డిగ్రీ కాలేజీ ఎంపిక ఇలా..
ఇంటర్ పాసయ్యాక సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ/బీకామ్/బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే మంచి కాలేజీ అన్వేషణ ప్రారంభించాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో కోర్సు ఏదైనా నైపుణ్యాలుంటే నెగ్గుకురావడం తేలికే! అందుకే ఉత్తమ బోధనను అందించే ప్రమాణాలు కలిగిన డిగ్రీ కాలేజీని గుర్తించి చేరడం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మూడేళ్ల కోర్సు ద్వారా ముఫ్ఫై ఏళ్ల కెరీర్‌కు మార్గం వేసే కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలపై ఫోకస్..
గ్రాడ్యుయేట్స్ స్పెషల్
కాలేజీ నేపథ్యం..
కాలేజీ ఎంపికలో మొదటి అంశం.. మీరు చేరాలనుకుంటున్న కళాశాల ఎప్పుడు ఏర్పడింది? గుర్తింపు, అక్కడ చదువుకున్న ప్రముఖులు, ఎవరైనా పోటీ పరీక్షల్లో విజయం సాధించారా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వంటి వివరాలు పరిశీలించాలి.
అధ్యాపకులు..
ఇప్పుడు చాలా కళాశాలల్లో సరైన విద్యార్హతలున్న ఫ్యాకల్టీ లేరు. పలు కళాశాలల యాజమాన్యాలు కూడా అర్హత, నైపుణ్యం లేని వారిని అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య అందదు. కాబట్టి అధ్యాపకుల విద్యార్హతలు? సీనియారిటీ? బోధ న విధానం కచ్చితంగా ఆరా తీయాలి.
తరగతి గదులు
కళాశాల ఆవరణతోపాటు భవనం, తరగతి గదులు ఎలా ఉన్నాయనేది ముఖ్యమే. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో తరగతులు నిర్వహించాలి. గదులు విశాలంగా, వెంటిలేషన్ వచ్చేలా ఉండాలి. కాలేజీ.. ప్రయాణానికి అందుబాటులో ఉందో, లేదో కూడా తెలుసుకోవాలి
లేబొరేటరీలు
బట్టీ చదువులకు స్వస్తి పలుకుతూ.. కృత్య బోధనకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో మంచి ల్యాబ్‌ల అవసరం తప్పనిసరి. సైన్స్ కోర్సులకు ల్యాబ్‌ల ఆవశ్యకత మరింత ఎక్కువ. ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరికరాలు, యంత్రాలు ఉన్నాయా? నిర్వహణ ఎలా ఉంది? మంచి శిక్షకులు ఉన్నారా? తదితర వివరాలు పరిశీలించాలి. ల్యాబ్‌లు అలంకారప్రాయంగా ఉండి, ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, సరైన నిర్వహణ లేకుండా ఉండే కాలేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
క్రీడా మైదానం
ప్రస్తుతం చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపడం లేదు. కాలేజీలు కూడా పాఠ్యేతర కార్యక్రమాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. క్రీడల్లో రాణించాలనుకునేవారు తగిన సౌకర్యాలు, శిక్షణ ఉన్నాయో, లేదో తెలుసుకోవాలి. అందులోనూ మీకు ఇష్టమైన క్రీడకు సంబంధించి ఎలాంటి శిక్షణ లభిస్తుందో పరిశీలించాలి.
ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్
కేవలం పుస్తకాలు, చదువులకే పరిమితమైతే సామాజిక అవగాహన, స్పృహ లోపిస్తాయి. దీంతో భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తులుగా ఎదగాలంటే సహపాఠ్యేతర కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. క్విజ్, డిబేట్, వక్తృత్వం, వ్యాసరచన, నృత్యం, కరాటే, పెయింటింగ్, కళాశాల ఫెస్ట్‌లు వంటివాటిలో ఆసక్తి చూపాలి. వీటిని ప్రోత్సహించే కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్/స్కౌట్ - గైడ్స్
ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్‌తో శారీరక ఆరోగ్యం, తద్వారా సంపూర్ణ మూర్తిమత్వం చేకూరుతుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది. అలాగే ఎన్‌సీసీ విద్యార్థులకు ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. కాబట్టి కాలేజీల్లో వీటికి ప్రాధాన్యం ఉందా లేదా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
స్టార్టప్స్
నేటి యువత సొంతంగా కంపెనీ పెట్టి వ్యాపారంలో దూసుకుపోవాలని కలలు కంటోంది. మరోవైపు కాలేజీ దశలోనే మంచి వ్యాపార ఆలోచనతో బయటకు వచ్చేవారిని కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి స్టార్టప్స్‌కు అవకాశం ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్
ఇప్పుడు చాలా డిగ్రీ కళాశాలలు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, రైల్వే, బ్యాంక్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. డిగ్రీలోనే ఆయా పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాయి. కాబట్టి డిగ్రీలోనే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కాలేజీల గురించి వాక బు చేయాలి.
టెక్నికల్ సపోర్ట్
టెక్నికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ కోర్సులు చదివేవారికి కూడా సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. కాబట్టి స్వల్పకాల కంప్యూటర్ శిక్షణ కోర్సులు అందించే కళాశాలల వైపు అడుగులేయాలి. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ఉందా? శిక్ష కులు ఉన్నారో, లేదో తెలుసుకోవాలి.
ప్రయోగశాలే ప్రాణం
ఆధునిక పరికరాలు, మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రయోగశాలలు డిగ్రీ కాలేజీల్లో తప్పకుండా ఉండాలి. ప్రయోగాలు నిర్వహించకుండా సైన్స్ విద్యార్థులు పరిపూర్ణ విద్యను పొందలేరు. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు నీటి, భూసార పరీక్షలు నిర్వహించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలి.
ఎ. నర్సింగరావు,
ప్రిన్సిపాల్, ఉస్మానియా
విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీ.
ముందే జాగ్రత్త పడాలి
డిగ్రీ కాలేజీ ఎంపికలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీలో అధ్యాపకుల అనుభవం, ప్రమాణాలు, లైబ్రరీ, ల్యాబ్, ఇతర సౌకర్యాలు తదితర విషయాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఎంచుకునే కోర్సును బట్టి తగిన కాలేజీలో చేరాలి. ఒకసారి కాలేజీలో జాయిన్ అయితే తిరిగి వెనక్కి వెళ్లడం కష్టం. కాబట్టి కాలేజీలో చేరే ముందే జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించాలి.
ప్రొ. టీఎల్‌ఎన్ స్వామి,
ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్