హైదరాబాద్‌లో దారుణం.. తండ్రి ఉన్మాద చర్య | Drunk Man Bashes Son Against Auto In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 1:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Drunk Man Bashes Son Against Auto In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి  తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఉప్పల్‌కు చెందిన శివ గౌడ్‌(40)కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్‌ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెంచుకుని.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ మహిళ శివపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో శివ రగిలిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్‌ చేసి ఆమె కొడుకును చంపుతానంటూ బెదిరించాడు. కంగారుపడ్డ ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్‌ చేయగా.. వారితోనూ దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్‌ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. 

పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివ.. వారిని చూసి ఊగిపోయాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్‌(3)ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడున్న ఓ ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. భయంతో భార్య కేకలు వేసినా.. కొడుకుని లాక్కునేందుకు పక్కనున్నవారు యత్నించినా శివ పట్టు వీడలేదు. చివరకు స్థానికులు గుమిగూడటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.  తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. శివపై ఫిర్యాదు చేసేందుకు భార్య సిద్ధంగా లేకపోవటంతో.. కేసును సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement