వల్లీ టీచర్‌... వెరీ స్పెషల్‌ | sakshi special interview about Special Educator valli sudheer | Sakshi
Sakshi News home page

వల్లీ టీచర్‌... వెరీ స్పెషల్‌

Published Thu, Feb 15 2024 12:53 AM | Last Updated on Thu, Feb 15 2024 12:53 AM

sakshi special interview about Special Educator valli sudheer - Sakshi

మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ... అని నేర్చుకున్నాం. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌లో గురువుతోపాటు తల్లి, తండ్రి కూడా ఉంటారు. ఆ ప్రత్యేక గురువులకు ఎన్ని వందల వందనాలు సమర్పించినా తక్కువే. ఈ పిల్లలకు ప్రేమను పంచడానికే అంకితమైన వల్లీసుధీర్‌కి ప్రత్యేక వందనం!

భగవంతుడు కొంతమంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్‌ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్‌లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్‌లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్‌ టీచర్‌ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్‌. స్పెషల్‌ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్‌ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్‌.

సినిమారీళ్లన్ని మలుపులు!
 ‘‘నేను స్పెషల్‌ టీచర్‌ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్‌ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్‌ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు.

ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్‌కార్‌ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్‌ చిల్డ్రన్‌ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్‌ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.
 
అమ్మకు పరీక్షలు పెట్టానట!
పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం... వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్‌ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు.

అంతే... నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్‌ డెలివరీ కాదని సిజేరియన్‌ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్‌ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్‌ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్‌.

అవన్నీ మణిపాల్‌ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ... ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్‌ కిడ్స్‌కి సర్వీస్‌ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్‌ చిల్డ్రన్‌కి సర్వీస్‌ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్‌ఆర్, బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్‌ ఆఫ్‌ ఇంట్రడక్షన్‌’ కోర్సు చేశాను.  
 
స్వతంత్రులుగా నిలబెట్టాలి!
స్పెషల్‌ చిల్డ్రన్‌ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో‘శ్రద్ధ సెంటర్‌ ఫర్‌ స్పెషల్‌ చిల్డ్రన్‌’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్‌ నీడ్స్‌... అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్‌ స్కిల్స్, అంటే... తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి.

ఇక మూడవది కాగ్నిటివ్‌ స్కిల్స్, అంటే... ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను.

కానీ ముందే చెప్పాను కదా! నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్‌ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్‌లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్‌ స్కూల్‌లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్‌ ఉప్‌కార్‌ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి.  

పిచ్చి టీచర్‌ అనేవాళ్లు!
సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్‌’, ఇప్పుడు స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్‌ చిల్డ్రన్‌ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్‌ కిడ్‌ ఉంటే ఆ కిడ్‌ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు.

విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్‌ కిడ్స్‌ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్‌ కిడ్, ఒకరు నార్మల్‌ కిడ్‌ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్‌ కిడ్‌ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్‌ కిడ్స్‌ కోసం పని చేస్తూనే ఉంటాను’’ అన్నారు వల్లీసుధీర్‌.
 

ఎవరికి వాళ్లు ప్రత్యేకమే!
ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... స్పెషల్‌ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్‌ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్‌ స్కూలింగ్‌లో టెన్త్‌ క్లాస్‌ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు.   
– వల్లీ సుధీర్, స్పెషల్‌ టీచర్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement