గురువులకు గౌరవం  | CM YS Jagan personally presented awards to 180 Teachers | Sakshi
Sakshi News home page

గురువులకు గౌరవం 

Published Tue, Sep 6 2022 3:34 AM | Last Updated on Tue, Sep 6 2022 3:04 PM

CM YS Jagan personally presented awards to 180 Teachers - Sakshi

కర్నూలు ప్రభుత్వ మహిళా కాలేజ్‌ అధ్యాపకురాలు ఇర్ఫాన్‌ బేగంకు పురస్కారం అందజేస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర,  జిల్లా, పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గౌరవ పురస్కారాలు అందించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గురుపూజోత్సవాల బహిష్కరణకు పిలుపునిచ్చినా టీచర్లు ఎక్కడా దానిని పట్టించుకోలేదు. గతంలో కన్నా ఎక్కువ ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరై గురువులను సన్మానించారు.

గతంలో గురుపూజోత్సవాలకు భిన్నమైన వాతావరణంలో ఈసారి వేడుకలు జరిగాయి. గతంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులకు సరైన గౌరవం దక్కేది కాదు. నేతలు, ఇతరుల ప్రసంగాలకే ఎక్కువ సమయం వెచ్చించే వారు. సీఎం చేతుల మీదుగా నలుగురైదుగురికి అవార్డులు పంపిణీ చేయించి మమ అనిపించేవారు. దీంతో మిగతా వారు నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారు.

అయితే ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా 180 మందిని ఎంపిక చేయగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ స్వయంగా మెమెంటో, బెస్ట్‌ టీచర్‌ ధ్రువపత్రాన్ని అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో కొంత మంది వీల్‌ చైర్‌లో రాగా, సీఎం ఎంతో గౌరవంగా కిందకు వంగి కూర్చొని మరీ వారికి అవార్డులు అందించారు. గురువుల పట్ల సీఎం వినయ విధేయతలు చూపడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, అధికారులు పాల్గొన్నారు. 
విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్‌ బలగా సుమనకు పురస్కారం అందజేస్తున్న సీఎం జగన్‌ 

స్నేహ పూర్వక ప్రభుత్వమిది: మంత్రి  బొత్స సత్యనారాయణ 
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల స్నేహ పూర్వకంగా ఉండే ప్రభుత్వం ఇది. వారి ప్రయోజనాల పరిరక్షణలో సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారు. మన పిల్లలను గ్లోబల్‌ సిటిజెన్‌గా తీర్చిదిద్దాలనే తపనతో సీఎం విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు కింద సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో మొదటి విడత దాదాపు 16 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు.

అమ్మ ఒడి, విద్యా దీవెన, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, పిల్లలకు బైజూస్‌ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తదితర ఎన్నో పథకాలు చేపట్టాం. పాఠశాలలన్నీ దశల వారీగా సీబీఎస్‌ఈకి అనుసంధానిస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యాపక వృత్తిలో ఉన్న వారందరికీ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. పదోన్నతులు కల్పిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement