గాలిలో 860 ఖాళీలు
కేంద్రం మార్గదర్శకాలకు సర్కారు ఎసరు
ఆవేదనలో ‘స్పెషల్’ టీచర్లు
విశాఖపట్నం: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు రాష్ర్ట ప్రభుత్వం ఎసరు పెడుతోంది. పిల్లల జనాభాలో 1.67 శాతం మంది మానసిక, శారీరక, ఇంద్రియ వైకల్యాలతో బాధపడుతున్న వారుంటారని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇలాంటి వారి ప్రవర్తనలోనూ, విద్యాభివృద్ధిలోనూ మార్పు తీసుకురావడానికి సంలీన విద్య (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్-ఐఈడీఎస్‌ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నిర్వహించే భవిత సెంటర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఇందుకోసం బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరిలో 2002 నుంచి సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. ఐఈడీఎస్‌ఎస్ కింద 2011 జూన్‌లో పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 800 మందిని ఎంపిక చేశారు. 2012లో వీరిని ప్రత్యేక టీచర్లుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్నుంచి నెలకు రూ.12 వేలు, 2016 ఫిబ్రవరి నుంచి రూ.15 వేల జీతం ఇస్తోంది. ఇలావుండగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి గత ఏడాది కేంద్రం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 7న 860 స్పెషల్ టీచర్ల పోస్టుల (స్కూల్ అసిస్టెంట్ల)ను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబరు 39ను జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో 53, విశాఖపట్నంలో 58, విజయనగరంలో 49, తూర్పు గోదావరిలో 75, పశ్చిమ గోదావరిలో 61, కృష్ణాలో 65, గుంటూరులో 72, ప్రకాశం జిల్లాలో 71, మిగిలినవి ఇతర జిల్లాలోనూ నియామకాలు జరగాలి. దీని ప్రకారం రాష్ట్రంలోని 664 మండలాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ జీవోతో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్పెషల్ టీచర్లలో ఆనందం పెల్లుబికింది. త్వరలోనే తమకు మంచి రోజులొస్తాయని సంబరపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు స్పెషల్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని 70ః30 నిష్పత్తిలో భర్తీ చేసినా 560 మంది రెగ్యులర్ అవుతారు. కానీ ప్రభుత్వం వీరిని పట్టించుకోవడం మానేసింది. వీరిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లతో సమానంగా నెలకు రూ.38 వేల జీతం చెల్లించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో రూ.37 వేలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.53 వేల వరకూ జీతాలిస్తున్నాయి. దీంతో ఆర్థిక భారంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీరిని రెగ్యులరైజ్ చేయకుండా నాన్చుతూ వస్తోంది. ఫలితంగా ఈ స్పెషల్ టీచర్లు కాంట్రాక్టు పద్ధతిలో అరకొర జీతంతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారి సంఖ్యే చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రత్యేక అవసరాలున్న (వికలాంగులు) పిల్లలు సరైన విద్యకు నోచుకోకుండా అన్యాయమై పోతున్నారు. మరోవైపు ఈ పోస్టులను సత్వరమే భర్తీ చేయని పక్షంలో ఈ 860 పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఈ స్పెషల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చొరవ చూపి ఈ పోస్టుల్లో అర్హులైన తమను నియమించి క్రమబద్ధీకరించాలని స్పెషల్ టీచర్లు కోరుతున్నారు.