
ఊరించి.. ఉసూరుమనిపించి
- నోటిఫికేషన్ రాకపోవడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
- మంత్రుల విరుద్ధ ప్రకటనతో మరింత గందరగోళం
- అవనిగడ్డలో వినూత్న నిరసన
- దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
చల్లపల్లి/మచిలీపట్నం : మాటలతో మభ్యపెడుతున్న పాలకులపై డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించిన పాలకులు.. ఇప్పుడు నోరు మెదపకపోవడంపై మండిపడుతున్నారు. సిలబస్‌లో స్పష్టత కొరవడటం, డీఎస్సీ, టెట్ కలిసి నిర్వహించడం, పోస్టుల వివరాలు వెల్లడించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగానే శనివారం అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డీఎస్సీకి శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
పోస్టుల ప్రకటనలో గందరగోళం
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరిచుకుని సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మొత్తం 10,603 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కేవలం 7,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యా శాఖ గణాంకాలు ద్వారా తెలుస్తోంది. పిల్లలను బట్టే ఉపాధ్యాయులు ఉండేవిధంగా రేషనలైజేషన్‌ను ప్రకటించి పోస్టులను తగ్గించారని సమాచారం. గతంలో ప్రకటించిన పోస్టుల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌లకు ఎవరికెన్నో వివరించలేదు. వీటిలో ఎస్‌జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. డీఎస్సీకి పోటీ పడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, మరో 60వేల మంది డీఈడీ అభ్యర్థులు ఉన్నారు.
సిలబస్, టెట్‌ల విషయంలోనూ అంతే
డీఎస్సీ సిలబస్‌పైనా ఇంతవరకూ స్పష్టతలేదు. డీఎస్సీ-2012 సిలబస్‌నే కొనసాగిస్తామని చెప్పినప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. పాత సిలబస్ ప్రకారం రెండేళ్లుగా అవనిగడ్డలో 40వేల మందికిపైగా శిక్షణ పొందారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన 10వేల మంది శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను వదిలి వచ్చారు.
ఏడాది శిక్షణ పొందేందుకు భోజనం, వసతి, ఫీజులు కలిపి ఒక్కో అభ్యర్థికి రూ.1.50లక్షలు ఖర్చు అవుతుంది. డీఎస్సీలో అంతర్భాంగా టెట్‌ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన 3లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా.. లేదా.. అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
అందోళనకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అవనిగడ్డలో వినూత్న నిరసన తెలియజేశామని, వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే తొలుత జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా, అనంతరం రాజధానిలో ఆందోళనలు చెపడతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి గందరగోళానికి తెరదించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
జిల్లాలో 379 పోస్టులు
జిల్లాలో స్కూలు అసిస్టెంట్ పోస్టులు 104, లాంగ్వేజ్ పండిట్-49, పీఈటీలు-13, ఎస్‌జీటీలు-213 మొత్తం 379 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. రేషనలైజేషన్ ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలకు సర్ధుబాటు చేస్తే జిల్లాలో 30 ఎస్‌జీటీ పోస్టులే ఖాళీగా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే ఆ పోస్టును ఖాళీగా చూపే అవకాశం లేదు. దీంతో ఎస్‌జీటీ పోస్టులను అధికంగా చూపేందుకు అవకాశం లేదు. విద్యాశాఖాధికారులు రేషనలైజేషన్ ప్రకారం సంబంధిత ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు బదిలీ చేసినా, ఆ పోస్టులను ఖాళీగా చూపటంతో ఎస్‌జీటీలను 213 మందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.
ఈ అంశాన్ని గమనించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ జాప్యం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకముందే టీచర్లు అవసరమైన చోట అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిం ది. జిల్లాలో 271 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియమిస్తారా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆర్టికల్ 371-డి వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు.
‘సుప్రీం’ తీర్పు ప్రకారమే నడవాలి
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గతంలో ఎస్‌జీటీలకు డీఎడ్ అభ్యర్థులను మాత్రమే అనుమతిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తి పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది
- మెట్ల గురవయ్య, కంభం, ప్రకాశం జిల్లా
మోసం చేశారు..
ఉపాధ్యాయ దినోత్సవం రోజు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన పాలకులు మోసం చేశారు. పాలకులకు మా సమస్యలు తెలియవా. మా జీవితాలతో ఆటలాడుకోకుండా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి.
- పి.దావీదు, నూజివీడు
పోస్టులను తగ్గించొద్దు
మొత్తం 18,500 పోస్టులు ఉంటే గతంలో 10,600 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 7,500 పోస్టులకు మాత్రమే ఆమోదం లభించిందని మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రెం డేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. పోస్టులు తగ్గించకుండా గతంలో ప్రకటించిన పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.
- ఎస్.నాగరాజు, చోడవరం, విశాఖ జిల్లా