తూర్పుగోదావరి, ఐ.పోలవరం (ముమ్మిడివరం): పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా పరీక్షల కోసం చదువుకోవడం పైనే. అయితే పాఠాలను బట్టీ పట్టడానికి పడే కష్టంలో కొంతైనా చేతి రాతను మెరుగు పరుచుకోవడం కోసం పడే వారు చాలా కొద్ది మంది మాత్రమే. పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయడం ఎంత ముఖ్యమో.. ఆ రాసేది చూడముచ్చటగా రాయడమూ అంతే ముఖ్యం. అంటే పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణతకు దస్తూరీ కూడా కీలకమే.
గజిబిజిగా ఉండే దస్తూరీతో రాసిన సమాధానం ఎంత సమగ్రమైనదైనా..పేపరును మూ ల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం చేసుకోవ డం కొంత ప్రయాస అవుతుంది. విద్యార్థి రాసింది వారికి ఎంత తక్కువ వ్యవధిలో అర్థమయితే అంత ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది.
ముందు నుంచే సాధన చేయాలి..
ఏడాది పాటు చదివిన పాఠ్యాంశాలను రెండున్నర గంటలలో ఆన్సర్ షీట్‌పై పెట్టాలి. ఎంత బాగా చదివిన విద్యార్థులకైనా పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. కొందరు మొదటి ప్రశ్నకు సమాధానం చక్కగా రాసి తరువాత అందంగా రాయలేకపోతుంటారు. దీనిని అధిగమించాలంటే ముందుగానే దస్తూరీపై సాధన చేస్తే పరీక్షలలో ఇబ్బందులు ఉండవన్నది నిపుణుల సూచన. ఆణిముత్యాల్లాంటి అక్షరాల కోసం కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని మండల విద్యాశాఖాధికారి నక్కా వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఆయన పనిచేసిన టి.కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాలు అందంగా రాయడానికి ముందు నుంచి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇవి పాటించాలి..
♦ సమాధానపత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు ఒకటికి రెండు మార్కులు వేసే అవకాశం ఉంటుంది.
♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి.
♦ సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక కనిపిస్తుంది.
♦ పేజీలో వాక్యాలు పైనుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుస క్రమంలో ఉండాలి.
♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లను మించి రాయకూడదు.
♦ రోజూ కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయొచ్చు.
♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి.
♦ జవాబు రాసేటప్పుడు ప్యాడ్ పైకి వాలి, పోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయడం మంచిది.
♦ అక్షరాలు పదాలు, వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉండాలి.
అదనపు మార్కులు సొంతం
అదనపు మార్కులకు చేతి రాత చాలా ముఖ్యం. చేతి రాతను బట్టి విద్యార్థి సామర్థాన్ని అంచనా వేయవచ్చు. పాఠశాల సముదాయ సమావేశాల్లో ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల చేతి రాత బాగుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. – నక్కా వెంకటేశ్వరావు, ఎంఈఓ,ఐ.పోలవరం
ప్రాధాన్యం ఇవ్వాల్సిందే
శాస్త్ర, సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థినీ విద్యార్థులకు అదనంగా మార్కులు పొందే అవకాశం ఉంది. మా పాఠశాలలో ఈ విధంగా తర్పీదు ఇస్తున్నాం.– ఎన్.సుబ్రహ్మణ్యం, జెడ్పీ పాఠశాల, మురమళ్ల
Comments
Please login to add a commentAdd a comment