teachers and students
-
టీచర్స్ డే స్పెషల్ : 'రామాచార్య' గురించి శిష్యుల సరదా ముచ్చట్లు
గాయకుడిగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఎందరో ఎందరో గాయనీగాయకులను తీర్చిదిద్దారు రామాచారి. టీచర్స్ డే సందర్భంగా శిష్యుల గురించి ఆయన చెప్పిన విశేషాలు, గురువుతో అనుబంధం గురించి శిష్యులు చెప్పిన సరదా ముచ్చట్లు 'రామాచార్య' ఇంటర్వ్యూలో చూసేయండి.. -
మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్
లెక్కల టీచరు లీవ్ పెట్టాడని తెలిస్తే పండగ. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పిరియడ్ ఉన్నా పండగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు... కొడతాడా... పాడా... గ్రామర్ చెప్పే ఇంగ్లిష్ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు. ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్ టీచరు ఇంకో అమ్మ. ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు. ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి. ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్రూమ్ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు. బెత్తం ఫిలాసఫీ ‘దండం దశగుణం భవేత్’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు. కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్పీస్ను ఉండేలు కన్నా షార్ప్‌గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్‌ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్లో ఐస్ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు. మూడీ... కొందరు టీచర్లు మూడ్ బాగుంటే క్లాసు కేన్సిల్ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్‌లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం. ఇష్ట/అయిష్ట టీచర్లు స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్ క్లవర్లకు సోషల్ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్ పేపర్ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్ టీచర్ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు. సింహస్వప్నం తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్ సార్ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం. విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్లో అదే తరగతిలో అదే సిలబస్ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. -
‘విద్యార్థులకు విలువలు బోధించండి’
గ్రేటర్ నోయిడా: బోధనను కేవలం జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే పరిమితం చేయకుండా విలువల గురించి కూడా విద్యార్థులకు తెలియజెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడాలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం క్యాంపులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం హోంమంత్రి ప్రసంగించారు. జీవితంలో ఏ దశలోనైనా విలువలకు కట్టుబడి బతకడం విద్యార్థులకు నేర్పాలని టీచర్లను కోరారు. ‘పుస్తకాల్లోని పాఠాలను చెప్పడంతోనే సరిపోదు. పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలకు కట్టుబడి జీవించడం గురించి తెలియజెప్పాలి. వాటి గొప్పతనాన్ని చాటాలి. మెరుగైన సమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి బతకాల్సిందే. ఇతరులు బతికేలా మార్పు తీసుకురావాల్సిందే. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంద’ని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. -
విద్యార్థులే గురువులుగా..!
రోజు స్కూల్‌కు వస్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. మా గురువులు మాకు పాఠాలు బోధించేందుకు ఎంత శ్రమ పడుతున్నారో మేం బోధన చేస్తే అర్థమయింది. పాఠాలు చెప్పడం ఎంత కష్టమో.. క్రమశిక్షణ అంటే ఏమిటో తెలిసింది. విద్యార్థులందరూ ఒకేచోట ఉన్నప్పడు వారిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో బోధపడింది’ అని అన్నారు విద్యార్థులు. రోజు గురువులు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులు బుధవారం టీచర్స్ డే సందర్భంగా వారు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు. కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ సౌభాగ్యానికి, సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులే గురువులుగా మారి పాఠాలు బోధించారు. ఎవరి నైపుణ్యం మేరకు వారు బోధన చేసి గురువులతో శభాష్ అనిపించుకున్నారు. తమకు రోజు పాఠాలు చెప్పే గురువులు ఎలా కష్టపడుతున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇంగ్లిషు, సాంఘీకం బోధించా... తొమ్మిదో తరగతి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్పా. మాకు పాఠాలు చెప్పడానికి ప్రతిరోజు మా టీచర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. పాఠాలు చెప్పడం అంటే నేర్పడం కాదు.. మనం కూడా నేర్చుకోవాలన్న విషయం అర్థమయింది. -వంశీ, 10వతరగతి టీచరవుతా... భవిష్యత్తులో టీచరవుతా. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి. పుస్తకాలే కాకుండా సమాజంలో నిత్యం జరిగే అనేక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు పుస్తకాల్లో దొరకవు. మన చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన కలిగి ఉంటేనే చెప్పగలం. -అభిత, 10వతరగతి సన్నద్ధమయ్యా.. 8వతరగతి ఫిజికల్ సైన్స్ బోధించా. మాకు సార్లు చెప్పినప్పుడు మా దృష్టి మరోవైపు వెళ్లేది. పాఠం చెప్పడానికి రెండు రోజులు సన్నద్ధమయ్యా. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. -సౌమ్య, 9వతరగతి స్నేహితులే చెప్పినట్టు ఉంది.. తోటి స్నేహితులే పాఠాలు చెప్పినట్టు ఉంది. రోజు కలిసి తిరుగుతాం. కలిసి పాఠాలు చెప్పుబున్నట్లు అనిపించింది. ఎలా చెప్తారో అనుకున్నా. బాగానే బోధించారు. మాకు అర్థమయ్యేందుకు మా గురువులు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమయింది. -రాకేశ్, 8వతరగతి శభాష్ అనిపించుకున్నారు ప్రతి క్లాసులో ఎవరికి వారు బాగానే బోధించారు. ముందుగా వారికి కొన్ని విషయాలపై అవగాహన కల్పించాం. బాగా అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా తరగతి గదుల్లో వారు ఎంచుకున్న సబ్జెక్టును విద్యార్థులకు బోధించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎలా ఆరాటపడతారో స్వయంగా తెలుసుకున్నారు. శభాష్ అనిపించుకున్నారు. -రమేశ్, హెచ్ఎం -
‘పది’పై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్‌టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా.. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మాత్రం గత కొన్నేళ్లుగా చివరి స్థానాల్లోనే నిలుస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు పరీక్షలకు రెండు నెలల ముందు నుంచి చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. ఈసారి కలెక్టర్ దివ్యదేవరాజన్ పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల ద్వారా బోధించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ కోసం కూడా నిధులను విడుదల చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా, మరికొంతమంది కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులకు ఉదయం, సాయంత్రం వీలున్న సమయంలో తరగతులు నిర్వహించాలని, టీచర్లపై ప్రత్యేకంగా ఒత్తిడి తేవడం లేదని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏదేమైనా ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. ఈ యేడాదైనా మెరుగయ్యేనా.. గత రెండేళ్లుగా ఫలితాల పరంగా వెనుకబడిన జిల్లా ఈసారైనా టాప్–10లోనైనా ఉంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించకపోవడంతోనే ఫలితాల పరంగా కింది స్థానంలో ఉంటున్నామని విద్యావంతులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈసారైనా పక్కా ప్రణాళికతో విద్యాబోధన చేపడితే మెరుగైనా ఫలితాలు సాధించగలుగుతామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని, ఆయా సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ఫలితాలు సాధించేలా చూడాలని కోరుతున్నారు. కుంటుపడుతున్న విద్యావ్యవస్థ.. జిల్లాలో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఇన్‌చార్జీలతోనే పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోంది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే ఎంఈఓ బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ పనిని పూర్తిస్థాయిలో చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం డీఈఓ, ఉప విద్యాధికారి, ఎంఈఓ పోస్టులు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయించకపోవడంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యాభై శాతం మంది విద్యార్థులకు అక్షరాలు రాయడం, చదవడం రావడం లేదు. దీని ప్రభావం ఉన్నత తరగతికి వెళ్లిన విద్యార్థులపై ప్రభావం పడుతోంది. స్నాక్స్ కోసం నిధులు.. జిల్లాలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 63 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యంలో 4,502 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరందరూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 17 నుంచి జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అలసిపోకుండా ఉండేందుకు రూ.22లక్షల 51వేల నిధులను విడుదల చేశారు. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల అకౌంట్లలో డబ్బులను జమ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5 చొప్పున కేటాయించనున్నారు. వంద రోజుల పాటు ఈ ప్రక్రియ జరగనుంది. మంచి స్పందన ఉంది.. ఈ నెల 17 నుంచి కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేశారు. ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఎవరిపై కూడా ఒత్తిడి తేవడం లేదు. వారికి వీలున్న సమయంలో ప్రత్యేక తరగతులు బోధించాలని సూచించాం. పదిలో ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తాం. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ రవిందర్ రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్ -
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్
► 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు ► మధ్యాహ్న భోజన పథకానికి వర్తింపు ► ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ కర్నూలు: రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో ఈ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల హాజరును పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ హాజరుకు, రికార్డుల్లోని సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షలకుపైగా విద్యార్థులు అదనంగా కనిస్తున్నట్లు సమాచారం. వాస్తవ సంఖ్య తేలాలంటే బయోమెట్రిక్ విధానమే మేలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల్లో అధిక శాతం మంది విధులకు డుమ్మాకొట్టడం, బోధనేతర కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సొంత పనులకు సమయం వినియోగించడం తదితర విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మధ్యాహ్న భోజన పథకంలోనూ అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భోజనం చేసే వారి సంఖ్యను పెంచి వాటి నగదు ఏజెన్సీలు, హెచ్ఎంలు పంచుకొంటున్నారు. ఇలాంటివి అరికట్టడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాల్సిందేనని సర్కారు నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఆయా విద్యార్థుల పుట్టిన తేదీ, తండ్రి పేరు, వయస్సు, సామాజికవర్గం తదితర వివరాలను కంప్యూటరీకరణ ద్వారా నమోదు చేస్తారు. డీఈఓలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు, కేజీబీవీల ఎస్ఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్ పరిధిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా నిధుల విడుదల, ఉపాధ్యాయుల నియామకంలోని లోపాలను సరిదిద్దుతారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుండటంతో విద్యావ్యవస్థ గాడిలో పెట్టేందుకు దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి కర్నూలు జిల్లావ్యాప్తంగా 2,972 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిలో 4.41 లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3.98 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలో జిల్లాలో చాలా మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపి.. అందుకు సంబంధించిన నిధులు పాఠశాల సిబ్బంది దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యే విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని డివిజన్లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు విధులకు డుమ్మాకొట్టి బోధనేతర వ్యహారాలు చూస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. ఇక కర్నూలు నగరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా విరివిగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. స్వాగతిస్తున్నాం కానీ.. ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ.. అంతకంటే ముందు పాఠశాలల్లో సూపర్వైజ్ సిస్టమ్‌ను బలోపేతం చేయాలి. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను నియమించాలి. వారితో తరచూ పాఠశాలలను పర్యవేక్షింపజేస్తూ.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేయడం అంటే కంపెనీలకు లాభం చేకూర్చడమే అవుతుంది. - రామశేషయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు