ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ
విద్యార్థులలో ఆసక్తి పెంచుతూ.. చేతిరాతలో మెళకువలు
ఆదర్శంగా నిలుస్తున్న జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ
విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల ప్రశంసలు
టెక్నాలజీ యుగంలో చేతిలో సెల్ ఫోన్ వాడుతున్న రోజుల్లో కలంతో దోస్తీ చేయిస్తూ.. చేతితో అక్షరాలను అందంగా రాయిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ వంపు మల్లయ్య. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, చింతల్æ, షాపూర్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాత నేర్చుకో.. మార్కులు పెంచుకో.. అనే నినాదంతో ఇంగ్లిష్ ల్యూసిడా, కర్సివ్ రైటింగ్, తెలుగులో పదాలు ఎలా రాయాలో సూచిస్తూ బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు సునాయస పద్ధతిలో, అందమైన చేతిరాతను నేర్పిస్తూ ప్రోహిస్తున్నాడు. – జగద్గిరిగుట్ట
నగరంలోని జగద్గిరిగుట్టలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణను ప్రారంభించారు. విద్యార్థుల్లో మార్పు కనిపించడంతో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లన్నను సంప్రదించడం, విద్యార్థులకు ఉచితంగా మెళకువలు నేరి్పంచడం మెదలుపెట్టాడు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు, ఇటీవలె ఓ ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహిస్తున్న మల్లయ్యను కుత్బుల్లాపూర్ ఎంఈఓ జెమినీ కుమారి అక్కడికి వచ్చి అభినందించి సత్కరించారు.
ప్రాణ స్నేహితుడి పేరుతో..
మరణించిన ప్రాణ స్నేహితుడు జితేందర్ పేరుతో అకాడమీ స్థాపించి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నారు. ఉచితంగా అనేక చేతిరాత శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇతనికి సహకారం అందిస్తున్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నాడో.. అక్కడే వెతుక్కుంటూ..
సాంఘిక, గురుకుల సంక్షేమ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదవడంతో పాటు ఇంగ్లీసు ధారాళంగా మాట్లాడలేక పోవడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు వదులుకోవడంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి ‘ఎక్కడైతే పోగొట్టుకొన్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో అదే ఆంగ్లంలో ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిక్షణ పొందారు. ఇప్పడు ఆకర్షణీయమైన టెక్నిక్స్‌తో విద్యార్థుల చేతిరాతను మారుస్తున్నాడు.
‘నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు. విద్యార్థులు చేతిరాతను నిర్లక్ష్యం చేయవద్దు. ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణ కోసం 9182989283 సంప్రదించవచ్చు’ అని వంపు మల్లయ్య చెబుతున్నారు.
ల్యూసిడా, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ శిబిరాలు పంజగుట్ట
మనం రాసే అక్షరాలు మన మనసుకు అద్దం పడతాయి. మన వ్యక్తిత్వం ఏమిటో మన చేతి రాతలో తెలుస్తుందంటారు. అలాంటి చేతిరాతను ఉర్దూ, ఇంగ్లీషులో ఎలా పెంపొందించుకోవాలి అనే అంశంపై శిక్షణ ఇస్తుంటారు. అదే కేంద్ర ఉన్నత విద్య, ఉర్దూ భాష జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎర్రమంజిల్ లోని ఇదారే ఇ అదబియాత్ ఇ ఉర్దూ సెంటర్‌లోని కాలిగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ ట్రైనింగ్ సెంటర్. ఈ సెంటర్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కాలిగ్రాఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఇందులో 2022–2024 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రపంచ పురాతన కాలపు అక్షరాలు, ఇస్లామ్ పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ను లిఖించిన అక్షరాలు, అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్ వివిధ ఫాంట్స్‌తో కాగితం, బియ్యం గింజ, మేక చర్మం, కోడిగుడ్డు, బాదాం గింజపై అద్భుత చిత్రాలను, ఖురాన్‌లో చెప్పిన ప్రవచనాలను ప్రదర్శించారు. దీంతో ఇంగ్లిష్ చేతిరాత ఎలా పెంపొందించుకోవాలి, ఒక లెటర్, పెళ్లి పత్రిక, చెక్‌బుక్‌పై ఎలా రాయాలి అన్న అంశాలను కూడా ఇక్కడ నేర్పుతారని నిర్వాహకులు ఎ.షుఖుర్, సయ్యద్ రఫియుద్దీన్ ఖాద్రీ తెలిపారు.
వారం రోజుల శిక్షణ..
జితేందర్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ మా పాఠశాలలో వారం రోజుల పాటు చేతిరాత శిక్షణా తరగతులను నిర్వహించింది. దీని వల్ల ల్యూసిడా రైంటిగ్‌పై ఆసక్తి పెరిగింది. రానున్న వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధిచగలననే నమ్మకం కలిగింది.
– దక్షిత, 10వ తరగతి విద్యార్థిని జెడ్‌పీహెచ్‌ఎస్
ఆత్మ స్థైర్యం పెరిగింది..
చేతిరాత శిక్షణ నాలో ఆత్మ స్థైర్యాన్ని పెంచింది. రానున్న పదో తరగతి పరీక్షలకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. గతంతో పోలిస్తే నా చేతిరాత మెరుగుపడింది. – శ్వేత, 10వ తరగతి విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment