Special education
-
వల్లీ టీచర్... వెరీ స్పెషల్
మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ... అని నేర్చుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేటర్‌లో గురువుతోపాటు తల్లి, తండ్రి కూడా ఉంటారు. ఆ ప్రత్యేక గురువులకు ఎన్ని వందల వందనాలు సమర్పించినా తక్కువే. ఈ పిల్లలకు ప్రేమను పంచడానికే అంకితమైన వల్లీసుధీర్కి ప్రత్యేక వందనం! భగవంతుడు కొంతమంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్. స్పెషల్ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్. సినిమారీళ్లన్ని మలుపులు! ‘‘నేను స్పెషల్ టీచర్ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు. ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్కార్ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మకు పరీక్షలు పెట్టానట! పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం... వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు. అంతే... నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్ డెలివరీ కాదని సిజేరియన్ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్. అవన్నీ మణిపాల్ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ... ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్‌కి సర్వీస్ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్ చిల్డ్రన్‌కి సర్వీస్ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్ఆర్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్’ కోర్సు చేశాను. స్వతంత్రులుగా నిలబెట్టాలి! స్పెషల్ చిల్డ్రన్ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్ నీడ్స్... అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్ స్కిల్స్, అంటే... తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి. ఇక మూడవది కాగ్నిటివ్ స్కిల్స్, అంటే... ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను. కానీ ముందే చెప్పాను కదా! నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్ స్కూల్లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్ ఉప్కార్ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి. పిచ్చి టీచర్ అనేవాళ్లు! సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్’, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్ చిల్డ్రన్ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్ కిడ్ ఉంటే ఆ కిడ్ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు. విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్ కిడ్స్ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్ కిడ్, ఒకరు నార్మల్ కిడ్ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్ కిడ్ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్ కిడ్స్ కోసం పని చేస్తూనే ఉంటాను’’ అన్నారు వల్లీసుధీర్. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే! ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... స్పెషల్ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు. – వల్లీ సుధీర్, స్పెషల్ టీచర్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
పండగ వేళ
-
స్పెషల్ ఎడ్యుకేషన్
టాప్ స్టోరీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్.. వృత్తి బాధ్యతలు ఎంతో ప్రత్యేకం.. పిల్లల పట్ల కేరింగ్ చాలా ముఖ్యం! ఎందుకంటే.. తాము బోధించాల్సిన విద్యార్థులకున్న ప్రత్యేక అవసరాలే అందుకు కారణం. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు సంపాదనతోపాటు సేవా సంతృప్తి సొంతమవుతుంది. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ.. తోటి పిల్లలతో కలిసి ఆడుతూ,పాడుతూ కేరింతలు కొట్టాల్సిన అయిదారేళ్ల వయసులో.. తమకే తెలియని మానసిక, శారీరక సమస్యలతో అందమైన బాల్యాన్ని కోల్పోయే చిన్నారులు ఎందరో! అలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి రూపొందించిన కోర్సులే.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా కెరీర్ ప్రారంభించొచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి.. బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం (మూగ). స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేసిన వారు ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఉత్తీర్ణులకు మంచి డిమాండ్ ఉంది. పలు ఇన్స్టిట్యూట్స్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆర్సీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లక్ష్యం ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ బోధన, శిక్షణ కోసం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లు అందించే కోర్సులు, సర్టిఫికెట్లకే జాబ్ మార్కెట్లోనూ గుర్తింపు. ప్రవేశం ఇలా ఆర్సీఐ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్స్ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్స్ నోటిఫికేషన్ ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. సాధారణంగా ప్రతి ఏటా మే, జూన్‌లో ప్రవేశాలు జరుగుతాయి. బ్యాచిలర్ కోర్సులు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్/లెర్నింగ్ డిజేబిలిటీస్/లోకోమోటలర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్/మల్టిపుల్ డిజార్డర్/ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్)వంటి కోర్సులున్నాయి. బీఏ బీఈడీ (విజువల్ ఇంపెయిర్మెంట్); బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్); బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ; బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ వంటి కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశించడానికి అర్హత డిగ్రీ. అవకాశాలు పుష్కలం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి కెరీర్ అవకాశాలు పుష్కలం. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ డిమాండ్ ఉంది. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాక నెలకు రూ.15 వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో డీఎస్సీలోనూ పోటీ పడే అవకాశముంది. సర్టిఫికెట్ కోర్సులు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా స్థాయి కోర్సులు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు అర్హతగా డిప్లొమా స్థాయి కోర్సులు ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపెయిర్మెంట్), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ (మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్). పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో ఎంపీఈడీ, ఎమ్మెస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విజువల్ ఇంపెయిర్మెంట్; హియరింగ్ ఇంపెయిర్మెంట్; మెంటల్ రిటార్డేషన్; ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకోసోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు వీటిలో ప్రవేశించడానికి అర్హులు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి పలు పీజీ డిప్లొమా కోర్సులు సైతం అభ్యసించే వీలుంది. ఇన్స్టిట్యూట్స్ * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్. * స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు. * కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్ర మహిళాసభ, ఓయూ క్యాంపస్. * డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం. * శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. * దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఓర్పు, నేర్పు అవసరం స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఖాయం. కానీ ఇదే సమయంలో కేవలం కెరీర్ అవకాశాలను పరిగణించే ఈ కోర్సులు ఎంపిక చేసుకోవాలనుకోవడం సరికాదు. కారణం.. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా తాము బోధించాల్సిన విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులని గుర్తించాలి. ఓర్పు, నేర్పు ఉన్న వారే స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో రాణించగలరు. - ప్రొఫెసర్. వి.ఆర్.పి. శైలజ, హెచ్ఓడీ, స్పెషల్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ -
డిగ్రీ కాలేజీ ఎంపిక ఇలా..
ఇంటర్ పాసయ్యాక సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ/బీకామ్/బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే మంచి కాలేజీ అన్వేషణ ప్రారంభించాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్లో కోర్సు ఏదైనా నైపుణ్యాలుంటే నెగ్గుకురావడం తేలికే! అందుకే ఉత్తమ బోధనను అందించే ప్రమాణాలు కలిగిన డిగ్రీ కాలేజీని గుర్తించి చేరడం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మూడేళ్ల కోర్సు ద్వారా ముఫ్ఫై ఏళ్ల కెరీర్‌కు మార్గం వేసే కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలపై ఫోకస్.. గ్రాడ్యుయేట్స్ స్పెషల్ కాలేజీ నేపథ్యం.. కాలేజీ ఎంపికలో మొదటి అంశం.. మీరు చేరాలనుకుంటున్న కళాశాల ఎప్పుడు ఏర్పడింది? గుర్తింపు, అక్కడ చదువుకున్న ప్రముఖులు, ఎవరైనా పోటీ పరీక్షల్లో విజయం సాధించారా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి వివరాలు పరిశీలించాలి. అధ్యాపకులు.. ఇప్పుడు చాలా కళాశాలల్లో సరైన విద్యార్హతలున్న ఫ్యాకల్టీ లేరు. పలు కళాశాలల యాజమాన్యాలు కూడా అర్హత, నైపుణ్యం లేని వారిని అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య అందదు. కాబట్టి అధ్యాపకుల విద్యార్హతలు? సీనియారిటీ? బోధ న విధానం కచ్చితంగా ఆరా తీయాలి. తరగతి గదులు కళాశాల ఆవరణతోపాటు భవనం, తరగతి గదులు ఎలా ఉన్నాయనేది ముఖ్యమే. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో తరగతులు నిర్వహించాలి. గదులు విశాలంగా, వెంటిలేషన్ వచ్చేలా ఉండాలి. కాలేజీ.. ప్రయాణానికి అందుబాటులో ఉందో, లేదో కూడా తెలుసుకోవాలి లేబొరేటరీలు బట్టీ చదువులకు స్వస్తి పలుకుతూ.. కృత్య బోధనకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో మంచి ల్యాబ్‌ల అవసరం తప్పనిసరి. సైన్స్ కోర్సులకు ల్యాబ్‌ల ఆవశ్యకత మరింత ఎక్కువ. ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరికరాలు, యంత్రాలు ఉన్నాయా? నిర్వహణ ఎలా ఉంది? మంచి శిక్షకులు ఉన్నారా? తదితర వివరాలు పరిశీలించాలి. ల్యాబ్‌లు అలంకారప్రాయంగా ఉండి, ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, సరైన నిర్వహణ లేకుండా ఉండే కాలేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రీడా మైదానం ప్రస్తుతం చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం లేదు. కాలేజీలు కూడా పాఠ్యేతర కార్యక్రమాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. క్రీడల్లో రాణించాలనుకునేవారు తగిన సౌకర్యాలు, శిక్షణ ఉన్నాయో, లేదో తెలుసుకోవాలి. అందులోనూ మీకు ఇష్టమైన క్రీడకు సంబంధించి ఎలాంటి శిక్షణ లభిస్తుందో పరిశీలించాలి. ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ కేవలం పుస్తకాలు, చదువులకే పరిమితమైతే సామాజిక అవగాహన, స్పృహ లోపిస్తాయి. దీంతో భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తులుగా ఎదగాలంటే సహపాఠ్యేతర కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. క్విజ్, డిబేట్, వక్తృత్వం, వ్యాసరచన, నృత్యం, కరాటే, పెయింటింగ్, కళాశాల ఫెస్ట్‌లు వంటివాటిలో ఆసక్తి చూపాలి. వీటిని ప్రోత్సహించే కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్సీసీ/ఎన్ఎస్ఎస్/స్కౌట్ - గైడ్స్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్‌తో శారీరక ఆరోగ్యం, తద్వారా సంపూర్ణ మూర్తిమత్వం చేకూరుతుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది. అలాగే ఎన్సీసీ విద్యార్థులకు ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. కాబట్టి కాలేజీల్లో వీటికి ప్రాధాన్యం ఉందా లేదా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. స్టార్టప్స్ నేటి యువత సొంతంగా కంపెనీ పెట్టి వ్యాపారంలో దూసుకుపోవాలని కలలు కంటోంది. మరోవైపు కాలేజీ దశలోనే మంచి వ్యాపార ఆలోచనతో బయటకు వచ్చేవారిని కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి స్టార్టప్స్‌కు అవకాశం ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ ఇప్పుడు చాలా డిగ్రీ కళాశాలలు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రైల్వే, బ్యాంక్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. డిగ్రీలోనే ఆయా పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాయి. కాబట్టి డిగ్రీలోనే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కాలేజీల గురించి వాక బు చేయాలి. టెక్నికల్ సపోర్ట్ టెక్నికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ కోర్సులు చదివేవారికి కూడా సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. కాబట్టి స్వల్పకాల కంప్యూటర్ శిక్షణ కోర్సులు అందించే కళాశాలల వైపు అడుగులేయాలి. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ఉందా? శిక్ష కులు ఉన్నారో, లేదో తెలుసుకోవాలి. ప్రయోగశాలే ప్రాణం ఆధునిక పరికరాలు, మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రయోగశాలలు డిగ్రీ కాలేజీల్లో తప్పకుండా ఉండాలి. ప్రయోగాలు నిర్వహించకుండా సైన్స్ విద్యార్థులు పరిపూర్ణ విద్యను పొందలేరు. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు నీటి, భూసార పరీక్షలు నిర్వహించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలి. ఎ. నర్సింగరావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీ. ముందే జాగ్రత్త పడాలి డిగ్రీ కాలేజీ ఎంపికలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీలో అధ్యాపకుల అనుభవం, ప్రమాణాలు, లైబ్రరీ, ల్యాబ్, ఇతర సౌకర్యాలు తదితర విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఎంచుకునే కోర్సును బట్టి తగిన కాలేజీలో చేరాలి. ఒకసారి కాలేజీలో జాయిన్ అయితే తిరిగి వెనక్కి వెళ్లడం కష్టం. కాబట్టి కాలేజీలో చేరే ముందే జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించాలి. ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
‘ప్రత్యేక’ పోస్టులకు పొగ!
గాలిలో 860 ఖాళీలు కేంద్రం మార్గదర్శకాలకు సర్కారు ఎసరు ఆవేదనలో ‘స్పెషల్’ టీచర్లు విశాఖపట్నం: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు రాష్ర్ట ప్రభుత్వం ఎసరు పెడుతోంది. పిల్లల జనాభాలో 1.67 శాతం మంది మానసిక, శారీరక, ఇంద్రియ వైకల్యాలతో బాధపడుతున్న వారుంటారని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇలాంటి వారి ప్రవర్తనలోనూ, విద్యాభివృద్ధిలోనూ మార్పు తీసుకురావడానికి సంలీన విద్య (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్-ఐఈడీఎస్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిర్వహించే భవిత సెంటర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఇందుకోసం బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిలో 2002 నుంచి సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. ఐఈడీఎస్‌ఎస్ కింద 2011 జూన్‌లో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 800 మందిని ఎంపిక చేశారు. 2012లో వీరిని ప్రత్యేక టీచర్లుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్నుంచి నెలకు రూ.12 వేలు, 2016 ఫిబ్రవరి నుంచి రూ.15 వేల జీతం ఇస్తోంది. ఇలావుండగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి గత ఏడాది కేంద్రం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 7న 860 స్పెషల్ టీచర్ల పోస్టుల (స్కూల్ అసిస్టెంట్ల)ను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు 39ను జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 53, విశాఖపట్నంలో 58, విజయనగరంలో 49, తూర్పు గోదావరిలో 75, పశ్చిమ గోదావరిలో 61, కృష్ణాలో 65, గుంటూరులో 72, ప్రకాశం జిల్లాలో 71, మిగిలినవి ఇతర జిల్లాలోనూ నియామకాలు జరగాలి. దీని ప్రకారం రాష్ట్రంలోని 664 మండలాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ జీవోతో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్పెషల్ టీచర్లలో ఆనందం పెల్లుబికింది. త్వరలోనే తమకు మంచి రోజులొస్తాయని సంబరపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు స్పెషల్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని 70ః30 నిష్పత్తిలో భర్తీ చేసినా 560 మంది రెగ్యులర్ అవుతారు. కానీ ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం మానేసింది. వీరిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లతో సమానంగా నెలకు రూ.38 వేల జీతం చెల్లించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో రూ.37 వేలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.53 వేల వరకూ జీతాలిస్తున్నాయి. దీంతో ఆర్థిక భారంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీరిని రెగ్యులరైజ్ చేయకుండా నాన్చుతూ వస్తోంది. ఫలితంగా ఈ స్పెషల్ టీచర్లు కాంట్రాక్టు పద్ధతిలో అరకొర జీతంతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారి సంఖ్యే చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రత్యేక అవసరాలున్న (వికలాంగులు) పిల్లలు సరైన విద్యకు నోచుకోకుండా అన్యాయమై పోతున్నారు. మరోవైపు ఈ పోస్టులను సత్వరమే భర్తీ చేయని పక్షంలో ఈ 860 పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఈ స్పెషల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవ చూపి ఈ పోస్టుల్లో అర్హులైన తమను నియమించి క్రమబద్ధీకరించాలని స్పెషల్ టీచర్లు కోరుతున్నారు.