disabled children
-
దివ్యాంగ చిన్నారులకు శాశ్వత సాయం
న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు. భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు. -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్‌మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా ఉన్న దీప్‌మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్‌లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తోంది దీప్‌మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్‌మాలా సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్‌మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్‌మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్‌గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్‌లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్‌ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్‌సిఇఆర్‌టి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్‌కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్‌లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్‌మీడియాను ఎంచుకున్నారు దీప్‌మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్‌మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్‌కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్‌మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్‌మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్‌మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్‌మాలా పాండే -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్‌గా ఉంచేందుకు... హోమ్‌లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
వైరల్: ఒంటికాలితో పరుగు
-
ఆమె ఓడింది: లేదు, గెలిచిందంటున్న నెటిజన్లు
అన్ని అవయవాలు బాగానే ఉన్నా.. ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తారు చాలామంది. కానీ ఇక్కడ చెప్పుకునే బాలిక మాత్రం దేవుడు తనకు అంగవైకల్యం ఇచ్చాడు కానీ మనోవైకల్యం ఇవ్వలేదని ఆత్మవిశ్వాసాన్ని చాటి అందరి మన్ననలు పొందుతోంది. ఓ చోట నిర్వహించిన పరుగుపందెం పోటీలో కొందరు బాలబాలికలతో పాటు ఓ దివ్యాంగురాలు కూడా పాల్గొంది. పోటీ ప్రారంభం కాగానే ఒంటి కాలుతో పరుగు ప్రారంభించింది. మిగతావాళ్లు తనను దాటేసి వెళుతుంటే మొక్కవోని దీక్షతో వారిని అందుకోడానికి ఉబలాటపడింది. వారితో సమానంగా ఉరికేందుకు ప్రయత్నించింది. లక్ష్యాన్ని అందుకునేందుకు చివరివరకు పోరాడింది.. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోను భారతీయ అటవీశాఖ అధికారి సుశాంత్ నందా గురువారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అసాధ్యం అనేది మీరు కల్పించుకునే ఓ భావన మాత్రమే’నంటూ దీనికి ఓ క్యాప్షన్ జోడించాడు. పద్దెనిమిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్నవయసులో ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘ఆమె అసలైన విజేత’, ‘ఆ పోటీలో ఓడినా, జీవితంలో ఆమె లక్ష్యాన్ని సాధిస్తుంది’ అని ఆమె కృషిని కొనియాడుతున్నారు. ఈ వీడియో ఎందరికో స్ఫూర్తిదాయకమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 30 వేల మందికి పైగా వీక్షించారు. చదవండి: బాలుడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. -
‘భవిత’కు భరోసా ఏది..!
పై చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు దుమాల ఆశన్న. జైనథ్ మండల కేంద్రానికి చెందిన దుమాల చిన్నక్క, నడిపెన్న దంపతుల చిన్న కుమారుడు. ఆశన్న పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. సాధారణ పిల్లల్లాగా కాకుండా శారీరక, మానసిక ఎదుగుదల లోపం కనిపించడంతో జైనథ్‌లోని భవిత విలీన విద్య కేంద్రంలో చేర్పించారు. కొన్నేళ్లుగా ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్ 14నుంచి ఈ కేంద్రం మూసి వేయడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ‘‘అప్పటి నుంచి మరింతగా మానసిక వేదన చెందుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. దినం, రాత్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తంది..’’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిత కేంద్రం తెరిచి ఉంటే పిల్లలతో కలిసి ఆటపాటలతో కొంత ఉల్లాసంగా గడిపేవాడని తెలిపారు. ఆదిలాబాద్‌టౌన్ : పుట్టుకతో వచ్చే వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించడంతోపాటు కనీస విద్య సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రానికి శ్రీకారం చూట్టింది. మానసిక వైకల్యం గల పిల్లలతోపాటు వైకల్యం గల పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మారే విధంగా చేయడమే భవిత కేంద్రాల లక్ష్యం. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపి చికిత్స అందించి వారికి ప్రయోజనం చేకూర్చాలి. కానీ.. గత రెండు నెలలుగా కేంద్రాలు మూతపడ్డాయి. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, వైద్య సేవలు అందడం లేదు. సాధారణ పాఠశాలల మాదిరిగా ఈ కేంద్రాలకు కూడా విద్యశాఖ సేవలు ఇవ్వడంతో వైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల బాధలు వర్ణనాతీతం. చిన్నారుల రాత మార్చే భవిత కేంద్రాలు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే వారి ‘భవిత’వ్యం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. ప్రత్యేక అవసరాలు ఉన్న శారీరక, మానసిక దివ్యాంగులకు మండల కేంద్రాల్లో భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 251 మంది చిన్నారులు భవిత కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 131 మంది చిన్నారులు ఫిజియోథెరఫి వైద్య చికిత్సలను పొందుతున్నారు. 88 మంది చిన్నారులు ఇంటి వద్ద చదువు నేర్చుకుంటున్నారు. భవిత కేంద్రాల్లో 23 మంది ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ఆరుగురు ఫిజియోథెరఫిస్టులు, 17 మంది కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. పిల్లల భవితవ్యం పట్టదా.. దివ్యాంగులకు వివిధ అంశాల్లో ఆట, పాటల ద్వారా శిక్షణ ఇచ్చి క్రమంగా వారి సామర్థ్యాలను పెరిగేలా చూడాలి. దీంతోపాటు వారంలో ఒకసారి అవసరమైన వారికి ఫిజియోథెరఫితోపాటు ఇతర థెరఫిలు చేయిస్తారు. ఈ పిల్లల అంశాలను గుర్తించి తమ పనులు తాము చేసుకునేలా చూడడం, కాస్త క్రీయాశీలకంగా ఉన్న వారి సామర్థ్యాలను మరింతగా పెంచి సాధారణ విద్యార్థులతో కలిసిపోయేలా చేయడం దీని లక్ష్యం.. కానీ సర్వశిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. కాగా భవిత కేంద్రాలకు ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరఫి చేసుకునే పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు. ఫిజియోథెరఫి క్రమం తప్పకుండా చేయాలి. లేనట్లయితే పరిస్థితి మొదటికి వస్తుంది. కండరాలు బిగిసుకుని చచ్చుబడిపోతాయి. ప్రైవేటుగా ఫిజియోథెరఫి చేయించుకోలేని వారే అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు వారి ఇంటికి వెళ్లి ఐఈఆర్పీలు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిజియోథెరఫి చేసే విధానం చూపిస్తారు. వారిలో మనోధైర్యం నింపుతారు. ఇవన్నీ నిలిచిపోయి ఇప్పటికే నెల రోజులు దాటింది. భవిత కేంద్రాలు మళ్లీ వచ్చే నెల 12న ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో రెండు నెలలపాటు సేవలు నిలిచిపోయినట్లే. ఉద్యోగ భద్రతా కరువే.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను సాధారణ స్థితికి తీసుకువస్తున్న ఐఈఆర్పీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్‌లో 13 వరకే వేతనం చెల్లించారు. మే నెలకు వేతనం లేకపోగా, జూన్ మాసంతో 20 రోజుల వేతనం ఇవ్వనున్నారు. వీరు గత కొన్నేల్లుగా ఉద్యోగం చేస్తున్నా ప్రతి సంవత్సరం రీఎంగేజ్ (రెన్యువల్) చేస్తుండడంతో ఉద్యోగ భద్రత లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉండగా మన రాష్ట్రంలో రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి గత 15 సంవత్సరాలుగా వైకల్యం గల పిల్లలకు సేవలు అందిస్తున్నాను. ఐఈఆర్పీలకు ఉద్యోగ భదత్ర కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. కనీస వేతనం రూ.28,940 చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలి. ఒక్క రోజు విరామంతో తిరిగి పునర్నియామకం చేయాలి. – పుష్పవేణి, ఐఈఆర్పీ ఆదిలాబాద్ -
సకలాంగులకు ఏమాత్రం తీసిపోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా దివ్యాంగులు అన్నింటా రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మసై్థర్యం కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో బెహరా మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చూపుతున్న దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రీడల్లో రాణిస్తున్నారని, ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షి మహిళలేనని గుర్తు చేశారు. పోటీలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు అనంతరం దివ్యాంగుల పరుగు పోటీలను జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలతో కలెక్టర్ ప్రారంభించారు. పోటీలకు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బోసి (బంతి విసరడం) విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు పతకాలు, ప్రసంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బాబూరావు, బీఆర్ ఏయూ రిజిస్ట్రార్ గుంట తులసీరావు, రాష్ట్ర దివ్యాంగుల క్రీడల సహాయ సంచాలకులు సి.రాజశేఖర్, బెహరా మనోవికాస కేంద్రం కార్యదర్శి సీహెచ్ విజయభాస్కరరావు, ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ విజయ్‌భాస్కర్, ఎ.మోహన్‌రాజ్, గీతాశ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఒడి
వికలాంగుల ఆలనాపాలన చూస్తోన్న పునరావాస కేంద్రాలు రోజంతా ఆటపాటలు.. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో మేలు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి వరం ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్రాలు ఊపిరి పీల్చుకుంటున్న నిరుపేద కుటుంబాలు మిరుదొడ్డి: వికలాంగుల పునరావాస కేంద్రాలు అమ్మ ఒడిని తలపిస్తున్నాయి. కన్నతల్లిదండ్రుల మాదిరిగా శారీరక, మానసిక వికలాంగుల ఆలనాపాలన చూస్తున్నాయి. మాటలు రాక కొందరు... కాళ్లు చేతులు పనిచేయక మరికొందరు.. పుట్టుకతో, పుట్టిన తర్వాత మరికొందరు... మానసిక, శారీరక వికలాంగులుగా మారుతున్నారు. తమ పనులు తాము చేసుకోలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇలాంటి వారి బాగోగులు చూసేందుకు ప్రభుత్వ నిర్వహణలో జిల్లాలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. తిండి మొదలుకొని ఆటలు పాటలతో కాలక్షేపాన్ని కల్పిస్తున్నాయి. స్పీచ్, ఫిజియో థెరపీలతో మార్పు కోసం కృషి చేస్తున్నాయి. వికలాంగులు సైతం ఈ కేంద్రాల్లో సందడి చేస్తున్నారు. రోజురోజుకూ వారిలో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రతినిధులు మిరుదొడ్డి కేంద్రాన్ని అధ్యయం చేసి ప్రశంసలు కురిపించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని అక్కున చేర్చుకుంటున్నాయి వికలాంగుల పునరావాస కేంద్రాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా శారీరక, మానసిక వికలాంగులైన వారిని చేర్చుకొని వారిలో మార్పు కోసం కృషిచేస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో వికలాంగులు ఉంటే కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా అనుక్షణం వారిని కనిపెట్టుకుని ఉండాలి. ఫలితంగా వారికి ఉపాధి లేకుండా పోతుంది. రెక్కాడితో గాని డొక్కాడని కుటుంబాల్లో ఒకరు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కేటాయించడం వల్ల కుటుంబ నడిచే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారిని చేర్చుకుని వారి ఆలనా పాలన చూస్తున్నాయి పునరావాస కేంద్రాలు. ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాల ప్రభుత్వ ఖర్చుతో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలు సేవలందిస్తున్నాయి. వీరిలో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయి. ఈ కేంద్రాల వల్ల ఎన్నో కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలు మానసికంగా, శారీరక వికలాంగుల్లో మార్పు తేవడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో 8 మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి, న్యాల్కల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కల్హేర్, జోగిపేట, మెదక్, కౌడిపల్లిలో పునరావాస కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక, శారీరకంగా బాధపడుతున్న వికలాంగులను గుర్తించి పురావాస కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఆయా కేంద్రాల్లో సుమారు 880 మంది చేరారు. ఏపీఎం పర్యవేక్షణలో పిల్లలు మానసిక పునరావాస కేంద్రంలో క్లస్టర్ కోఆర్డినేటర్, ఈఐసీఆర్పీ (ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్), కార్యకర్త, ఆయా పని చేస్తారు. పునరావాస కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మూగ, చెవిటి, మానసిక, శారీరక వికలాంగులను గుర్తిస్తారు. సదరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. వారి అనుమతితో సదరు పిల్లలను పునరావాస కేంద్రాల్లో చేర్పిస్తారు. ఐకేపీ ఏపీఎం పర్యవేక్షణలో సీసీ, కార్యకర్త, ఆయాలు వీరి బాగోగులు చూస్తారు. రాకపోకలకు ప్రత్యేక వాహనం ఈ కేంద్రాల్లో చేరిన వారిని వివిధ గ్రామాల నుంచి తీసుకురావడానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. ఉదయం కేంద్రానికి తీసుకురావడం, సాయంత్రం తిరిగి అదే వాహనంలో ఇళ్లకు పంపిస్తారు. స్థానికులైతే వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్తారు. ఆకట్టుకునేలా శిక్షణ వివిధ ఆట వస్తువులు, వ్యాయామం చేసే పరికరాలు, అక్షర మాలలు, పండ్లు, కూరగాయల బొమ్మలు , చార్టులను అందుబాటులో ఉంచుతారు. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి ఆటపాటల ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రతి అంశాన్ని గుర్తించేలా అవగాహన కల్పిస్తారు. వికలాంగులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగ పడే ప్రతి వస్తువును సెర్ప్ సమకూరుస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అన్ని రకాల ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచింది. మానసిక వికలాంగులకు ఆత్మస్థైర్యం మానసిక వైకల్యంతో పుట్టిన వారికి పునరావాస కేంద్రం అపర సంజీవనిలా పనిచేస్తోంది. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి నెలలో రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్ని డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్)తోపాటు ముగ్గురు ప్రొఫెషనల్ అధికారులు సందర్శిస్తారు. మిరుదొడ్డి కేంద్రం టాప్ మిరుదొడ్డిలో నిర్వహిస్తోన్న పునరావాస కేంద్రంలో సుమారు 78 మంది మానసిక, శారీరక వికలాంగులను గుర్తించగా ప్రస్తుతం 62 మంది శిక్షణ పొందుతున్నారు. జిల్లాలో అన్ని రకాలుగా సేవలను అందిస్తున్న కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో జిల్లా అధికారులు దీన్ని అధ్యయన కేంద్రంగా గుర్తించారు. పలు రాష్ట్రాల ప్రతినిధుల అధ్యయనం మిరుదొడ్డి కేంద్రాన్ని నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు గత మార్చి, ఏప్రిల్ నెలల్లో సందర్శించారు. ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు వారు సందర్శించి అధ్యయనం చేశారు. ఇక్కడ వికలాంగులకు అందిస్తోన్న సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం ఈ కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం. ఆ వెంటనే కేంద్రంలో చేర్పించి అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. మూగ, చెవిటి లోపం ఉన్న వారిని గుర్తించి హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆసుపత్రికి తరలిస్తాం. అక్కడి వీలైనంత వరకు చికిత్స అందేలా చూస్తాం. వారిలో మంచి మార్పు రావడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నాం. - కూరాకుల కవిత, ఈఐసీ రిసోర్స్ పర్సన్, ధర్మారం కంటికి రెప్పలా చూసుకుంటాం మానసికంగా, శారీరకంగా బాధపడుతున్న పిల్లలను పునరావాస కేంద్రంలో కంటికి రెప్పలా చూసుకుంటాం. ఆటపాటలతో మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాం. వస్తువులను గుర్తించడానికి అన్ని రకాల వస్తువులు అందిస్తాం. తినడానికి రాని వారికి తినిపిస్తాం. - యలగారి యశోద, కార్యకర్త, అల్వాల వికలాంగుల భవిష్యత్తుపై దృష్టి ఈ కేంద్రంలో ప్రతి వికలాంగుడికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం. ఒక్కో విలాంగుల గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. గ్రూపును బట్టి రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం. దీంతో వికలాంగులకు ఉపాధి లభిస్తుంది. - మణెమ్మ, పునరావాస కేంద్రం మిరుదొడ్డి క్లస్టర్ కోఆర్డినేట పురావాస కేంద్రంతో మేలు పునరావాస కేంద్రంతో మాలాంటి వికలాంగులకు ఎంతో మేలు జరుగుతుంది. నడవలేని స్థితిలో ఉన్న నాకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదం చేసింది. ఈ మాత్రం నడవగలుగుతున్నానంటే పునరావాస కేంద్రంలో ఇచ్చిన శిక్షణ పుణ్యమే. - తుడుం కనకయ్య, వికలాంగుడు, లక్ష్మీనగర్ ప్రతి ఒక్కరిపై పర్యవేక్షణ పునరావాస కేంద్రంలో చేరిన అన్ని రకాల వికలాంగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. వారికి ఏం కావాలో తెలుసుకొని అందిస్తున్నాం. మానసిక రుగ్మతలను గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నాం. పునరావాస కేంద్రాల్లో మెరుగుపడ్డ వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాం. - కృష్ణారెడ్డి, ఐకేపీ ఏపీఎం, మిరుదొడ్డి ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం మానసిక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా జిల్లాలో ఎనిమిది కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక వికలాంగులున్న కుటుంబాలు వారి బాగోగులు చూసుకోవడానికే రోజంతా గడిచిపోతుంది. దీంతో ఏ పని చేసుకోకుండా సమయమంతా వారితోనే గడిచిపోతుంది. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాంటి కుటుంబాల నిరుపేదలకు పునరావాస కేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయి. వికలాంగులను కేంద్రాల్లో చేర్పిస్తే వారి బాగోగులను మేమే చూసుకుంటాం. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ద్వారా వారిలో మార్పు వచ్చేలా చూస్తున్నాం. - మోహన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, సంగారెడ్డి -
అభిమాన నేతకు ఆప్యాయ కానుక
డబ్బూరివలస (బొబ్బిలి రూరల్): పాచిపెంట మండలం డబ్బూరివలసలో హోలీ స్పిరిట్ పాఠశాలకు చెందిన మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం ఆప్యాయ కానుక అందించారు. హోలీ స్పిరిట్ సిస్టర్లు సెల్వి, షకీలా, రాణిల ఆధ్వర్యంలో 300 మంది వికలాంగ చిన్నారులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన అపురూప పెయింటింగ్‌ను కానుకగా అందించారు. వారితో జగన్మోహన్ రెడ్డి ప్రేమగా మాట్లాడారు. మూడు వందల మంది శారీరక, మానసిక వికలాంగులతో పాటు వంద మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని సిస్టర్ సెల్వి వివరించారు. చిన్నారుల ప్రేమకు పులకరించిపోయిన జగన్మోహన్ రెడ్డి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.