కర్ మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం ఉద్యమించడం. దానిని వ్యతిరేకించిన సవర్ణులు ‘ఆవు పేడ’తో ఆ చెరువును శుద్ధి చేసుకోవడం. ఇది జరిగి ఇప్పటికి 90 ఏళ్లు. ‘నేను భంగీని’ రచయిత భగవాన్ దాస్ 1957లో, ‘హిందూ మతం మనిషి గుణాన్ని, యోగ్యతల్ని పట్టించుకోకుండా మనిషి పుట్టుకకు ప్రాధాన్యతనిస్తోంది. సమానత్వం, ఐక్యతలను వ్యతిరేకిస్తుంది’ అని రాసి ఇప్పటికి 60 ఏళ్లు. విజయనగరం జిల్లా ‘వసి’ గ్రామంలో దళితులను ఇలాగే ఊరి నుంచి వెలివేసినపుడు, 1999లో బాలగోపాల్ ప్రభుత్వ పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ‘సంఘ బహిష్కరణకు శిక్ష మాటేమి టి’? అనే వ్యాసం రాశారు. ఇది జరిగి నేటికి 18 ఏళ్లు.
మనిషి మరో మనిషిపై పుట్టుకతోనే ఆధిపత్య సౌకర్యాన్ని పొందడానికి విశ్వవ్యాప్తంగా మతం కృషి చేయడం, ప్రయాణ సాధనాలు సరిగా లేని ఆ కాలం లోనే ప్రపంచమంతా కూడబలుక్కున్నట్లు ఈ అంతరాల మానవ సమాజాన్ని నిర్మించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని వదిలేసి, సామాజిక మాధ్యమాల్లో కొంత మంది, దళిత రాజకీయ నేతల చిత్తశుద్ధిని ప్రశ్నించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, రాంసే మెక్డొనాల్డ్‌లు ప్రతిపాదించిన దళిత ప్రత్యేక నియోజక వర్గాల ఆలోచనను వ్యతిరేకించిన గాంధీ ‘ఇలా చేస్తే హిందూ సమాజం ముక్కచెక్కలై పోగలదని’, తిండీ నీళ్లు మానేసి ‘పూనా ఒప్పందం’ చేసుకున్నాడు. అలా దళిత నేతల రాజకీయ ప్రాణాలని, వారి నియోజకవర్గాలలోని సవర్ణ ఓటర్ల చేతిలో పెట్టాడు.
సమాజాభివృద్ధికంటే కులమూ, మతమూ ప్రధానాంశాలుగా భావిస్తూ ఓట్లేసే ప్రజలున్న చోట, అసలు రాజకీయమే ఒక జూదం. ఈ జూదంలో, మనుగడకోసం ప్రతి రాజకీయ నేత ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే, కానీ గరగపర్రులో అధికారుల తీరు మాటేమిటీ? ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 (యూ), 3 (జెడ్íసీ)ల ప్రకారం సంఘ బహిష్కరణ చేసిన వారికి 6 నెలల నుంచి ఐదేళ్లదాకా శిక్ష విధిం చొచ్చు.
ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో సీఎం నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేయాలి. ప్రతినెలా జిల్లా కమిటీ రిపోర్ట్ రాష్ట్రానికి పంపాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకి ఒకసారి కచ్చితంగా జరగాలి. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌ని ఈ చట్టం అమలుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి. వీటన్నిటినీ పాటిస్తూ గరగపర్రు విషయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఏ రాజకీయ నేత కలెక్టర్‌కి అడ్డుపడేవాడు? హేమాహేమీలయిన రాజకీయ నాయకులు అడ్డు నిల్చినా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేసిన ఐఏఎస్, ఎస్.ఆర్. శంకరన్, ఎవరికయినా తలవంచారా? మరి గరగపర్రు విషయంలో ఆ జిల్లా కలెక్టర్ ఎందుకలా స్పందించలేకపోయారు?
రెండ్రోజుల క్రితం ‘ది టెలిగ్రాఫ్’లో ఒక వార్త. బ్రిటన్లో పుట్టిపెరిగిన సందీప్, రీనా అనే హిందూ జంట సంతానలేమితో అక్కడే ఒక బిడ్డని దత్తత తీసుకోవాలనుకున్నారట. దత్తతనిచ్చే స్థానిక సెంటర్ని సంప్రదిస్తే, వారు వర్ణవివక్షను మొహమాటం లేకుండా ప్రదర్శిస్తూ, తమ దగ్గర అందరూ తెల్ల పిల్లలే వున్నారని, ఇండియన్స్ తెల్లబిడ్డని దత్తత తీసుకోవడానికి అనర్హులు అని, దరఖాస్తు చేసుకోవడం కూడా అనవసరం అన్నారట. గరగపర్రు దళితులను బహిష్కరించిన సందర్భంలో వచ్చిన ఈ వార్త నాకో ఆలోచన కలిగించింది. ఒక వేళ ప్రపంచమంతా ఒక్కటైపోతే, ఇప్పుడు గరగపర్రు దళి తులపై అత్యాచారం చేసిన బలరామకృష్ణమరాజు, రామరాజు, విషయం తెలిసినా ఊరకున్న సీఎం చంద్రబాబుల పెద్ద కులాల మాటేమిటి? ‘వి హావ్ ఆల్వేస్ ఫెల్ట్ బ్రిటిష్’ అని తెల్లబిడ్డ దత్తత కోరుకున్న ఆ దంపతుల్లాగే మన సవర్ణులూ, మాది చాలా గొప్పకులం అన్నా, అప్పుడు గాంధీకి దక్షిణాఫ్రికాలో జరిగిన అవమానమే వీళ్లకీ జరుగుతుంది కదా. ఎంత కాదన్నా రూపంలో, సంపత్తిలో చాలా దేశాల ప్రజలు మనకంటే చాలా సవర్ణులు కదా మరి.
ఆ మధ్య సీఎం తాను, వెంకయ్య ఇద్దరం అమెరికాలో పుట్టివుంటే బాగుండేదని అన్నారు. ఆ అమెరికా స్వాతంత్య్ర దినం ఈ రోజు. వారి యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రెండో పేరా ‘మనుషులం దరూ సమానులుగానే పుట్టారు అనడానికి ఈ వాస్తవాలను ససాక్ష్యంగా ఎత్తిపెట్టాం’ అని మొదలవుతుంది, ఆ స్ఫూర్తితో ‘‘బానిసత్వానికి అనుకూలంగా ఎవరైనా వాదిస్తుండటాన్ని నేను విన్నవ్పుడల్లా, అలా వాదించేవారిపై వ్యక్తిగతంగా ఆ బానిసత్వాన్ని అమలు చేసి చూడాలనే బలమైన భావన నాకు కలుగుతుంది’’ అని ప్రకటించి, బానిసత్వ నిర్మూలన వ్యతిరేకులకు ఛాతీ ఎదురొడ్డి నిలిచాడు అబ్రహాం లింకన్. సీఎం చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుని, దళితుల సంఘ బహిష్కరణ పట్ల నిజాయితీగా స్పందిస్తే, అప్పుడు ఆయన అమెరికాలో పుట్టాల్సినవాడినంటే మనం కాదంటామా, కావాలంటే అబ్రహాం లింకన్ అంతటివాడివని కూడా అంటాం.
- సామాన్య కిరణ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966