సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించింది. అయితే టెన్త్ విద్యార్థులకు మాత్రం సెలవులతో సంబంధం లేకుండా యథావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేవలం 13 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే టెన్త్‌విద్యార్థులకు సెలవు దినాలుగా ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి 12వ తేదీ వరకు, తిరిగి 17నుంచి 19వ తేదీ వరకు స్పెషల్ క్లాసులను తప్పనిసరిగా నిర్వహించాలని డీఈఓ నుంచి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. రోజూ రెండు సబ్జెక్టుల చొప్పున మొత్తం 4 గంటల పాటు ప్రత్యేక తరగతులు కొనసాగించాలని తేల్చిచెప్పారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాశాఖ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లో పాఠశాలకు వెళ్లి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లో అసలు విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించినా పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి ఉండదన్న విషయం అధికారులకు కూడా తెలిసినా కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు విమర్శిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇతర తరగతులకు క్లాసులు నిర్వహిస్తే చర్యలు:డీఈఓ
పండుగను పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం నుంచి ఈ నెల 19 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినట్టు డీఈఓ సోమిరెడ్డి తెలిపారు. అయితే టెన్త్ విద్యార్థులకు.. పండుగ రోజులను మినహాయించి మిగి లిన సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. టెన్త్ విద్యార్థులకు మినహా ఇతరులకు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సెలవుల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
Published Thu, Jan 9 2014 12:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement