అమ్మనాన్నలు వేలు పట్టుకుని నడక నేర్పితే.. గురువు చేయిపట్టుకుని అక్షరాలు దిద్దించడమే గాక నడత నేర్పి బంగరు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. అందుకే మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి విశిష్ట స్థానం గురువుది. నేడు గురుపూజోత్సవం. బోధనా వృత్తిలో కొనసాగుతూనే సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో తమకంటూ ప్రత్యేక తను సంతరించుకున్నవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారిలో పలువురి గురించి..
నేడు గురుపూజోత్సవం
గురుబ్రహ్మ, గురుర్విష్టు:
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
కడప కల్చరల్ : మన సంస్కృతి వేదకాలం నుంచి గురువుకు విశిష్ఠ స్థానం ఇచ్చింది. తల్లి, తండ్రి తర్వాత అంతటి స్థానాన్ని గురువుకే దక్కింది. కౌరవ, పాండవుల గురువు ద్రోణాచార్యులు శ్రీకృష్ణ కుచేలుని గురువు సాందీపుడు, స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్యులు, రామానుజా చార్యులకు విశిష్ఠ గురువులుగా పేరుంది. బోధనా వృత్తి నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాధారణ గురువుగా జీవితాన్ని ప్రారంభించారు.
తన అసాధారణ మేథస్సుతో భారత రాష్ట్రపతిగా గౌరవం పొందిన ఏపీజే అబ్దుల్ కలాం ఉత్తమ శ్రేణి గురువుగా పేరు గాంచారు. సామాన్య ఉపాధ్యాయుడి నుంచి దేశానికి రెండో రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయి గౌరవం పొంది గురువు స్థానానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబరు 5న గురుపూజోత్సవంగా, ఉపాధ్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. విశిష్ఠ సేవలందించిన వారిని ఆ రోజున జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఘనంగా సత్కరించి ఆహ్వానిస్తోంది. కేవలం ఉపాధ్యాయునిగా తమ బోధనలతో విద్యార్థులకు జ్ఞాన ప్రదానం చేయడమే గాక, ఇతర రంగాల్లోనూ తమ ప్రతిభను చాటి ఇటు విద్యార్థుల్లో స్పూర్తి నింపడమే గాకుండా అటు ఉపాధ్యాయ లోకానికి కీర్తి కిరీటాలుగా నిలిచిన వారూ జిల్లాలో ఎందరో ఉన్నారు.
కవులు, రచయితలు
శివతాండవ కర్త, సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శివభారత కర్త గడియారం వేంకట శేషాచార్యులు ఉపాధ్యాయులుగా ఉంటూనే ఉన్నత శ్రేణి కవులుగా వెలిగారు. అవధానం చంద్రశేఖర్‌శర్మ, మహాకవి భూతపురి సుబ్రమణ్యశర్మ, బ్రౌన్ ఊహా చిత్ర శిల్పి మైనంపాటి సుబ్రమణ్యం, సాహితీవేత్త ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, అవధాని నరాల రామారెడ్డి, సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాత డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కూడా బోధనా రంగానికి చెందిన వారే. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి బోధనా వృత్తితో పాటు సాహితీ రంగంలో పేరుగడించారు. ప్రస్తుతం కథ, నవలా రంగాల్లో విశేష ప్రతిభ చాటుతున్న సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, వేంపల్లె గంగాధర్, తవ్వా ఓబుల్‌రెడ్డి ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు.
ఉర్దూలో
ఉర్దూ భాషకు సంబంధించి కడపలో పలువురు కవులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరంతా బోధకులే కావడం విశేషం. వారిలో డాక్టర్ రాహి ఫిదాయి, సత్తార్‌ఫైజీ, షకీల్ అహ్మద్, హిందీ భాష సేవకుడిగా ఫర్హతుల్లా ఉపాధ్యాయులుగా ఉంటూనే ఆయా రంగాల్లో ప్రతిభ చాటారు.
సమాజ సేవలో
మరికొందరు ఉపాధ్యాయులు సమాజిక సేవకులుగా ఉపాధ్యాయ లోకానికి గౌరవం తెచ్చిపెట్టారు. శాంతిసంఘం ప్రధాన కార్యదర్శిగా రాజారత్నం ఐజాక్, ఇంటాక్ కన్వీనర్‌గా పర్యావరణ అభివృద్ధి, జిల్లాలోని వారసత్వ కట్టడాల పరిరక్షకునిగా సిద్దవటం సీతారామయ్య, ఇంటాక్ ప్రస్తుత బాధ్యులు ఎలియాస్‌రెడ్డి, జిల్లాలో రక్తదాన ఉద్యమకర్త బోగా చిన్నయ్య కూడా బోధనా రంగానికి చెందిన వారే.
గురువుకు వందనం
Published Fri, Sep 5 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement