రాష్ట్ర వ్యాప్తంగా చదువులో వెనుకబడిన విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని రూపొందించింది. అత్యవసరంగా
2017–18 విద్యా సంవత్సరంలో వెనుకబడిన పిల్లల సామర్థ్యాలను పెంచటంతో పాటు, 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలుగు, గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో నిర్ధేశిత స్థాయిలను విద్యార్థులు చేరుకునేలా చేయడం కార్యక్రమం లక్ష్యం. జ్ఞానధార 1, 2 పేరిట సమ్మర్ రెమిడియల్ టీచింగ్ కార్యక్రమం ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరగనుంది.
ఒంగోలు:2017లో నిర్వహించిన సమ్మేటివ్ –1 పరీక్షల్లో 5వ తరగతి, 9వ తరగతిలో కనీస అభ్యసనా సామర్థ్యాలను చేరుకోలేకపోయిన విద్యార్థులకు జ్ఞానధార సమ్మర్ రెమిడియల్ టీచింగ్ ద్వారా విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించి 6, 10 తరగతుల వారు రాణించేలా మొదటిదశకు రూపకల్పన చేశారు. జ్ఞానధార 1 పూర్తయ్యేనాటికి కనీస సామర్థ్యాలను అందుకోలేని విద్యార్థులకు జ్ఞానధార 2 పేరిట ఏడాది పొడవునా ప్రత్యేక బోధన ఉంటుంది. గణితంలో ఫండమెంటల్స్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో బేసిక్స్, ఇంగ్లీషులో కాంపోనెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లను జ్ఞానధార కార్యక్రమంలో బోధిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల మంది విద్యార్థులు ఈ బోధనకు ఎంపిక కాగా అందులో ప్రకాశం జిల్లా నుంచి 6వ తరగతిలో ప్రవేశించనున్న 4500 మంది, 10వ తరగతిలోకి ప్రవేశించనున్న 7191 మందికి ఈ శిక్షణ ఇస్తారు.
రెసిడెన్షియల్ తరహాలో విద్యాబోధన: 2017 డిసెంబర్‌లో జరిగిన సమ్మేటివ్–1లో డి–1, డి–2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు ఈ జ్ఞానధార ద్వారా శిక్షణ ఇస్తారు. అయితే ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థులను బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, కస్తూర్భాగాంధీ, మోడల్ స్కూల్స్, ఏపీ గురుకుల పాఠశాలల్లో ఈ కోచింగ్ ఇస్తారు. ఒక వేళ ఆ సెంటర్లు సరిపోకపోతే ఇంజినీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, కార్పొరేట్ పాఠశాలలను కూడా వినియోగించుకోవచ్చు. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా కోచింగ్ ప్లాన్ చేశారు. కోచింగ్‌తో పాటు వారంతపు పరీక్షలు కూడా నిర్వహించి అభ్యర్థి అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషిచేస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రంలో ఏప్రిల్ 30వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. శిక్షణ తరగతులు మే 1 నుంచి మొదలు 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఇందులో యోగ, అల్పాహారం, లంచ్‌కు సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు హోంవర్కు, 4.15 గంటల నుంచి హ్యాండ్‌రైటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఫిజికల్ లిటరసీ అనంతరం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అంటే గంటపాటు లఘుచిత్రాల ప్రదర్శన ఉంటుంది.
అనంతరం డిన్నర్ ఉంటుంది. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఆదివారం అయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగ/ ఫిజికల్ లిటరసీ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం వారంతపు పరీక్షలు ఉంటాయి. 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తారు. అయితే వారంతపు పరీక్షలను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కోచింగ్‌ను విద్యార్థులకు అందించదలచిన ఉపాధ్యాయులు తమ ఇష్టాన్ని తెలియజేస్తూ విద్యాశాఖకు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుకు కనీసం 20 మంది తెలుగు, ఆంగ్లం, లెక్కలు, సైన్స్‌తో పాటు పీఈటీ/పీడీలను ఎంపికచేయాల్సి ఉంటుంది. వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పిల్లలను లక్ష్యం వైపు ఉత్తేజితులను చేయగల వక్తలతో పాటు యోగ, ధాన్యం, ఆర్ట్‌లకు సంబంధించిన నిపుణులను కూడా ఆహ్వానించి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఇక డీఈడీ ట్రైన్డ్ టీచర్లను తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. ఈ శిక్షణకు విద్యాశాఖ ఇప్పటికే ఫ్రెండ్లీ వర్క్‌బుక్స్ డిజైన్ చేసే పనిలో నిమగ్నమైంది.
పర్యవేక్షణ బాధ్యతలు వీరికి: జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఏఎంఓ, సీఎంఓ, ఎంఈఓ, హెచ్‌ఎంలు, ఎస్‌ఎంసీ సభ్యులతో కూడిన బృందాలు బోధన తరగతులను పర్యవేక్షిస్తారు. డిజిటల్ తరగతి గదులు, పీసీ టాబ్లెట్లు, వారంతపు అసెస్‌మెంట్ పరీక్షలు, గ్రాండ్‌టెస్టులతో పాటు ఆన్‌లైన్ మూల్యాంకనం చేపడతారు. మొత్తం మీద 30 రోజులపాటు నిర్వహించే ఈ ప్రణాళిక కనీసం 75 శాతం మంది అయినా నిర్ధేశిత లక్ష్యాన్ని జ్ఞానధార –1లో చేరుకునేలా ప్లాన్ చేశారు. మిగిలిన 25 శాతం మందికి జ్ఞానధార 2లో ఏడాది పొడవునా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment