స్కూలు పిల్లలతో లతా మారవేణి
ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఓ మంచి ఆలోచన కొన్ని సమూహాలకు చేరువ చేస్తుంది. అది సమాజానికి మేలు చేసే ఆలోచన అయితే ఎంతో మందికి స్ఫూర్తి సందేశాన్ని అందిస్తుంది. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటున్న లతా మారవేణి ఆలోచన ఇప్పుడు వందలాది పేద పిల్లల ఉదయాలను ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మార్చుతుంది. అదెలాగో తెలియాలంటే ఆమె చెప్పే విషయాలను మనమూ వినాలి.. ఆచరణలో పెట్టిన ఆలోచనలను తప్పక తెలుసుకోవాలి.
ఆకలి, ఆనందం, వికాసం సహజంగా సర్కారు బడుల్లోనే పిల్లల ముఖాల్లో లభిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. లతా మారవేణి తనకు వచ్చిన చదువును పిల్లలకు పంచేందుకు స్వచ్ఛందంగా స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ గమనించిన విషయాలు ప్రశ్నగా మదిలో మెదిలితే తనే పరిష్కారం కూడా వెదికారు. హైదరాబాద్‌లోని అల్వాల్, యాప్రాల్‌లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని 500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు లత మారవేణి. వాలంటీర్ల సాయంతో పిల్లలకు ప్రత్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న లత హైదరాబాద్ సీఆర్‌పీఎఫ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శేఖర్ మారవేని అర్ధాంగి.
పరిచయమైన పాఠం
‘‘మా స్వస్థలం రాజన్న సిరిసిల్లలోని గంభీరావ్‌పేట. మా వారి ఉద్యోగరీత్యా అస్సామ్‌కి వెళ్లాం. తన డ్యూటీ రోజూ పధ్నాలుగు గంటలపైనే ఉండేది. నాకు రోజంతా ఒంటరిగా అనిపించేది. అప్పుడు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు వెళ్లాను. స్వచ్ఛందంగా చదువు చెబుతానని అనడంతో స్కూల్ వాళ్లు కూడా సంతోషంగా ఆహ్వానించారు. అలా రోజూ కొన్ని గంటలు స్కూల్లోనే గడిపేదాన్ని. మొదట్లో పుస్తకాలు, పెన్నులు పిల్లలకు ఇస్తుండేదాన్ని. రోజూ అలా వెళుతున్నప్పుడు గమనించిన విషయం – పిల్లల్లో చాలా మంది ఉదయం ఏమీ తినకుండానే
బడికి వస్తున్నారు. మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం ఉంటుంది.
కొంతమంది పిల్లలు ఆ భోజనం కోసమే స్కూల్‌కి వస్తున్నారని కూడా తెలిసింది. కొన్నాళ్లు బిస్కెట్లు వంటివి ఇచ్చాను. నాతో పాటు అక్కడ పరిచయం అయినవారితో కలిసి కొంత ఎక్కువ మొత్తంలో ఉదయం పూట పిల్లలకు తినడానికి పండు, బిస్కెట్, ఎగ్ వంటివి ఇస్తుండేదాన్ని. అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత ఛత్తీస్‌గడ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూశాను. ఎక్కువ మంది గిరిజన పిల్లలు. పైగా అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయినా నా కార్యక్రమాలూ అక్కడి స్కూళ్లలోనూ కొనసాగించాను. కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, ఆపలేదు. పిల్లలకు స్కూల్ అయిపోయాక కూడా చదువులు చెప్పడం కొనసాగించాను.
అల్పాహారం తప్పనిసరి
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఓరోజు అల్వాల్, యాప్రాల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లాను. డీఈఓ పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా పిల్లల పరిస్థితి గమనించాక ఉదయం అల్పాహారం తప్పనిసరి అనిపించింది. ముందు కొన్ని రోజులు పిల్లలందరికీ పాలు ఇప్పించాను. కానీ, అవి కొందరికి పడేవి కావు. కొందరు పిల్లలు ఇష్టపడటం లేదు. దీంతో రాగి జావ, పాలు, బాదంపప్పు పొడి కలిపి ఒక్కొక్కరికి ఒక గ్లాసు చొప్పున ఇవ్వడం మొదలుపెట్టాను.
దీనిని స్కూల్‌లో పిల్లలకు అప్పటికప్పుడు తయారుచేసి ఇస్తుంటాం. ఇది పిల్లలకు బలవర్ధకం. నాలుగు గంటలసేపు వారి ఆకలికి తట్టుకునే శక్తికూడా ఉంటుంది. ఇది క్రమంగా పెంచుతూ వచ్చాం. స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల శారీరక ఎదుగుదల బాగుందని గ్రోత్ రిపోర్ట్ ఇచ్చారు. శారీరక ఎదుగుదల బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేడ్చల్‌లోని కొన్ని స్కూళ్ల నుంచి మా దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించమని అడుగుతున్నారు. నా ఈ ఆలోచన నచ్చిన వారితో కలిసి ‘వైట్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేడ్చల్‌లోని అన్ని స్కూళ్లకు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను.
ఈ యేడాది 1500 మందికి ఉదయం పూట బాలామృతం అందించాలని నిర్ణయించుకున్నాను. వాలంటీర్లతో కలిసి పిల్లలకు ఇంగ్లిష్, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి క్లాసులు తీసుకుంటున్నాం. ఐటి సెక్టార్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లి వ్యసనాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మా వారూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. స్కూల్ బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలవుతుంది... అనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వానికి కూడా సబ్‌మిట్ చేశాం’’ అని వివరించారు లతామారవేణి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment