Sarvepalli Radha Krishna Jayanti
-
‘సర్వేపల్లి’ మనుమడు కేశవ్ దేశిరాజు కన్నుమూత
సాక్షి,చెన్నై/బాపట్ల: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు (కుమార్తె కుమారుడు), విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు (66) చెన్నైలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తన తాత రాధాకృష్ణన్ జయంతి రోజునే ఆయన తనువు చాలించడం విచారకరం. కేశవ్ పూర్వీకులు బాపట్లలోని దేశిరాజు వారి వీధిలో నివసించారు. ఇప్పటికీ చాలామంది దేశిరాజు కుటుంబాల వారు అక్కడ ఉన్నారు. 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేశవ్.. కేంద్ర ఆరోగ్య శాఖ, వినియోగదారుల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. తన తాత సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిని అణువణువునా పుణికిపుచ్చుకున్న కేశవ్ దేశిరాజు అనేక పుస్తకాలు రాశారు. కేశవ్ దేశిరాజు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ సంతాపం తెలిపారు. -
మన ఆచార్యుడు సర్వేపల్లి
‘తరగతి గదిలో దేశ భవిష్యత్ ఉంటుందని’ చాటిన ఆచార్యుడు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్’ మన జిల్లా వాసి కావడం గర్వకారణం. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా, తర్వాత రోజుల్లో దేశప్రథమ పౌరుడిగా దేశవిదేశాల్లో ఎంతో కీర్తి గడించారు. రాధాకృష్ణన్‌కు సింహపురితో ఎనలేని అనుబంధం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన తన పూర్వీకుల జన్మస్థలి సర్వేపల్లి రుణాన్ని తనకు దక్కిన అవకాశంతో రాష్ట్రపతి హోదాలో తీర్చుకున్నారు. జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు. సాక్షి, నెల్లూరు(బృందావనం): సామాన్య కుటుంబంలో పుట్టి.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఆచార్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పూర్వీకులది వెంకటాచలం మండలం సర్వేపల్లి. సెప్టెంబరు 5, 1888న తెలుగు సంప్రదాయ కుటుంబం సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రాధాకృష్ణన్ తాత అవ్వలు సర్వేపల్లి సీతారామయ్య, కొండమ్మ స్వగ్రామం సర్వేపల్లిని వీడి 19వ శతాబ్దం మొదటలోనే అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తణ్ణిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పూర్వీకులు కరణాలు, మునసుబులుగా వివిధ హోదాల్లో రెవెన్యూ శాఖల్లో పనిచేశారు. ప్రాథమిక విద్య రాధాకృష్ణన్ ఐదేళ్ల వయస్సులోనే తిరుత్తణ్ణిలో పాఠశాల విద్యాభ్యాసం ప్రారంభమైంది. అప్పటి పరిస్థితుల్లో రాధాకృష్ణన్ నాన్నకు తన కుమారుడికి ఇంగ్లిష్ నేర్పించడం ఇష్టం లేదు. దీంతో సంస్కృతం నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే స్నేహితులు, బంధువుల సలహాలతో మిషనరీ స్కూల్లో ఇంగ్లిష్ సాధన జరిగింది. అనంతరం తిరుపతిలోని లూథరన్ మిషన్ హైస్కూ ల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌ను అభ్యసించారు. ఆ తర్వాత వేలూరులోని వర్గీస్ కాలేజీలో ప్రీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఫెలో ఆఫ్ ఆర్ట్స్ (ఎఫ్ఏ)లో చేరారు. ఆ కోర్సును అభ్యసిస్తున్నప్పుడే పదిహేనేళ్ల వయస్సులోనే శివకమ్మతో వివాహం జరిగింది. అనంతరం మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ కోర్సును పూర్తి చేశారు. 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మైసూరు విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగానికి అధిపతిగా నియమించింది. అనంతరం కోల్కత్తా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో సుదీర్ఘకాలం బోధనలు చేశారు. నెల్లూరీయుడితో కుమార్తె వివాహం సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పెద్ద కుమార్తె పద్మావతిని ఉత్తమ సంప్రదాయాలు కలిగిన ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన వీఆర్ కళాశాల కమిటీ సభ్యుడిగా ఉన్న మోదవోలు చెంగయ్య పంతులు కుమారుడు మోదవోలు శేషాచలపతికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆయకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఆయన బంధువర్గం ఇప్పటికీ నెల్లూరు, కందుకూరు, మద్రాసు తదితర ప్రాంతాల్లో ఉన్నారు. రాధాకృష్ణన్ మేనత్త నెల్లూరులో ఉన్న పురమందిరం (టౌన్‌హాల్) వీధిలో నివాసం ఉండేవారు. బెజవాడ గోపాల్‌రెడ్డికి అభినందన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డిని ఒక వేదికపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ సందర్భంగా ఒక చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న తన చిత్రం వద్ద తెలుగులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ సంతకం చేసి మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. రాష్ట్రపతి హోదాలో కోనేరు బాగు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో సర్వేపల్లిలోని కోనేరును బాగుచేయించారు. మేమంతా ఆయన కుటుంబానికి సంబంధించి ఐదు, ఆరు తరాల వారం. సర్వేపల్లికి తాగునీరు అందించే కోనేరు నాడు పాచిపట్టి పోయింది. బాగు చేసే వారు లేకపోవడంతో నాడు మునసుబుగా విధులు నిర్వహిస్తున్న మా సోదరుడు సర్వేపల్లి సుబ్బారావు కోనేరు దుస్థితిపై రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన ఆయన నాడు వెంకటాచలం సమితి అధికారులకు తక్షణమే కోనేరు బాగు చేయించాలని సూచించారు. దీంతో నాడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులపై చేరుకుని కోనేరు బాగు చేయించి ఆ సమాచారం రాష్ట్రపతికి నివేదించారు. సర్వేపల్లి నుంచి దేశ ఉన్నత పదవిని అధిష్టించిన రాధాకృష్ణన్ విగ్రహాన్ని సర్వేపల్లిలో ప్రతిష్టించి ఆ మహనీయుడికి ఘననివాళి అర్పించాలి. ఇందుకోసం ట్రస్ట్ కృషి చేస్తోంది. – సర్వేపల్లి రామ్మూర్తి, చైర్మన్, సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ -
బడి.. రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్థకత కల్పించేది మాత్రం ఉపాధ్యాయులే. అటువంటి గురువులను పూజించడం, సన్మానించడం కోసం జరుపుకునే వేడుకే ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఈ వేడుక కోసం న గరంలోని అన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో గురువులను అలరించేందుకు చిన్నారులు ఇంకారిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రధాని ప్రసంగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసా రం చేసేందుకు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇందుకోసం కొన్ని పాఠశాలలు పని వేళల్లో మార్పులుచేశాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. సాధారణంగా యేటా టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలను కూడా కొన్ని స్కూళ్లు రద్దుచేసుకున్నాయి. అన్ని తరగతుల విద్యార్థుల కోసం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేని పాఠశాలలు పై తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారం చూపించి, కింది తరగతి విద్యార్థులకు మరుసటి రోజు చూపించాలని నిర్ణయించాయి. పదో తరగతి, ఆపై క్లాసుల విద్యార్థులకు శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తామని, ప్రసంగాన్ని రికార్డింగ్ చేసి కింది తరగతుల విద్యార్థులకు శనివారం చూపుతామని ధౌలాకువాలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిబోస్ చెప్పారు. అన్ని తరగతుల విద్యార్థులకు శుక్రవారం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోయినందువల్ల రెండ్రోజులు ప్రసంగం చూపించే ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. సాధారణంగా నిర్వహించే టీచర్స్ డే కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాల పనివేళలను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు మార్చినట్లు లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఐదో తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని చూపుతామని, ఇందుకోసం 12 తరగతి గదుల్లో ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ ఉషారామ్ చెప్పారు. టీచర్స్ డే వేడుకలను శనివారం జరుపుకోవాలని పాఠశాల నిర్ణయించిందన్నారు. వసంత్‌కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పనివేళలను మధ్యాహ్నానికి మార్చాయి. 1000 మంది చిన్నారులతో ప్రధాని ముచ్చట్లుప్రధానమంత్రి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4.45 గంటల వరకు మనేక్షా ఆడిటోరియంలో 1000 మంది విద్యార్థులతో మాట్లాడతారు. ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షప్రారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు దూరదర్శన్, ఇతర ఎడ్యుకేషనల్ చానళ్ల ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తారు. ప్రధానమంత్రి విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థులతో ముచ్చటిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నగరంలోని మున్సిపల్ పాఠశాలలు కూడా ఏర్పాట్లు చేశాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 750 స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 589 స్కూళ్లు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 550 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లన్నింటిలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాట్లు జరి గాయి. పలు మున్సిపల్ స్కూళ్లు ఒక రోజు కోసం కేబుల్ కనెక్షన్లు తీసుకున్నా యి. టీవీలు, ప్రొజెక్టర్లు అద్దెకు తెచ్చాయి. రెండు షిఫ్టులలో పనిచేసే స్కూళ్లలో ఉదయం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన డం నుంచి మినహా యింపు ఇచ్చారు. మధ్యాహ్నం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులు, సాధారణ వేళలో పనిచేసే స్కూళ్లలో విద్యార్థులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది.