లెక్కల టీచరు లీవ్ పెట్టాడని తెలిస్తే పండగ.
తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పిరియడ్ ఉన్నా పండగే.
సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు...
కొడతాడా... పాడా...
గ్రామర్ చెప్పే ఇంగ్లిష్ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు.
ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్ టీచరు ఇంకో అమ్మ.
ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు.
ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం
తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి.
ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్ ట్రావెల్ చేయాల్సిందే.
కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్‌రూమ్ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు.
బెత్తం ఫిలాసఫీ
‘దండం దశగుణం భవేత్’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు.
కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్‌ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్‌పీస్‌ను ఉండేలు కన్నా షార్ప్‌గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్‌ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్‌లో ఐస్ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు.
మూడీ...
కొందరు టీచర్లు మూడ్ బాగుంటే క్లాసు కేన్సిల్ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్‌లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం.
ఇష్ట/అయిష్ట టీచర్లు
స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్ క్లవర్లకు సోషల్ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్ పేపర్ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్ టీచర్ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు.
సింహస్వప్నం
తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్ సార్ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం.
విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్‌లో అదే తరగతిలో అదే సిలబస్ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి.
గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment