ఏకీకృత రూల్స్‌పై రాజముద్ర
► టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై రాష్ట్రపతి సంతకం
♦ రెండు, మూడు రోజుల్లో గెజిట్ విడుదలయ్యే అవకాశం
♦ ఇక పెద్ద సంఖ్యలో టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా
♦ 30 వేల మంది ఉపాధ్యాయులకు అందనున్న ప్రమోషన్లు
♦ మరో 22 వేల మంది రిటైర్డ్ టీచర్లకు తప్పిన రివర్షన్ గండం
♦ పర్యవేక్షణాధికారుల నియామకానికి మార్గం సుగమం
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్’పై రాజముద్ర పడింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రూపొందించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఫైల్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సంతకం చేశారు. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
ఆ వెంటనే తెలంగాణ, ఏపీల్లోని పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీసు రూల్స్ అమలుకానున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 1.20 లక్షల మంది టీచర్లుండగా.. అందులో 1.03 లక్షల మంది పంచాయతీరాజ్, 17 వేల మంది వరకు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ఇకపైనా పేర్లు వేరుగానే ఉన్నా ఒకే మేనేజ్‌మెంట్‌గా పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి సీనియారిటీని వర్తింపజేసేలా ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తెస్తారు.
ఇప్పటిదాకా వేర్వేరుగా..
రాష్ట్రంలో నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, వివిధ పంచాయతీరాజ్ సంస్థల పరిధిలో నడిచే పాఠశాలలు ఉన్నాయి. సాంకేతికంగా రెండూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే అయినా.. వారికి మిగతా వేర్వేరు సర్వీసు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోని ఉపాధ్యాయులు లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ అయి ఉండగా.. పంచాయతీరాజ్ టీచర్లు ఏ కేడర్ అనేదానిపై ఎలాంటి వివరాలూ లేవు. దీంతో నేరుగా ప్రభుత్వ సర్వీసులైన మండల విద్యాధికారి (ఎంఈవో), జిల్లా ఉప విద్యాధికారి (డిప్యూటీఈవో), డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ తదితర పోస్టుల్లోకి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంపై న్యాయపరమైన వివాదం తలెత్తింది.
దీనికారణంగా ఆయా పోస్టుల్లోకి పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడంతోపాటు ఉమ్మడి సర్వీసు నిబంధనలు తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. తాజాగా దీనికి సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో సర్వీసు రూల్స్ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. దీంతో గెజిట్ విడుదల కాగానే పూర్తిస్థాయి సర్వీసు రూల్స్‌ను విద్యాశాఖ అమల్లోకి తేనుంది. ఇందుకు అవసరమైన నిబంధనలను విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసుకుంది.
భారీగా పదోన్నతులు
ఏకీకృత సర్వీసు రూల్స్‌తో రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు మార్గం సుగమమైంది. దాదాపు 30 వేల మంది టీచర్లకు వెంటనే పదోన్నతులు లభించనున్నాయి. అంతేకాదు 1998, 2005 సంవత్సరాల్లో పదోన్నతులు పొంది.. ప్రస్తుతం రిటైరైన మరో 22 వేల మంది టీచర్లకు రివర్షన్ గండం తప్పింది. ఇక పదోన్నతులతో పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీకానుండడంతో.. పాఠశాలల్లో పక్కాగా పర్యవేక్షణకు మార్గం సుగమం కానుంది.
తొలుత స్కూల్ అసిస్టెంట్లకు..
సర్వీసు రూల్స్ వివాదంతో పదోన్నతులు నిలిచిపోయిన మండల విద్యాధికారి (ఎంఈవో), జిల్లా ఉప విద్యాధికారి (డిప్యూటీఈవో), డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ వంటి పోస్టుల్లోకి తొలుత పదోన్నతులు జరుగనున్నాయి. సీనియారిటీ కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్‌మాస్టర్లుగా (100 శాతం పోస్టులు పదోన్నతులపైనే), డైట్ లెక్చరర్లుగా, జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. 40 శాతం జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా 70 శాతం పోస్టుల్లో పదోన్నతులు కల్పిస్తారు.
జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) పనిచేసే లెక్చరర్లకు సీనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు లభించనున్నాయి. ముఖ్యంగా 1998లో ఒకసారి, 2005లో మరోసారి తప్ప నియామకాలు లేక ఈ పర్యవేక్షణాధికారి పోస్టులు, లెక్చరర్ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉండిపోయాయి. ప్రస్తుతం వాటన్నింటిని భర్తీ చేస్తారు. ఇక పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి నిబంధనల మేరకు అర్హతలు ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతులు కల్పిస్తారు.
ఇదీ పర్యవేక్షణాధికారి, లెక్చరర్ పోస్టుల పరిస్థితి..
పోస్టు మంజూరైనవి పని చేస్తున్నవి ఖాళీలు
ఎంఈవో 472 39 433
డిప్యూటీఈవో 56 12 44
బీఎడ్ కాలేజీ లెక్చరర్లు 107 30 77
డైట్ లెక్చరర్లు 206 54 152
డైట్ సీనియర్ లెక్చరర్లు 70 9 61
ప్రస్తుతమున్న ఎంఈవో పోస్టులే కాకుండా జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మంజూరైన 125 మండలాలకు కూడా ఎంఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వాటిని కూడా సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు.
మున్సిపల్ టీచర్లకు వర్తించదు
‘‘రాష్ట్రపతి ఆమోదం తెలిపినప్పటికీ టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ మున్సిపల్ టీచర్లకు వర్తించవు. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు మా ఫెడరేషన్ వ్యతిరేకం. వాటిని మున్సిపల్ టీచర్లకు వర్తింప చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యం. అందువల్ల మున్సిపల్ టీచర్లు భయపడాల్సిన అవసరం లేదు..’’ – మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ