► 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు
► మధ్యాహ్న భోజన పథకానికి వర్తింపు
► ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ
కర్నూలు: రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో ఈ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల హాజరును పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ హాజరుకు, రికార్డుల్లోని సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షలకుపైగా విద్యార్థులు అదనంగా కనిస్తున్నట్లు సమాచారం.
వాస్తవ సంఖ్య తేలాలంటే బయోమెట్రిక్ విధానమే మేలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల్లో అధిక శాతం మంది విధులకు డుమ్మాకొట్టడం, బోధనేతర కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సొంత పనులకు సమయం వినియోగించడం తదితర విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మధ్యాహ్న భోజన పథకంలోనూ అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భోజనం చేసే వారి సంఖ్యను పెంచి వాటి నగదు ఏజెన్సీలు, హెచ్‌ఎంలు పంచుకొంటున్నారు. ఇలాంటివి అరికట్టడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాల్సిందేనని సర్కారు నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఆయా విద్యార్థుల పుట్టిన తేదీ, తండ్రి పేరు, వయస్సు, సామాజికవర్గం తదితర వివరాలను కంప్యూటరీకరణ ద్వారా నమోదు చేస్తారు. డీఈఓలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు, కేజీబీవీల ఎస్‌ఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్ పరిధిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా నిధుల విడుదల, ఉపాధ్యాయుల నియామకంలోని లోపాలను సరిదిద్దుతారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుండటంతో విద్యావ్యవస్థ గాడిలో పెట్టేందుకు దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
కర్నూలు జిల్లావ్యాప్తంగా 2,972 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిలో 4.41 లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3.98 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలో జిల్లాలో చాలా మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపి.. అందుకు సంబంధించిన నిధులు పాఠశాల సిబ్బంది దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యే విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని డివిజన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు విధులకు డుమ్మాకొట్టి బోధనేతర వ్యహారాలు చూస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. ఇక కర్నూలు నగరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా విరివిగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది.
స్వాగతిస్తున్నాం కానీ..
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ.. అంతకంటే ముందు పాఠశాలల్లో సూపర్‌వైజ్ సిస్టమ్‌ను బలోపేతం చేయాలి. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను నియమించాలి. వారితో తరచూ పాఠశాలలను పర్యవేక్షింపజేస్తూ.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేయడం అంటే కంపెనీలకు లాభం చేకూర్చడమే అవుతుంది.
- రామశేషయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్
Published Wed, May 25 2016 9:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement