చిన్నారులు పతంగికి కట్టిన కాపర్ వైర్, చికిత్స పొందుతున్న అభిషేక్‌రెడ్డి
జగద్గిరిగుట్ట: పతంగి ఎగరవేస్తుండగా కరెంట్ తీగలకు తాకడంతో ఇద్దరు చిన్నారులు విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలయ్యారు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం... అంజయ్యనగర్ షిరిడీ హిల్స్‌కు చెందిన బుచ్చిరెడ్డి కుమారుడు అభిషేక్‌రెడ్డి(8), చంద్రశేఖర్ కుమారుడు అభిషేక్ (9) శనివారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ఓ డాబా పైకి ఎక్కి పతంగులు ఎగుర వేస్తున్నారు. ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు పతంగి తట్టుకోవడంతో విద్యుద్ఘాతానికి గురయ్యారు.
ప్రమాదానికి ముఖ్య కారణం ఇదీ..
అభిషేక్‌రెడ్డి, అభిషేక్‌లు ఎగుర వేసే పతంగికి మాంజాకు బదులు సన్నని కాపర్ వైర్ కట్టి ఎగుర వేస్తున్నారు. ఒకరు పతంగి ఎగుర వేస్తుండగా, మరొకరు కాపర్ వైర్ చుట్టిన డబ్బాను చేత్తో పట్టుకున్నారు. పైకి ఎగిరిన పతంగి ఒక్కసారిగా పక్క భవనంపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు తట్టుకుంది. కాపర్‌వైర్ కావడంతో విద్యుత్ సరఫరా జరిగి చిన్నారులిద్దరూ కరెంట్ షాక్‌కు గురై పడిపోయారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వెంటనే భవనం పైకి వెళ్లి చూడగా బాలురు తీవ్రగాయాలతో పడి ఉన్నారు.
వీరు పతంగి ఎగిర వేస్తున్న భనవంపై ఉదయం కురిసిన వర్షపు నీరు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. చిన్నారులను కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సూచన మేరకు అభిషేక్‌రెడ్డిని గాంధీ ఆస్పత్రికి. అభిషేక్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అభిషేక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కాగా, విద్యుద్ఘాతం కారణం గా ప్రమాదం జరిగిన భవనం చుట్టు పక్కల ఉన్న గృహాల్లో టీవీలు, మీటర్లు, ఇతర ఎలక్టికల్, ఎలక్టాన్రిక్ వస్తువులు కాలిపోయాయి.