jagadgirigutta
-
Hyderabad: వంశీతో వెళ్లిపోతున్నానని రాసి పెట్టి..యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్‌కు చెందిన గోకల బాల్‌రాజ్‌గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది. కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్‌ఫోన్‌కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్ -
అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
సాక్షి, జగద్గిరిగుట్ట: భూవివాదం నేపథ్యంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్‌పై అసత్య ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలపై తీన్మార్ మల్లన్నపై కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన కొందరు వ్యక్తులు కార్పొరేటర్ జగన్ తమ భూమి కబ్జా చేశారని తీన్మార్ మల్లన్నను సంప్రదించారు. దీంతో అతడి టీమ్ సభ్యులు కార్పొరేటర్ పీఏగా పనిచేస్తున్న సంపత్‌రెడ్డికి కాల్చేసి భూవివాదం విషయమై అడిగారు. అయితే తనపై బెదిరింపులకు దిగడంతో పాటు భూమిని ఆక్రమించామని అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ సంపత్‌రెడ్డి జూలై 21న కోర్టును ఆశ్రయించాడు. తీన్మార్ మల్లన్న గ్రూపు సభ్యులు మాట్లాడిన కాల్ రికార్డును పరిశీలించిన కోర్డు అతడిపై కేసు నమోదు చేయాలని జగద్గిరిగుట్ట పోలీసులకు ఉత్తర్వు కాపీని అందజేయడంతో బుధవారం కేసు నమోదు చేశారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
మత్తు అలవాటు పడితే.. భవిష్యత్తు చిత్తు
సాక్షి, ఆల్విన్‌కాలనీ( హైదరాబాద్): మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలుగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ముఠాలుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలను పీలుస్తున్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ చీకటి వ్యవహారాన్ని నిర్వహిస్తుండటంతో యువత రోగాల బారిన పడుతుండటంతో పాటు చెడుదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, ఫ్లై ఓవర్లు, చెరువు కట్టలు, నిర్మానుష ప్రదేశాలు ఎంచుకొని యువత మాదకద్రవ్యాలు సేవిస్తూ అటుగా వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుండటం గమనార్హం. అదేమిటని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటావో చేసుకో మేము స్థానికులమంటూ దుర్భాషలాడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూకట్పల్లి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే చిత్తారమ్మ ఆలయ రోడ్డులో ఓ దుకాణం సమీపంలో యువత మాదకద్రవ్యాలను సిగరెట్లో నింపుకొని సేవిస్తూ చిందులేస్తూ రహదారిపై వెళ్లేవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని మందలించగా ఎదురుదాడికి దిగారని స్థానికులు, ప్రయాణికులు వాపోయారు. ► కూకట్పల్లి సర్కిల్ ధరణినగర్ సమీపంలో పరికి చెరువు కట్టపై నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తుపదార్థాలు సేవించటమే కాకుండా మందుబాబులకు కూడా అడ్డాగా మారింది. స్థానికులు వారిని ప్రశ్నిస్తే మత్తులో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని రాత్రి వేళల్లో అరుపులు, కేకలతో అలజడి సృష్టిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ► ఎల్లమ్మబండ చౌరస్తాలో, ఎన్టీఆర్నగర్, రైతు బజార్, మహదేవ్‌పురం చౌరస్తాలోని సిక్కుల కాలనీల్లో గంజాయి వ్యాపారం విరివిగా జరుగుతుందని యువతను టార్గెట్ చేసి గంజాయిని విక్రయిస్తూ యువతను చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ► భరత్‌నగర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో సైతం యువత గంజాయి మాదకద్రవ్యాలను సేవిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు గమనించి అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. మత్తులో ఉన్నవారు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అని ఆందోళన చెందుతున్నారు. ► జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్ కాలనీ, హుడా పార్కు ప్రాంతాలను ఆసరాగా తీసుకొని రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ► కేపీహెచ్‌బీ కాలనీ కళామందిర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పద్మావతి ప్లాజా ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని యువత జోరుగా మత్తుమందులు సేవిస్తున్నారు. ► ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ పెంచి మాదక ద్రవ్యాలు సేవించే వారిపై దృష్టి సారించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే తప్ప వారిలో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పరికి చెరువు కట్టపై రోజూ యువత గుంపులుగా వచ్చి సిగరెట్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మందును నింపుకొని పీలుస్తూ దాడులకు దిగుతున్నారు. పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారికి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వారు వెళ్లిపోగానే తిరిగి గంజాయి పీలుస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. – గోపాల్, ధరణినగర్ జనరల్ సెక్రటరీ కఠిన చర్యలు తథ్యం నిర్జన ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతూ పెడదారిన పడుతున్నారని తమకు ఫిర్యాదు రావటంతో వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాము. ఇటీవల మూసాపేటలో గంజాయి విక్రయిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఎక్కడి నుంచైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిఘా ఏర్పాటు చేస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. – నర్సింగరావు, ఇన్స్పెక్టర్, కూకట్పల్లి ( చదవండి: టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు.. ) -
హైదరాబాద్‌లో దారుణం.. తండ్రి ఉన్మాద చర్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌కు చెందిన శివ గౌడ్(40)కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెంచుకుని.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ మహిళ శివపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో శివ రగిలిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్ చేసి ఆమె కొడుకును చంపుతానంటూ బెదిరించాడు. కంగారుపడ్డ ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్ చేయగా.. వారితోనూ దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివ.. వారిని చూసి ఊగిపోయాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్(3)ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడున్న ఓ ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. భయంతో భార్య కేకలు వేసినా.. కొడుకుని లాక్కునేందుకు పక్కనున్నవారు యత్నించినా శివ పట్టు వీడలేదు. చివరకు స్థానికులు గుమిగూడటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. శివపై ఫిర్యాదు చేసేందుకు భార్య సిద్ధంగా లేకపోవటంతో.. కేసును సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు. -
మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన తండ్రి
-
బాలుడి అనుమానాస్పద మృతి
జగద్గిరిగుట్ట: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్టేషన్ పరిధిలో కలకలం రేపింది..పోలీసుల కథనం మేరకు వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఆకాశ్(16) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రక్తపుమడుగులో పడి ఉండటంతో అతను హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఆకాష్ తండ్రి చనిపోవడంతో మేనమామ నర్సింహ్మ ఇంట్లో ఉండేవాడు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేదని, తరచూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చేవాడని నరసింహ తెలిపాడు, తనను ఎవరో కొట్టడానికి వస్తున్నారని, తనకు చేతబడి చేశారని చెప్పేవాడని తెలిపాడు. అయితే ఆకాశ్ ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో వెంకటేశ్వర నగర్ సమీపంలో తనను కొందరు చంపడానికి వస్తున్నారని, అందుకే పారిపోతున్నానని చెప్పినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ‘మా నాన్నను చంపేశారు నన్ను కూడా చంపేస్తారని’ మృతుడు చెప్పినట్లు ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆకాశ్ మృతి చెందిన ప్రాంతాన్ని డీసీపీ డాక్టర్ సాయిశేఖర్ పరిశీలించారు. స్థానిక సీఐ శ్రీనివాస్, స్థానికులతో వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
క్వారీలో పడి ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పరిధిలోని దేవేందర్‌నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకులు మరణించారు. మృతులు కౌసర్‌నగర్‌కు చెందిన రహీం(22), అస్లాం(18)గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి గాంధీఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాపర్ వైరుతో పతంగి ఎగిరేయడంతో దారుణం
జగద్గిరిగుట్ట: పతంగి ఎగరవేస్తుండగా కరెంట్ తీగలకు తాకడంతో ఇద్దరు చిన్నారులు విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలయ్యారు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం... అంజయ్యనగర్ షిరిడీ హిల్స్‌కు చెందిన బుచ్చిరెడ్డి కుమారుడు అభిషేక్‌రెడ్డి(8), చంద్రశేఖర్ కుమారుడు అభిషేక్ (9) శనివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ డాబా పైకి ఎక్కి పతంగులు ఎగుర వేస్తున్నారు. ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు పతంగి తట్టుకోవడంతో విద్యుద్ఘాతానికి గురయ్యారు. ప్రమాదానికి ముఖ్య కారణం ఇదీ.. అభిషేక్‌రెడ్డి, అభిషేక్‌లు ఎగుర వేసే పతంగికి మాంజాకు బదులు సన్నని కాపర్ వైర్ కట్టి ఎగుర వేస్తున్నారు. ఒకరు పతంగి ఎగుర వేస్తుండగా, మరొకరు కాపర్ వైర్ చుట్టిన డబ్బాను చేత్తో పట్టుకున్నారు. పైకి ఎగిరిన పతంగి ఒక్కసారిగా పక్క భవనంపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు తట్టుకుంది. కాపర్‌వైర్ కావడంతో విద్యుత్ సరఫరా జరిగి చిన్నారులిద్దరూ కరెంట్ షాక్‌కు గురై పడిపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వెంటనే భవనం పైకి వెళ్లి చూడగా బాలురు తీవ్రగాయాలతో పడి ఉన్నారు. వీరు పతంగి ఎగిర వేస్తున్న భనవంపై ఉదయం కురిసిన వర్షపు నీరు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. చిన్నారులను కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సూచన మేరకు అభిషేక్‌రెడ్డిని గాంధీ ఆస్పత్రికి. అభిషేక్‌ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అభిషేక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కాగా, విద్యుద్ఘాతం కారణం గా ప్రమాదం జరిగిన భవనం చుట్టు పక్కల ఉన్న గృహాల్లో టీవీలు, మీటర్లు, ఇతర ఎలక్టికల్, ఎలక్టాన్రిక్ వస్తువులు కాలిపోయాయి. -
తల్లి ప్రేమ
జగద్గిరిగుట్ట: జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిసరాలు పచ్చదనంతో అలరారుతున్నాయి. జీవ వైవిధ్య సదస్సును ఆదర్శంగా తీసుకుని నాటిన 193 మొక్కలు వృక్షాలుగా ఎదిగి... పక్షులకు ఆవాసాలుగా మారాయి. అవి గూళ్లు కట్టుకుని పిల్లలు పెడుతూ సంతానాన్ని వృద్ది చేసుకుంటున్నాయి. అక్కడ తమ పిల్లలకు పక్షులు ఆహారాన్ని తినిపిస్తున్న దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. -
జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం
ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. గోనే సంచుల గోడౌన్ కాలి బూడిదైంది. ఈ సంఘటన జగద్గిరి గుట్ట పరిధిలోని గుబురుగుట్టలో శనివారం జరిగింది. మంటలు ఎగిసి పడటాన్ని గమనించిని స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారూ రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి విరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 12 గంటల సమయంలో గొడవ పడుతున్న నలుగురు యువకులను పెట్రోలింగ్ పోలీసులు మందలించి పంపించేశారు. గంట తర్వాత తిరిగి వారు అక్కడకు చేరుకోగా, రాకేశ్ అనే వ్యక్తిపై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దన్న భర్త
హైదరాబాద్ (జగద్గిరిగుట్ట) : ఆడపిల్ల పుట్టిందని భర్త కాపురానికి రావద్దంటున్నాడంటూ ఓ వివాహిత జగద్గిరిగుట్ట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌కు చెందిన మరియాకు 2011లో రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా వీరు కొన్నాళ్ల పాట్లు దక్షిణాఫ్రికాలో ఉండి ఇటీవలే ఇండియాకు వచ్చారు. కాగా మరియా డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల క్రితం మరియా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల ఇష్టం లేని భర్త రవి అప్పటినుంచి ఆమెను దూరంగా ఉంచాడు. దీంతో తనను కాపురానికి రావద్దని చెప్పి పట్టించుకోవడం లేదంటూ మరియ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముందు చూపుతో మందు కొంటే...
హైదరాబాద్: జేబులోని మద్యం సీసా పగిలి వ్యక్తి మర్మాంగాలకు గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎసై రమేష్ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌కు చెందిన మల్లేశ్(26) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన మల్లేశ్ మరో సీసా కొనుగోలు చేసి ప్యాంట్ ముందు జేబులో పెట్టుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం రావడంతో పరుగుతీశాడు. ఈ క్రమంలో మల్లేశ్ కింద పడడంతో జేబులో ఉన్న సీసా పగిలి మర్మాంగాలకు గుచ్చుకుంది. తీవ్రరక్తస్రావం కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.