సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారాలు–2021కు పాఠశాల విద్యా శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. అన్నిరకాల స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, ఐఏఎస్‌ఈ, డైట్‌కు చెందిన ప్రిన్సిపాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీఎస్) తదితరులకు ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత గ్రేడ్ కలిగిన హెడ్ మాస్టర్లకు కనీసం 15 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఉపాధ్యాయులకు పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సాధారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులు కాదు. కానీ కొన్ని ప్రత్యేకతలున్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఏఎస్‌ఈ, డైట్, సీటీఈఎస్‌లో పనిచేసే లెక్చరర్లు లేదా సీనియర్ లెక్చరర్లకు కనీసం పదేళ్ల బోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
పరిగణనలోకి ‘హరితహారం’..
హరితహారం కార్యక్రమంలో అత్యుత్తమ కృషి సాధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను పరిగణనలోకి తీసుకుంటారు. 2019–21 మధ్య కాలంలో పాఠశాలల్లో చేపట్టిన హరితహారం మొక్కల మనుగడను పరిగణిస్తారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పేర్లను ఖరారు చేస్తాయి.
ప్రతి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు..
జిల్లా స్థాయి ఎంపిక కమిటీలో కలెక్టర్, డీఈవో, డైట్ ప్రిన్సిపాల్, మరో జిల్లా స్థాయి అధికారి ఉంటారు. జిల్లా నుంచి ఈ కమిటీ మూడు పేర్లు ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్ ఉంటారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు సిల్వర్ మెడల్ (గోల్డ్ ప్లేటెడ్), శాలువా, రూ.10 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్ ఇస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను జిల్లా కమిటీలు వచ్చే నెల 10 లోపు రాష్ట్ర కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆయా పేర్ల నుంచి జ్యూరీ కొందరిని ఎంపిక చేసి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను ఖరారు చేస్తుంది. మొత్తంగా వివిధ కేటగిరీల్లో 43 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment