ఒకటి నుంచి ఐదో తగరతి వరకు విద్యనభ్యసిస్తున్న వారిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడం...
- వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- ఉదయం 8 నుంచి 10గంటల వరకు పాఠాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు
ఘట్‌కేసర్ టౌన్: ఒకటి నుంచి ఐదో తగరతి వరకు విద్యనభ్యసిస్తున్న వారిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించడం, బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించి విద్యను బోధించే వేసవి ప్రత్యేక తరగతులు సోమవారంతో ప్రారంభంకానున్నాయి.
గత సంవత్సరం నిర్వహించినట్లుగానేమండలంలోని నాలుగు క్లస్టర్లలో నాలుగు కేంద్రాల ద్వారా ఈ యేడు కూడ వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండలంలోని సీఆర్పీలకు వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి శిక్షణను ఇచ్చారు. సోమవారం నుంచి మే 30 వరకు వేసవి బడులను నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ప్రత్యేక తరగతులకు 50 శాతంలోపు విద్యార్థులు మాత్రమే హాజరుకావడంతో సత్ఫలితాలను పొందలేకపోయారు.
గతేడాది అంతంతమాత్రమే...
జిల్లాలో మొత్తం 2,800 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 185 స్కూల్ కాంప్లెక్స్‌ల ద్వారా వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఒక్కో క్లస్టర్‌లో 25 నుంచి 40 మంది విద్యార్థుల చొప్పున 7,400 మందికిపైగా విద్యార్థులకు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రారంభం అదిరినా పర్యవేక్షణ కరువై రానురాను విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో సీ గ్రేడులో ఉన్న విద్యార్థుల ప్రతిభను పెంచలేకపోయారు.
మండల విద్యాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేక ఈ కార్యక్రమం విజయవంతం కాలేదన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 135 స్కూల్ కాంప్లెక్స్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో పాఠశాలలో 50 విద్యార్థులకుగాను 1-2 తరగతుల వరకు 25 మందిని, 3-5 తరగతుల వరకు 25 మందిని గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో సీ గ్రేడ్ పొందిన 6,600 మంది విద్యార్థులను గుర్తించారు. సోమవారం ఉదయం 8 నుంచి 11గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
ఈ యేడైన పకడ్బందీగా వేసవి బడులు నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు బడి బయట ఉన్న పిల్లలను బడిలే చేర్పించేలా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లితండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారి అరుణ్‌ను సంప్రదించగా శిక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. మండలంలో నాలుగు కేంద్రాల ద్వారా శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు.