వివాహిత దారుణహత్య | Married Woman Murder In Anantapur | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణహత్య

Published Sat, Sep 8 2018 11:55 AM | Last Updated on Sat, Sep 8 2018 11:55 AM

Married Woman Murder In Anantapur - Sakshi

విజయలక్ష్మి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకట్రావు, సీఐ ప్రసాద్‌రావు

ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికని ఇంటి నుంచి బయల్దేరిన వివాహిత దారుణహత్యకు గురైంది. చున్నీతో గొంతుకు బిగించి.. ఆనక బండరాయితో తలపై మోది అంతమొందించారు. కూడేరు మండలం శివరాంపేట సమీపాన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం మిన్నంటింది.

అనంతపురం, కూడేరు: బుక్కపట్నంకు చెందిన విజయలక్ష్మి(22)కి అనంతపురంలోని గణేష్‌ నగర్‌కు చెందిన బాలాజీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి అనంతపురంలోని విజయ పబ్లిక్‌ స్కూల్‌లో టీటీసీ కోర్సు చేస్తోంది. బాలాజీ ఏటీఎంలకు నగదును సరఫరా చేసే ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూల్‌లో ఫంక్షన్‌ ఉందని విజయలక్ష్మి ఏడు తులాల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరింది. 11 గంటలకు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే తాను స్కూల్‌ వద్ద లేను ఫ్రెండ్స్‌ ఇంటి దగ్గర ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్‌ పని చేయకపోవడంతో ఆందోళనకు గురైన భర్త టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఆలస్యంగా వెలుగులోకి..
కూడేరు మండలం శివరాంపేట వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టలోకి ఓ వ్యక్తి బహిర్భూమికని వెళ్లాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో ఏమిటా అని చుట్టుపక్కల వెదికాడు. అక్కడ మహిళ తలపై బండరాయి వేసి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపి.. పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ  
అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్‌రావు, ఆత్మకూరు ఎస్‌ఐ సాగర్‌లు సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌తో సంఘటనా స్థలం చేçరుకుని పరిశీలించారు. మెడకు చున్నీ బిగించి ఉండడం, ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడం,  పరిసరాల్లో ఎలాంటి రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించకపోవడం చూస్తే ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

మిన్నంటిన రోదనలు
విజయలక్ష్మి మృతదేహాన్ని చూసి భర్త, తల్లిదండ్రు లు, అత్తమామలు బోరున విలపించారు. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని రెండు సంవత్సరాల కుమారుడు అమాయకంగా చూస్తుండిపోవడం అం దరినీ కలచివేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపి వేసి ఉండవచ్చని మృతురాలి తండ్రి చిన్నకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement