గురుదేవోభవ
విజయవాడ(లబ్బీపేట) : రాష్ట్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం బుధవారం ఉత్సాహంగా జరిగింది. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో పాటు 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యాలతో పాటు కూచిపూడి, జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజయ్ ఇన్ యాక్షన్ అనే పుస్తకం డిజిటల్ వెర్షన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మలేషియా ప్రభుత్వం ఫెమెండోతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ ఇ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి.రత్నకుమారి హుదూద్ తుపాన్‌పై సంకలనం చేసిన పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్‌లో విద్యకు రూ.21.500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమూ బడ్జెట్‌లో 10శాతానికి మించి విద్యపై ఖర్చు చేయట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17.5 శాతం నిధులు విద్యకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మహిళా కమిషనర్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, శాసన మండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రా, సాంకేతిక, ఉన్నత విద్యశాఖల కమిషనర్ డి.ఉదయలక్ష్మి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.