Special teachers
-
వల్లీ టీచర్... వెరీ స్పెషల్
మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ... అని నేర్చుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేటర్‌లో గురువుతోపాటు తల్లి, తండ్రి కూడా ఉంటారు. ఆ ప్రత్యేక గురువులకు ఎన్ని వందల వందనాలు సమర్పించినా తక్కువే. ఈ పిల్లలకు ప్రేమను పంచడానికే అంకితమైన వల్లీసుధీర్కి ప్రత్యేక వందనం! భగవంతుడు కొంతమంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్. స్పెషల్ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్. సినిమారీళ్లన్ని మలుపులు! ‘‘నేను స్పెషల్ టీచర్ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు. ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్కార్ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మకు పరీక్షలు పెట్టానట! పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం... వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు. అంతే... నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్ డెలివరీ కాదని సిజేరియన్ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్. అవన్నీ మణిపాల్ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ... ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్‌కి సర్వీస్ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్ చిల్డ్రన్‌కి సర్వీస్ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్ఆర్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్’ కోర్సు చేశాను. స్వతంత్రులుగా నిలబెట్టాలి! స్పెషల్ చిల్డ్రన్ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్ నీడ్స్... అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్ స్కిల్స్, అంటే... తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి. ఇక మూడవది కాగ్నిటివ్ స్కిల్స్, అంటే... ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను. కానీ ముందే చెప్పాను కదా! నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్ స్కూల్లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్ ఉప్కార్ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి. పిచ్చి టీచర్ అనేవాళ్లు! సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్’, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్ చిల్డ్రన్ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్ కిడ్ ఉంటే ఆ కిడ్ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు. విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్ కిడ్స్ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్ కిడ్, ఒకరు నార్మల్ కిడ్ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్ కిడ్ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్ కిడ్స్ కోసం పని చేస్తూనే ఉంటాను’’ అన్నారు వల్లీసుధీర్. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే! ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... స్పెషల్ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు. – వల్లీ సుధీర్, స్పెషల్ టీచర్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్
లెక్కల టీచరు లీవ్ పెట్టాడని తెలిస్తే పండగ. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పిరియడ్ ఉన్నా పండగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు... కొడతాడా... పాడా... గ్రామర్ చెప్పే ఇంగ్లిష్ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు. ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్ టీచరు ఇంకో అమ్మ. ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు. ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి. ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్రూమ్ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు. బెత్తం ఫిలాసఫీ ‘దండం దశగుణం భవేత్’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు. కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్పీస్ను ఉండేలు కన్నా షార్ప్‌గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్‌ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్లో ఐస్ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు. మూడీ... కొందరు టీచర్లు మూడ్ బాగుంటే క్లాసు కేన్సిల్ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్‌లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం. ఇష్ట/అయిష్ట టీచర్లు స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్ క్లవర్లకు సోషల్ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్ పేపర్ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్ టీచర్ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు. సింహస్వప్నం తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్ సార్ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం. విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్లో అదే తరగతిలో అదే సిలబస్ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. -
జ్ఞానధారతో సామర్థ్యాల పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా చదువులో వెనుకబడిన విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని రూపొందించింది. అత్యవసరంగా 2017–18 విద్యా సంవత్సరంలో వెనుకబడిన పిల్లల సామర్థ్యాలను పెంచటంతో పాటు, 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలుగు, గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో నిర్ధేశిత స్థాయిలను విద్యార్థులు చేరుకునేలా చేయడం కార్యక్రమం లక్ష్యం. జ్ఞానధార 1, 2 పేరిట సమ్మర్ రెమిడియల్ టీచింగ్ కార్యక్రమం ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరగనుంది. ఒంగోలు:2017లో నిర్వహించిన సమ్మేటివ్ –1 పరీక్షల్లో 5వ తరగతి, 9వ తరగతిలో కనీస అభ్యసనా సామర్థ్యాలను చేరుకోలేకపోయిన విద్యార్థులకు జ్ఞానధార సమ్మర్ రెమిడియల్ టీచింగ్ ద్వారా విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించి 6, 10 తరగతుల వారు రాణించేలా మొదటిదశకు రూపకల్పన చేశారు. జ్ఞానధార 1 పూర్తయ్యేనాటికి కనీస సామర్థ్యాలను అందుకోలేని విద్యార్థులకు జ్ఞానధార 2 పేరిట ఏడాది పొడవునా ప్రత్యేక బోధన ఉంటుంది. గణితంలో ఫండమెంటల్స్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో బేసిక్స్, ఇంగ్లీషులో కాంపోనెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లను జ్ఞానధార కార్యక్రమంలో బోధిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల మంది విద్యార్థులు ఈ బోధనకు ఎంపిక కాగా అందులో ప్రకాశం జిల్లా నుంచి 6వ తరగతిలో ప్రవేశించనున్న 4500 మంది, 10వ తరగతిలోకి ప్రవేశించనున్న 7191 మందికి ఈ శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్ తరహాలో విద్యాబోధన: 2017 డిసెంబర్లో జరిగిన సమ్మేటివ్–1లో డి–1, డి–2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు ఈ జ్ఞానధార ద్వారా శిక్షణ ఇస్తారు. అయితే ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థులను బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, కస్తూర్భాగాంధీ, మోడల్ స్కూల్స్, ఏపీ గురుకుల పాఠశాలల్లో ఈ కోచింగ్ ఇస్తారు. ఒక వేళ ఆ సెంటర్లు సరిపోకపోతే ఇంజినీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, కార్పొరేట్ పాఠశాలలను కూడా వినియోగించుకోవచ్చు. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా కోచింగ్ ప్లాన్ చేశారు. కోచింగ్‌తో పాటు వారంతపు పరీక్షలు కూడా నిర్వహించి అభ్యర్థి అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషిచేస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రంలో ఏప్రిల్ 30వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. శిక్షణ తరగతులు మే 1 నుంచి మొదలు 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఇందులో యోగ, అల్పాహారం, లంచ్‌కు సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు హోంవర్కు, 4.15 గంటల నుంచి హ్యాండ్రైటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఫిజికల్ లిటరసీ అనంతరం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అంటే గంటపాటు లఘుచిత్రాల ప్రదర్శన ఉంటుంది. అనంతరం డిన్నర్ ఉంటుంది. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఆదివారం అయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగ/ ఫిజికల్ లిటరసీ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం వారంతపు పరీక్షలు ఉంటాయి. 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తారు. అయితే వారంతపు పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కోచింగ్‌ను విద్యార్థులకు అందించదలచిన ఉపాధ్యాయులు తమ ఇష్టాన్ని తెలియజేస్తూ విద్యాశాఖకు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుకు కనీసం 20 మంది తెలుగు, ఆంగ్లం, లెక్కలు, సైన్స్‌తో పాటు పీఈటీ/పీడీలను ఎంపికచేయాల్సి ఉంటుంది. వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పిల్లలను లక్ష్యం వైపు ఉత్తేజితులను చేయగల వక్తలతో పాటు యోగ, ధాన్యం, ఆర్ట్‌లకు సంబంధించిన నిపుణులను కూడా ఆహ్వానించి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఇక డీఈడీ ట్రైన్డ్ టీచర్లను తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. ఈ శిక్షణకు విద్యాశాఖ ఇప్పటికే ఫ్రెండ్లీ వర్క్‌బుక్స్ డిజైన్ చేసే పనిలో నిమగ్నమైంది. పర్యవేక్షణ బాధ్యతలు వీరికి: జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఏఎంఓ, సీఎంఓ, ఎంఈఓ, హెచ్ఎంలు, ఎస్ఎంసీ సభ్యులతో కూడిన బృందాలు బోధన తరగతులను పర్యవేక్షిస్తారు. డిజిటల్ తరగతి గదులు, పీసీ టాబ్లెట్లు, వారంతపు అసెస్మెంట్ పరీక్షలు, గ్రాండ్టెస్టులతో పాటు ఆన్లైన్ మూల్యాంకనం చేపడతారు. మొత్తం మీద 30 రోజులపాటు నిర్వహించే ఈ ప్రణాళిక కనీసం 75 శాతం మంది అయినా నిర్ధేశిత లక్ష్యాన్ని జ్ఞానధార –1లో చేరుకునేలా ప్లాన్ చేశారు. మిగిలిన 25 శాతం మందికి జ్ఞానధార 2లో ఏడాది పొడవునా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. -
ఇంగ్లిష్ మీడియానికి ప్రత్యేక టీచర్లు!
నియామక నిబంధనల్లో మార్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు వేగిరం చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో పక్కా బోధ నకు చర్యలు చేపడుతోంది. 5వేల ప్రభుత్వ స్కూళ్ల లో గతేడాది 1వ తరగతిలో ప్రారంభించిన ఇంగ్లిష్ మీడియం తరగతుల విద్యార్థులు ఈసారి రెండో తరగతికి రానుండటం, మళ్లీ ఒకటో తరగతిలో విద్యార్థులు చేరనుండటంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లోని ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి మార్గదర్శకాల రూపకల్ప నకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ విష యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంగ్లిష్ మీడియం కలిగిన ఒకటి, రెండుతో పాటు ఇతర తర గతుల్లో ఎన్ని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కొన సాగుతున్నాయన్న వివరాలు ఇవ్వాలని డీఈవోల ను ఆదేశించారు. ఉపాధ్యాయ నియామకాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారిని ఈ పాఠశాలల కోసం ప్రత్యేకంగా నియమించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ నియామ క నిబంధనల్లో మార్పులు చేయడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న తెలుగు మీడియం టీచర్ పోస్టులను ఇంగ్లిష్ మీడి యానికి మార్పు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘ప్రత్యేక’ పోస్టులకు పొగ!
గాలిలో 860 ఖాళీలు కేంద్రం మార్గదర్శకాలకు సర్కారు ఎసరు ఆవేదనలో ‘స్పెషల్’ టీచర్లు విశాఖపట్నం: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు రాష్ర్ట ప్రభుత్వం ఎసరు పెడుతోంది. పిల్లల జనాభాలో 1.67 శాతం మంది మానసిక, శారీరక, ఇంద్రియ వైకల్యాలతో బాధపడుతున్న వారుంటారని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇలాంటి వారి ప్రవర్తనలోనూ, విద్యాభివృద్ధిలోనూ మార్పు తీసుకురావడానికి సంలీన విద్య (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్-ఐఈడీఎస్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిర్వహించే భవిత సెంటర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఇందుకోసం బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిలో 2002 నుంచి సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. ఐఈడీఎస్‌ఎస్ కింద 2011 జూన్‌లో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 800 మందిని ఎంపిక చేశారు. 2012లో వీరిని ప్రత్యేక టీచర్లుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్నుంచి నెలకు రూ.12 వేలు, 2016 ఫిబ్రవరి నుంచి రూ.15 వేల జీతం ఇస్తోంది. ఇలావుండగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి గత ఏడాది కేంద్రం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 7న 860 స్పెషల్ టీచర్ల పోస్టుల (స్కూల్ అసిస్టెంట్ల)ను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు 39ను జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 53, విశాఖపట్నంలో 58, విజయనగరంలో 49, తూర్పు గోదావరిలో 75, పశ్చిమ గోదావరిలో 61, కృష్ణాలో 65, గుంటూరులో 72, ప్రకాశం జిల్లాలో 71, మిగిలినవి ఇతర జిల్లాలోనూ నియామకాలు జరగాలి. దీని ప్రకారం రాష్ట్రంలోని 664 మండలాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ జీవోతో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్పెషల్ టీచర్లలో ఆనందం పెల్లుబికింది. త్వరలోనే తమకు మంచి రోజులొస్తాయని సంబరపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు స్పెషల్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని 70ః30 నిష్పత్తిలో భర్తీ చేసినా 560 మంది రెగ్యులర్ అవుతారు. కానీ ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం మానేసింది. వీరిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లతో సమానంగా నెలకు రూ.38 వేల జీతం చెల్లించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో రూ.37 వేలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.53 వేల వరకూ జీతాలిస్తున్నాయి. దీంతో ఆర్థిక భారంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీరిని రెగ్యులరైజ్ చేయకుండా నాన్చుతూ వస్తోంది. ఫలితంగా ఈ స్పెషల్ టీచర్లు కాంట్రాక్టు పద్ధతిలో అరకొర జీతంతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారి సంఖ్యే చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రత్యేక అవసరాలున్న (వికలాంగులు) పిల్లలు సరైన విద్యకు నోచుకోకుండా అన్యాయమై పోతున్నారు. మరోవైపు ఈ పోస్టులను సత్వరమే భర్తీ చేయని పక్షంలో ఈ 860 పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఈ స్పెషల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవ చూపి ఈ పోస్టుల్లో అర్హులైన తమను నియమించి క్రమబద్ధీకరించాలని స్పెషల్ టీచర్లు కోరుతున్నారు. -
స్పెషల్ టీచర్లకేదీ చేయూత?
- నెలకు రూ. 398 వేతనంతో పని.. ఏళ్ల తరబడి సేవలు - అయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు సర్కారు ససేమిరా - ఆందోళనలో దాదాపు 15 వేల మంది టీచర్లు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు అవసరాల కోసం వారంతా స్పెషల్ టీచర్లుగా కొద్దిపాటి వేతనంతోనే పనిచేశారు. ఇలా దాదాపు 15 వేల మంది ఏళ్ల తరబడి సేవలందించారు. అయితే ఇప్పుడు వీరికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 1983 నుంచి దశలవారీగా స్పెషల్ టీచర్లుగా నియమితులై రూ. 398 వేతనంతోనే ఏళ్ల తరబడి పనిచేసి కొంతకాలానికి పర్మనెంట్ అయ్యారు. తాము స్పెషల్‌గా పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతున్నా.. సర్కారు నుంచి స్పందన లేదు. వీరి తర్వాత నియమితులైన అన్ట్రైన్డ్ టీచర్లు, స్పెషల్ విద్యా వలంటీర్లకు రెండేళ్ల అప్రెంటిస్ కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది. ఇదీ ‘స్పెషల్’ కథ! రాష్ట్రంలో 1983 ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేరారు. అయితే ఉపాధ్యాయులు తక్కువగా ఉండటంతో భారీగా నియామకాలు అవసరమయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు సరిపడాలేకపోవడంతో అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రూ.398 వేతనంతో స్పెషల్ టీచర్లను నియమించాయి. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 50 వేలమంది రూ.398 వేతనంపై నియమితులయ్యారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లోనే 15 వేల మంది ఉండగా.. వీరిలో పండితులు, పీఈటీలే ఎక్కువ. 1995లో రెండేళ్ల అప్రెంటిస్ విధానం వచ్చింది. 2000, 2001, 2002లో బ్యాక్లాగ్ పోస్టులతోపాటు మరిన్ని పోస్టులను శిక్షణపొందని అభ్యర్థులతో(అన్ట్రైన్డ్), స్పెషల్ విద్యా వలంటీర్ల పేరుతో నియమించింది. వారు పనిచేసిన రెండేళ్ల అప్రెంటిస్ కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లను మూడేళ్ల కిందట మంజూరు చేసింది. 9వ పీఆర్సీలో ఆర్థిక ప్రయోజనం కల్పించింది. స్పెషల్ టీచర్లు ఏళ్ల తరబడి నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం విజ్ఞప్తిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ స్పెషల్ టీచర్లలో అనేక మంది పదవీ విరమణ పొందారు. నోషనల్‌గా ఇస్తే పెన్షన్‌లో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. వారు మంజూరైన పోస్టుల్లో నియమితులు కాలేదని, వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం కుదరదని ఆర్థికశాఖ చెబుతోంది. నెలకు రూ. 398తో ఐదేళ్లు పని చేశా 1984లో స్పెషల్ లాంగ్వేజ్ పండిట్‌గా చేరి నెలకు రూ. 398 వేతనంతో ఐదేళ్లు పని చేశాను. ప్రస్తుతం పదవీ విరమణ పొందాను. ఆ ఐదేళ్ల కాలాన్ని నోషనల్‌గా పరిగణనలోకి తీసుకుంటే పెన్షన్‌లో ప్రయోజనం చేకూరుతుంది. - జక్కం దామోదర్, తెలుగు పండిట్, వరంగల్ పనిచేసిన కాలానికి డబ్బులు అడగడం లేదు స్పెషల్ టీచర్‌గా పనిచేసినంత కాలం తక్కువ వేతనం ఇచ్చినా అంకితభావంతో పని చేశాం. ఆ కాలానికి అదనంగా డబ్బులివ్వమని అడగటం లేదు. ఆ కాలాన్ని నోషనల్‌గా పరిగణనలోకి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. - రాములు, నల్లగొండ ఆ నియామకాలు మాకోసం చేపట్టలేదు ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వారు నియమితులయ్యారు. వారికోసమే ప్రత్యేకంగా ఈ నియామకాలు చేపట్టలేదు. అలాంటపుడు మాకు అన్యాయం చేయడం ఏంటి? - కర్రా నరేందర్‌రెడ్డి, కరీంనగర్ తక్కువ వేతనంతో పనిచేయడం తప్పా? ఏళ్ల తరబడి నెలకు రూ. 398 వేతనంతో పనిచేసి రె గ్యులర్ టీచర్లతో సమానంగా సేవలందించారు. తక్కువ వేతనంతో పని చేయడమే మేం చేసిన తప్పా. -సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. టీచర్లులేని సమయంలో ఉద్యోగంలో చేరి విశేష సేవలందించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి. - చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వారికి న్యాయం చేయాల్సిందే అన్ట్రైన్డ్ టీచర్లకు, స్పెషల్ విద్యా వలంటీర్లకు రెండేసి చొప్పున ఇంక్రిమెంట్లు ఇచ్చారు. స్పెషల్ టీచర్లు ఏం తప్పుచేశారు. వారికి న్యాయం చేయాల్సిందే. - భుజంగరావు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి