ఆరుబయట పాఠాలు చెబుతూ..
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు.
కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్‌ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం.
బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె.
చదువులో ముందంజ
దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది.
ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్‌ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు.
సృజనాత్మక ఆలోచనలు
‘ఒకసారి గురుకుల పిఎల్‌సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు.
అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు.
కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె.
ఓ అబ్బాయితో మొదలు...
మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్‌రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను.
ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్‌లో చేర్చాలని మా పిఎల్‌సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్‌ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు.
సోషల్ మీడియా ద్వారా విస్తరణ
ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది.
రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్‌బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్‌ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు.
స్త్రీల అక్షరాస్యత
స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు.
మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది.
ప్రధాని ప్రశంసలు
ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె.
స్కూల్‌లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే
Comments
Please login to add a commentAdd a comment