తన చిత్రంపై సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ తెలుగులో సంతకం చేసిన రాధాకృష్ణన్ (ఫైల్)
‘తరగతి గదిలో దేశ భవిష్యత్ ఉంటుందని’ చాటిన ఆచార్యుడు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్’ మన జిల్లా వాసి కావడం గర్వకారణం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా, తర్వాత రోజుల్లో దేశప్రథమ పౌరుడిగా దేశవిదేశాల్లో ఎంతో కీర్తి గడించారు. రాధాకృష్ణన్‌కు సింహపురితో ఎనలేని అనుబంధం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన తన పూర్వీకుల జన్మస్థలి సర్వేపల్లి రుణాన్ని తనకు దక్కిన అవకాశంతో రాష్ట్రపతి హోదాలో తీర్చుకున్నారు. జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు.
సాక్షి, నెల్లూరు(బృందావనం): సామాన్య కుటుంబంలో పుట్టి.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పూర్వీకులది వెంకటాచలం మండలం సర్వేపల్లి. సెప్టెంబరు 5, 1888న తెలుగు సంప్రదాయ కుటుంబం సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రాధాకృష్ణన్ తాత అవ్వలు సర్వేపల్లి సీతారామయ్య, కొండమ్మ స్వగ్రామం సర్వేపల్లిని వీడి 19వ శతాబ్దం మొదటలోనే అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తణ్ణిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పూర్వీకులు కరణాలు, మునసుబులుగా వివిధ హోదాల్లో రెవెన్యూ శాఖల్లో పనిచేశారు.
ప్రాథమిక విద్య
రాధాకృష్ణన్ ఐదేళ్ల వయస్సులోనే తిరుత్తణ్ణిలో పాఠశాల విద్యాభ్యాసం ప్రారంభమైంది. అప్పటి పరిస్థితుల్లో రాధాకృష్ణన్ నాన్నకు తన కుమారుడికి ఇంగ్లిష్ నేర్పించడం ఇష్టం లేదు. దీంతో సంస్కృతం నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే స్నేహితులు, బంధువుల సలహాలతో మిషనరీ స్కూల్‌లో ఇంగ్లిష్ సాధన జరిగింది.
- అనంతరం తిరుపతిలోని లూథరన్ మిషన్ హైస్కూ ల్‌లో సెకండరీ ఎడ్యుకేషన్‌ను అభ్యసించారు.
- ఆ తర్వాత వేలూరులోని వర్గీస్ కాలేజీలో ప్రీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు.
- తర్వాత ఫెలో ఆఫ్ ఆర్ట్స్ (ఎఫ్‌ఏ)లో చేరారు. ఆ కోర్సును అభ్యసిస్తున్నప్పుడే పదిహేనేళ్ల వయస్సులోనే శివకమ్మతో వివాహం జరిగింది.
- అనంతరం మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్సును పూర్తి చేశారు.
- 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు.
- ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మైసూరు విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగానికి అధిపతిగా నియమించింది.
- అనంతరం కోల్‌కత్తా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో సుదీర్ఘకాలం బోధనలు చేశారు.
నెల్లూరీయుడితో కుమార్తె వివాహం
సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పెద్ద కుమార్తె పద్మావతిని ఉత్తమ సంప్రదాయాలు కలిగిన ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన వీఆర్ కళాశాల కమిటీ సభ్యుడిగా ఉన్న మోదవోలు చెంగయ్య పంతులు కుమారుడు మోదవోలు శేషాచలపతికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆయకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఆయన బంధువర్గం ఇప్పటికీ నెల్లూరు, కందుకూరు, మద్రాసు తదితర ప్రాంతాల్లో ఉన్నారు. రాధాకృష్ణన్ మేనత్త నెల్లూరులో ఉన్న పురమందిరం (టౌన్‌హాల్) వీధిలో నివాసం ఉండేవారు.
బెజవాడ గోపాల్‌రెడ్డికి అభినందన
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డిని ఒక వేదికపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ సందర్భంగా ఒక చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న తన చిత్రం వద్ద తెలుగులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ సంతకం చేసి మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.
రాష్ట్రపతి హోదాలో కోనేరు బాగు
సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో సర్వేపల్లిలోని కోనేరును బాగుచేయించారు. మేమంతా ఆయన కుటుంబానికి సంబంధించి ఐదు, ఆరు తరాల వారం. సర్వేపల్లికి తాగునీరు అందించే కోనేరు నాడు పాచిపట్టి పోయింది. బాగు చేసే వారు లేకపోవడంతో నాడు మునసుబుగా విధులు నిర్వహిస్తున్న మా సోదరుడు సర్వేపల్లి సుబ్బారావు కోనేరు దుస్థితిపై రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన ఆయన నాడు వెంకటాచలం సమితి అధికారులకు తక్షణమే కోనేరు బాగు చేయించాలని సూచించారు. దీంతో నాడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులపై చేరుకుని కోనేరు బాగు చేయించి ఆ సమాచారం రాష్ట్రపతికి నివేదించారు. సర్వేపల్లి నుంచి దేశ ఉన్నత పదవిని అధిష్టించిన రాధాకృష్ణన్ విగ్రహాన్ని సర్వేపల్లిలో ప్రతిష్టించి ఆ మహనీయుడికి ఘననివాళి అర్పించాలి. ఇందుకోసం ట్రస్ట్ కృషి చేస్తోంది.
– సర్వేపల్లి రామ్మూర్తి, చైర్మన్, సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్
Comments
Please login to add a commentAdd a comment