అభిప్రాయం
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.
‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి.
మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్‌పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.
స్త్రీల హక్కులకు విఘాతం
‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే.
కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.
ఇంకా వివక్షేనా....
‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.
– పగిడిపాల ఆంజనేయులు
సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment