టీచర్ కాబోతున్న ప్రణబ్
న్యూఢిల్లీ : దేశ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న టీచర్ కాబోతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. సెప్టెంబర్ 5న విద్యార్థులకు ప్రణబ్ పాఠాలు చెప్పనున్నట్టు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. అదేరోజు ఢిల్లీలో వివిధ ప్రభుత్వ పాఠశాలల టీచర్లతో ప్రణబ్ సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉన్న ఈ విద్యాలయంలో 11,12 వ తరగతి చదువుతున్న మొత్తం 80 మంది విద్యార్థులు ప్రణబ్ చెప్పబోయే పాఠాలకు హాజరుకానున్నట్టు ప్రకటన విడుదల చేశారు.
ఈ ఈవెంట్ను డీడీ న్యూస్, డీడీ భారతీ చానల్స్లో ఉదయం 10.30 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ యూట్యూబ్ చానల్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెబ్కాస్ట్.గవర్నమెంట్.ఇన్/ ప్రెసిడెంట్లో లైవ్గా వెబ్ కాస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విడుదల చేయబోయే "ఉమాంగ్ 2015" బుక్లెట్ తొలి ప్రతిని ప్రణబ్ అందుకోనున్నారు.