special classes
-
పది పాస్‌కు ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్‌లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్మెంట్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ పాస్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్క్ట్స్లో ఫెయిల్ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్క్ట్ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. – ఆర్వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
బ్రేక్‌ఫాస్ట్‌తో స్కూల్ స్టార్ట్..
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి. ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్పీఎఫ్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి. పరిచయమైన పాఠం ‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను. అల్పాహారం తప్పనిసరి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను. దీనిని స్కూల్లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి. – నిర్మలారెడ్డి -
కాలక్షేపంలో కాసుల పుట్ట
ఇంటిపనులతో ఎప్పుడూ బిజీగా ఉండే గృహిణులు కాస్త సమయం దొరికితే... నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటారు. షిజే వర్గీస్ అలాగే తనకు నచ్చిన çపుట్టగొడుగుల సాగును చేపట్టి ఖాళీసమయాన్ని కాసుల పంటగా మార్చి, నెలకు లక్షరూపాయలకు పైగా ఆర్జిçస్తున్నారు. మరోపక్క తనలాంటి వారెందరికో పుట్టగొడుగు ల పెంపకం గురించి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది గుర్తించిన కేరళ ప్రభుత్వం ‘బెస్ట్ మష్రుమ్ ఫార్మర్’ అవార్డుతో సత్కరించింది. కేరళలోని అలప్పుఱ జిల్లా ఎరమళ్లూ్లర్కు చెందిన షిజే వర్గీస్ ఇంటిపనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవారు. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండడంతో షిజేకు కాస్త తీరిక దొరికింది. అప్పుడే అనుకోకుండా షిజే ఇంటికి దగ్గర్లో ‘‘పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిçస్తున్నాం. మీరు పాల్గొనండి’’ అని వ్యవసాయ అధికారి షిజేను ఆహ్వానించారు. అక్కడ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుంది. అది నచ్చడంతో ఇంట్లోనే పుట్టగొడుగుల సాగును ప్రారంభించింది. రెండు ప్యాకెట్లు, ఆరు బెడ్లు.. 2007లో రెండు ప్యాకెట్ల విత్తనాలు, ఆరు బెడ్లతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. కానీ పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు. అయితే షిజే భర్త ఆమెను ప్రోత్సహించడంతో ఈ సారి 300 బెడ్లతో పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో కేరళలో పుట్టగొడుగులు సాగుచేస్తోన్న అనేక ప్రాంతాలను సందర్శించి దానిలో మరిన్ని మెలకువలు నేర్చుకుని వాటిని తన సొంత క్షేత్రం లో అమలు చేయడంతో విజయం సాధించింది. కూన్ ఫ్రెష్.. షిజే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన రెండేళ్లల్లో పోషకాలతో కూడిన ‘ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులను’ సాగు చేసి వాటిని ‘కూన్ఫ్రెష్’పేరిట విక్రయించేవారు. మలయాళంలో కూన్ అంటే పుట్టగొడుగులు అని అర్థం. కూన్ఫ్రెష్ మష్రుమ్స్ రుచికరంగా ఉండడంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రెండు వేల బెడ్లు రోజుకు ఎనిమిది నుంచి పది కేజీల వరకు పంటను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి మంచి ధర పలకడం తో నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ విషయం వ్యవసాయ శాఖాధికారులకు తెలియడంతో వారు ఆమె ఇంటికి వచ్చి పుట్టగొడుగుల సాగును పరిశీలించి, మరింత మందికి ఆమెతో క్లాసులు చెప్పించేవారు. దీంతో షిజే వారికి టీచర్‌గా మారి పుట్టగొడుగుల పెంపకం గురించి బోధించడం ఆరంభించారు. సొంతంగా విత్తనాల తయారీ.. తొలినాళ్లల్లో వేరే రైతుల వద్ద విత్తనాలు, క్రిమిసంహారాలు గురించి తెలుసుకుని వాడేవారు. షిజేకు పుట్టగొడుగుల సాగుపై అనుభవం పెరిగేటప్పటికీ స్వయంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కోచ్చిలోని సూపర్ మార్కెట్లలో పుట్టగొడుగులను విక్రయించేవారు. తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షిజే వీక్లీ క్లాసులు నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ కొత్తగా వచ్చేవారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ మొత్తం పనిలో షిజేకి భర్తతోపాటు కొడుకు, కూతురు సాయం చేస్తున్నారు. ఎవరైనా చేయవచ్చు.. ‘‘ప్రారంభంలో నాకు ఇష్టలేకపోయినప్పటికీ మావారి ప్రోత్సాహంతో ఈరోజు ఈస్థాయికి ఎదిగాను. పోషకాలతో కూడిన పుట్టగొడుగులు ఉత్పత్తి చేయడం వల్ల మా కూన్ఫ్రెష్కు మంచి డిమాండ్ వచ్చింది. పుట్టగొడుగుల సాగు ఎవరైనా చేయవచ్చు. నిబ్బద్దత, ఆసక్తి, సహనంతో చేయగలిగితే మంచి లాభాలు ఆర్జించవచ్చు’’ అని షిజే చెప్పారు. -
భరించొద్దు.. చెప్పుకోండి
‘‘ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపింది. ఆ బాలిక శరీరంలో వస్తున్న మార్పుల్ని గమనించిన ఉపాధ్యాయులు వైద్యపరీక్షలు చేయించడంతో ఈ విషయం వెలుగుచూసింది’’. ‘‘స్కూలుకు వెళ్లే దారిలో ఓ బాలికను రోజూ పోకిరీ వేధిస్తున్నాడు. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు కూడా తననే తిట్టడంతో బాలిక లోలోన కుమిలిపోతోంది’’. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ షీ–టీమ్స్ కౌన్సెలర్లను నియమించాలని వుమెన్ సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఐదేళ్లలో వేలాది కేసులను పరిష్కరించిన షీ–టీమ్స్ ఇప్పటిదాకా మహిళలు, ఉద్యోగినులు, వర్సిటీ విద్యార్థులకు మాత్రమే అవగాహన కల్పించింది. కానీ, విస్తరిస్తోన్న స్మార్ట్ఫోన్ల సంస్కృతి, సినిమాలు టీనేజీ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. వారు చేజేతులారా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు తమకు జరుగుతున్న వేధింపులను ఎవరికి చెప్పాలో తెలియక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి దుస్థితికి చెక్‌పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌన్సెలర్లు ఏం చేస్తారు? రాష్ట్రంలోని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ఆధ్వర్యంలో ‘షీ–టీమ్స్’బృందా లు 300కుపైగా నిత్యం మహిళల రక్షణలో తలమునకలవుతున్నాయి. ఐదేళ్ల కాలంలో 33,687 కేసులను ఈ బృందాలు పరిష్కరించాయి. ఇక నుంచి వీరికి కౌన్సెలర్లు తోడు కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 17,75,409 మంది బా లికలు ఉన్నారు. వీరందరికీ సైబర్, ఫోన్స్, సోషల్‌మీడి యా తదితర వేధింపులు వ చ్చినపుడు ఎలా స్పందించా లి? షీ–టీమ్స్‌ను ఎలా సం ప్రదించాలో కౌన్సెలర్లు అవగాహన కల్పిస్తారు. మౌనం వీడితేనే.. బాలికలపై జరుగుతున్న వేధింపుల్లో చాలామటుకు వెలుగులోకి రావడం లేదు. విద్యార్థినులు మౌనం వీడాలి. వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. టీనేజీలో పిల్లల మనసు సున్నితమైంది. ఈ సమయంలోనే వారికి ధైర్యంగా జీవించడం నేర్పాలి. మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, పెంచేందుకు మా కౌన్సెలర్లు కీలకపాత్ర పోషిస్తారు. – స్వాతి లక్రా, ఐజీ, వుమెన్స్ సేఫ్టీ వింగ్ -
గురుకులాల్లో స్పెషల్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్:పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల కోసం గురుకుల సొసైటీలు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఏటా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నప్పటికీ... ఈ సారి వరుస సెలవులు రావడం...ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు గురుకుల సొసైటీలు ముం దస్తు చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, ప్రతి రోజు పరీ క్షలు నిర్వహిం చేందుకు ఉపక్రమించాయి.ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి పాఠశాల ప్రిన్సిపాళ్లకు పం పించాయి. వాస్తవానికి ప్రతి సంవత్సరం నూరు రోజుల ప్రణాళిక పేరిట గురుకుల సొసైటీలు డిసెంబర్ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఈసారి నవంబర్ నుంచే అమలు చేసేం దుకు సిద్ధమయ్యాయి. వరుసగా 24 రోజులు సెలవులు రావడంతో విద్యార్థుల్లో అభ్యసనా కార్యక్రమాలు తగ్గాయి. ఈ నెల 20 నాటికి గురుకులంలో రిపోర్టు చేయాలని సూచించినా... ఆదివారం సాయంత్రానికి చాలా పాఠశాలల్లో విద్యార్థులు రాలేదు.రవాణా సమస్యలే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో బోధన, అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రతిరోజు స్పెషల్ క్లాసులు... నవంబర్ మొదటి వారం నుంచి 8, 9, 10 తరగతులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఒకే సబ్జెక్టుపైన ఉదయం పూట బోధన, సాయంత్రం పూట అభ్యసన, సందేహాల నివృత్తితో పాటు పరీక్షను నిర్వహిస్తారు. ఇలా వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ప్రతి ఆదివారం విద్యార్థుల సామర్థ్యంపై ఉపాధ్యాయులు విశ్లేషించి, తక్కువ సామర్థ్యం ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇలాంటి వారు ఎక్కు వ మంది ఉంటే ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించి, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. ఈ ప్రణాళికకు అదనంగా పదో తరగతికి మరో కార్యాచరణ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్సీలకు నివేదికలు... పాఠశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను రీజినల్ కో–ఆర్డినేటర్ల(ఆర్సీ)కు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మాలను గురుకుల సొసైటీ తయారు చేసి ప్రిన్సిపాళ్లకు పంపింది. దాని ఆధారంగా వివరాలను ఆన్లైన్లో ఆర్సీలకు సమర్పిస్తే వాటిని క్రోడీకరించి సొసైటీ కార్యాలయానికి పంపిస్తారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సొసైటీ కార్యాలయాల్లో విశ్లేషించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తారు. -
చక్కని దస్తూరీ.. విజయానికి రహదారి..
తూర్పుగోదావరి, ఐ.పోలవరం (ముమ్మిడివరం): పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా పరీక్షల కోసం చదువుకోవడం పైనే. అయితే పాఠాలను బట్టీ పట్టడానికి పడే కష్టంలో కొంతైనా చేతి రాతను మెరుగు పరుచుకోవడం కోసం పడే వారు చాలా కొద్ది మంది మాత్రమే. పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయడం ఎంత ముఖ్యమో.. ఆ రాసేది చూడముచ్చటగా రాయడమూ అంతే ముఖ్యం. అంటే పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణతకు దస్తూరీ కూడా కీలకమే. గజిబిజిగా ఉండే దస్తూరీతో రాసిన సమాధానం ఎంత సమగ్రమైనదైనా..పేపరును మూ ల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం చేసుకోవ డం కొంత ప్రయాస అవుతుంది. విద్యార్థి రాసింది వారికి ఎంత తక్కువ వ్యవధిలో అర్థమయితే అంత ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ముందు నుంచే సాధన చేయాలి.. ఏడాది పాటు చదివిన పాఠ్యాంశాలను రెండున్నర గంటలలో ఆన్సర్ షీట్‌పై పెట్టాలి. ఎంత బాగా చదివిన విద్యార్థులకైనా పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. కొందరు మొదటి ప్రశ్నకు సమాధానం చక్కగా రాసి తరువాత అందంగా రాయలేకపోతుంటారు. దీనిని అధిగమించాలంటే ముందుగానే దస్తూరీపై సాధన చేస్తే పరీక్షలలో ఇబ్బందులు ఉండవన్నది నిపుణుల సూచన. ఆణిముత్యాల్లాంటి అక్షరాల కోసం కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని మండల విద్యాశాఖాధికారి నక్కా వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఆయన పనిచేసిన టి.కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాలు అందంగా రాయడానికి ముందు నుంచి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇవి పాటించాలి.. ♦ సమాధానపత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు ఒకటికి రెండు మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి. ♦ సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక కనిపిస్తుంది. ♦ పేజీలో వాక్యాలు పైనుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుస క్రమంలో ఉండాలి. ♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లను మించి రాయకూడదు. ♦ రోజూ కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయొచ్చు. ♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. ♦ జవాబు రాసేటప్పుడు ప్యాడ్ పైకి వాలి, పోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయడం మంచిది. ♦ అక్షరాలు పదాలు, వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉండాలి. అదనపు మార్కులు సొంతం అదనపు మార్కులకు చేతి రాత చాలా ముఖ్యం. చేతి రాతను బట్టి విద్యార్థి సామర్థాన్ని అంచనా వేయవచ్చు. పాఠశాల సముదాయ సమావేశాల్లో ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల చేతి రాత బాగుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. – నక్కా వెంకటేశ్వరావు, ఎంఈఓ,ఐ.పోలవరం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే శాస్త్ర, సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థినీ విద్యార్థులకు అదనంగా మార్కులు పొందే అవకాశం ఉంది. మా పాఠశాలలో ఈ విధంగా తర్పీదు ఇస్తున్నాం.– ఎన్.సుబ్రహ్మణ్యం, జెడ్పీ పాఠశాల, మురమళ్ల -
జ్ఞానధారతో సామర్థ్యాల పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా చదువులో వెనుకబడిన విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని రూపొందించింది. అత్యవసరంగా 2017–18 విద్యా సంవత్సరంలో వెనుకబడిన పిల్లల సామర్థ్యాలను పెంచటంతో పాటు, 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తెలుగు, గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల్లో నిర్ధేశిత స్థాయిలను విద్యార్థులు చేరుకునేలా చేయడం కార్యక్రమం లక్ష్యం. జ్ఞానధార 1, 2 పేరిట సమ్మర్ రెమిడియల్ టీచింగ్ కార్యక్రమం ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరగనుంది. ఒంగోలు:2017లో నిర్వహించిన సమ్మేటివ్ –1 పరీక్షల్లో 5వ తరగతి, 9వ తరగతిలో కనీస అభ్యసనా సామర్థ్యాలను చేరుకోలేకపోయిన విద్యార్థులకు జ్ఞానధార సమ్మర్ రెమిడియల్ టీచింగ్ ద్వారా విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించి 6, 10 తరగతుల వారు రాణించేలా మొదటిదశకు రూపకల్పన చేశారు. జ్ఞానధార 1 పూర్తయ్యేనాటికి కనీస సామర్థ్యాలను అందుకోలేని విద్యార్థులకు జ్ఞానధార 2 పేరిట ఏడాది పొడవునా ప్రత్యేక బోధన ఉంటుంది. గణితంలో ఫండమెంటల్స్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో బేసిక్స్, ఇంగ్లీషులో కాంపోనెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లను జ్ఞానధార కార్యక్రమంలో బోధిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల మంది విద్యార్థులు ఈ బోధనకు ఎంపిక కాగా అందులో ప్రకాశం జిల్లా నుంచి 6వ తరగతిలో ప్రవేశించనున్న 4500 మంది, 10వ తరగతిలోకి ప్రవేశించనున్న 7191 మందికి ఈ శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్ తరహాలో విద్యాబోధన: 2017 డిసెంబర్లో జరిగిన సమ్మేటివ్–1లో డి–1, డి–2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు ఈ జ్ఞానధార ద్వారా శిక్షణ ఇస్తారు. అయితే ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ తరహాలో జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థులను బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, కస్తూర్భాగాంధీ, మోడల్ స్కూల్స్, ఏపీ గురుకుల పాఠశాలల్లో ఈ కోచింగ్ ఇస్తారు. ఒక వేళ ఆ సెంటర్లు సరిపోకపోతే ఇంజినీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, కార్పొరేట్ పాఠశాలలను కూడా వినియోగించుకోవచ్చు. ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా కోచింగ్ ప్లాన్ చేశారు. కోచింగ్‌తో పాటు వారంతపు పరీక్షలు కూడా నిర్వహించి అభ్యర్థి అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషిచేస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రంలో ఏప్రిల్ 30వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. శిక్షణ తరగతులు మే 1 నుంచి మొదలు 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఇందులో యోగ, అల్పాహారం, లంచ్‌కు సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు హోంవర్కు, 4.15 గంటల నుంచి హ్యాండ్రైటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఫిజికల్ లిటరసీ అనంతరం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు అంటే గంటపాటు లఘుచిత్రాల ప్రదర్శన ఉంటుంది. అనంతరం డిన్నర్ ఉంటుంది. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఆదివారం అయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగ/ ఫిజికల్ లిటరసీ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం వారంతపు పరీక్షలు ఉంటాయి. 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తారు. అయితే వారంతపు పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కోచింగ్‌ను విద్యార్థులకు అందించదలచిన ఉపాధ్యాయులు తమ ఇష్టాన్ని తెలియజేస్తూ విద్యాశాఖకు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుకు కనీసం 20 మంది తెలుగు, ఆంగ్లం, లెక్కలు, సైన్స్‌తో పాటు పీఈటీ/పీడీలను ఎంపికచేయాల్సి ఉంటుంది. వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పిల్లలను లక్ష్యం వైపు ఉత్తేజితులను చేయగల వక్తలతో పాటు యోగ, ధాన్యం, ఆర్ట్‌లకు సంబంధించిన నిపుణులను కూడా ఆహ్వానించి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని తీసుకురావాలి. ఇక డీఈడీ ట్రైన్డ్ టీచర్లను తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. ఈ శిక్షణకు విద్యాశాఖ ఇప్పటికే ఫ్రెండ్లీ వర్క్‌బుక్స్ డిజైన్ చేసే పనిలో నిమగ్నమైంది. పర్యవేక్షణ బాధ్యతలు వీరికి: జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఏఎంఓ, సీఎంఓ, ఎంఈఓ, హెచ్ఎంలు, ఎస్ఎంసీ సభ్యులతో కూడిన బృందాలు బోధన తరగతులను పర్యవేక్షిస్తారు. డిజిటల్ తరగతి గదులు, పీసీ టాబ్లెట్లు, వారంతపు అసెస్మెంట్ పరీక్షలు, గ్రాండ్టెస్టులతో పాటు ఆన్లైన్ మూల్యాంకనం చేపడతారు. మొత్తం మీద 30 రోజులపాటు నిర్వహించే ఈ ప్రణాళిక కనీసం 75 శాతం మంది అయినా నిర్ధేశిత లక్ష్యాన్ని జ్ఞానధార –1లో చేరుకునేలా ప్లాన్ చేశారు. మిగిలిన 25 శాతం మందికి జ్ఞానధార 2లో ఏడాది పొడవునా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. -
నేటినుంచి ‘వేసవి బడులు’
- వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు - ఉదయం 8 నుంచి 10గంటల వరకు పాఠాలు - ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ఘట్కేసర్ టౌన్: ఒకటి నుంచి ఐదో తగరతి వరకు విద్యనభ్యసిస్తున్న వారిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడం, బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించి విద్యను బోధించే వేసవి ప్రత్యేక తరగతులు సోమవారంతో ప్రారంభంకానున్నాయి. గత సంవత్సరం నిర్వహించినట్లుగానేమండలంలోని నాలుగు క్లస్టర్లలో నాలుగు కేంద్రాల ద్వారా ఈ యేడు కూడ వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండలంలోని సీఆర్పీలకు వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి శిక్షణను ఇచ్చారు. సోమవారం నుంచి మే 30 వరకు వేసవి బడులను నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ప్రత్యేక తరగతులకు 50 శాతంలోపు విద్యార్థులు మాత్రమే హాజరుకావడంతో సత్ఫలితాలను పొందలేకపోయారు. గతేడాది అంతంతమాత్రమే... జిల్లాలో మొత్తం 2,800 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 185 స్కూల్ కాంప్లెక్స్‌ల ద్వారా వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఒక్కో క్లస్టర్లో 25 నుంచి 40 మంది విద్యార్థుల చొప్పున 7,400 మందికిపైగా విద్యార్థులకు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రారంభం అదిరినా పర్యవేక్షణ కరువై రానురాను విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో సీ గ్రేడులో ఉన్న విద్యార్థుల ప్రతిభను పెంచలేకపోయారు. మండల విద్యాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేక ఈ కార్యక్రమం విజయవంతం కాలేదన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 135 స్కూల్ కాంప్లెక్స్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో పాఠశాలలో 50 విద్యార్థులకుగాను 1-2 తరగతుల వరకు 25 మందిని, 3-5 తరగతుల వరకు 25 మందిని గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో సీ గ్రేడ్ పొందిన 6,600 మంది విద్యార్థులను గుర్తించారు. సోమవారం ఉదయం 8 నుంచి 11గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ యేడైన పకడ్బందీగా వేసవి బడులు నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు బడి బయట ఉన్న పిల్లలను బడిలే చేర్పించేలా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారి అరుణ్‌ను సంప్రదించగా శిక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. మండలంలో నాలుగు కేంద్రాల ద్వారా శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. -
పదింతలు మెరుగయ్యేలా..
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు తరుముకొస్తున్నాయి. కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 26వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ క్లాసులు ఇటీవల మొదలయ్యాయి. గత ఏడాది జిల్లాలో వచ్చిన 91.8 శాతం ఉత్తీర్ణతను మెరుగుపర్చేందుకు ప్రణాళికలకు రూపొందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత శ్రద్ధచూపితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో జిల్లా నిలిచే అవకాశం ఉంటుందని జిల్లా విద్యాశాఖ భావిస్తోంది. జిల్లాలో 360 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 29,841 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానం అమ ల్లోకొచ్చాక ర్యాంకుల పోటీ తగ్గిపోయినా చాలా పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్లాయి. సమ్మేటివ్ (త్రైమాసిక, అర్ధవార్షిక) పరీక్షల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులు ఉన్నారు, అలాగే ఆ పరీక్షల్లో వెనుకబడిన వారూ ఉన్నారు. వీరిని పాఠశాల స్థాయిలో బేరీజు వేసుకుని వార్షిక పరీక్షలకు సిద్ధంచేస్తున్నారు. ఈ మేరకు ఉత్తీర్ణతా శాతం బాగా పెరగవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రణాళికతో ముందుకెళ్తే జిల్లాకు ప్రస్తుతమున్న 8వ స్థానాన్ని నూతన ఆంధ్రప్రదేశ్‌లో మెరుగుపర్చుకునే అవకాశముంది. మరి లక్ష్య సాధన లో పురోగమిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ విద్యలో ప్రమాణాలు సాధించేందుకు జిల్లా లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. వాస్తవానికి 10వ తరగతి విద్యార్థులకు గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి రోజూ సాయంత్రం అదనంగా గంట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇక నుంచి పునశ్చరణ తరగతులు మొదలవుతున్నాయి. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ నూతన కార్యాచరణ ప్రకారం ఉదయం 8.30గంటల నుంచి ప్రత్యేక పునశ్చరణ తరగతులు ప్రారంభించి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయకుండా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వివిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. బ్లూప్రిం ట్ ప్రకారం విద్యార్థుల సంసిద్ధత, చర్చలు, సమీక్షల ద్వారా ప్రతిభా ప్రగతికి ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుల రోజున ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ రోజంతా ఉండి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలో ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలనే దానిపై సిద్ధం చేస్తున్నారు. ఉత్తీర్ణతా శాతం పెంపునకు ప్రణాళికలు పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గత ఏడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు వేశామని డీఈఓ కృష్ణారావు అన్నారు. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 91.8 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కొత్తరాష్ట్రంలో మరింత మెరుగుపడేలా పాఠశాలస్థాయిలో ప్రణాళికలు వేశామని చెప్పారు. వచ్చేనెల మొదటివారంలో జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్థ్యంపై ఒక అంచనా వస్తుందని తెలిపారు. నిర్ణీత టైమ్ టేబుల్ ప్రకారం ప్రత్యేక ప్రణాళికను పూర్తిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
సెలవుల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించింది. అయితే టెన్త్ విద్యార్థులకు మాత్రం సెలవులతో సంబంధం లేకుండా యథావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేవలం 13 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే టెన్త్విద్యార్థులకు సెలవు దినాలుగా ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి 12వ తేదీ వరకు, తిరిగి 17నుంచి 19వ తేదీ వరకు స్పెషల్ క్లాసులను తప్పనిసరిగా నిర్వహించాలని డీఈఓ నుంచి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. రోజూ రెండు సబ్జెక్టుల చొప్పున మొత్తం 4 గంటల పాటు ప్రత్యేక తరగతులు కొనసాగించాలని తేల్చిచెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాశాఖ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లో పాఠశాలకు వెళ్లి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లో అసలు విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించినా పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి ఉండదన్న విషయం అధికారులకు కూడా తెలిసినా కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు విమర్శిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇతర తరగతులకు క్లాసులు నిర్వహిస్తే చర్యలు:డీఈఓ పండుగను పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం నుంచి ఈ నెల 19 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినట్టు డీఈఓ సోమిరెడ్డి తెలిపారు. అయితే టెన్త్ విద్యార్థులకు.. పండుగ రోజులను మినహాయించి మిగి లిన సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. టెన్త్ విద్యార్థులకు మినహా ఇతరులకు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.