న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్ శుక్రవారం పాఠశాలగా మారిపోయింది. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయకు చెందిన ఇంటర్ విద్యార్థులకు పాఠం బోధించారు. 'భారత రాజకీయ చరిత్ర' అనే అంశాన్ని పాఠ్యాంశంగా తీసుకున్నారు. అంతకుముందు తన బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాష్ట్రపతి తాను ప్రైమరీ పాఠశాలకు వెళ్లే రోజుల్లో కొంత బద్ధకస్తుడినని, సాధారణ విద్యార్థిగా ఉండేవాడినని చెప్పారు. వారానికి మూడు నాలుగు రోజులు స్కూల్కి వెళితే గొప్పే అని అన్నారు.
ఇంటికొచ్చిన ప్రతిసారి తాను అంతదూరం(ఐదు కిలో మీటర్లు) స్కూల్కి నడిచి వెళ్లలేనని అంటుండేవాడినని తెలిపారు. అయితే, ఇంటర్, గ్రాడ్యుయేషన్ సమయానికిగానీ తాను క్లాస్లో కుదురుకోలేకపోయానని చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో చాపపై కూర్చునే వారిమని అన్నారు. ఇప్పుడు మీకు అలాంటి పరిస్థితులు లేవని చక్కగా చదుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పాఠ్యాంశంలోకి వెళుతూ భారత దేశ స్వాతంత్ర్యం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయం, రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలు, ఆ అంశాలు కలిగిన దేశాల ప్రస్తావన చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తీరు తెన్నులు కూడా రాష్ట్రపతి విద్యార్థులకు వివరించారు.
టీచర్ అవతారమెత్తిన రాష్ట్రపతి
Published Fri, Sep 4 2015 12:23 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement