'ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదు'
న్యూఢిల్లీ: వచ్చే వెయ్యి రోజుల్లో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీయిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా ఢిల్లలోని మానెక్ షా ఆడిటోరియం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. డిజిటల్ ఇండియా గొప్ప ప్రయత్నం, కాని ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామాలకు కరెంట్ లేదని ఉత్తరాఖండ్ కు చెందిన భరద్వాజ్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు పై విధంగా మోదీ సమాధానం ఇచ్చారు.
ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని మోదీ అన్నారు. ఒకసారి ఉపాధ్యాయుడిగా మారిన వారు జీవితాంతం గురువుగానే ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందన్నారు. తల్లి జన్మనిస్తుంది, గురువు జీవితాన్ని ఇస్తాడని తెలిపారు. ఉపాధ్యాయులను తనను ఎంతగానో ప్రభావితం చేశారని చెప్పారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనుక ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు. చిన్నతనంలో తాను గ్రంథాలయంలో ఎక్కువసేపు గడిపే వాడినని వెల్లడించారు. రాజకీయ నేతలపై చిన్నచూపు తగదనన్నారు. నిస్వార్థంగా సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోని రావాలని విద్యార్థులకు సూచించారు.