biometricsystems
-
మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కేటుగాళ్లు ఆధార్ కార్డ్‌ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే అలాంటి వారి నుంచి సురక్షితంగా ఉండేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈనేపథ్యంలో 12 అంకెల ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా మరో ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేసేలా డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆధార్ కార్డ్ సురక్షితంగా ఉండేలా బయో మెట్రిక్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. మీ ఆధార్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్ లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయాలి. ఇందుకోసం మీ ఐడీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్ ఎలా చేయాలి? ► https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లాలి ► అనంతరం Secure UID Authentication Channel సెక్షన్లోకి వెళ్లి Lock UID లేదా Unlock UID ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ► అలా చేసిన తరువాత మీరు మీ 12అంకెల ఆధార్‌తో పాటు సంబంధిత వివరాల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ► ఫైనల్ గా మీఫోన్ నెంబర్ కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ► ఆ ఓటీపీని యాడ్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది. చదవండి: రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్టెల్-వొడాఫోన్ -
బాబోయ్... భయోమెట్రిక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే బయోమెట్రిక్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ లేని కారణంగా చాలా చోట్ల వేలిముద్ర వేయడానికి కూడా కుదరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల హాజరుశాతం లెక్కించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలను నివారించడం కోసం పెట్టిన ఈ విధానం సాంకేతిక సమస్యల కారణంగా అభాసుపాలవుతోంది. నాలుగు నెలల క్రితమే ట్యాబ్‌లు పంపిణీ చేసినా ఇటీవలే ఈ ప్రక్రియను కొన్ని స్కూళ్లలో ప్రారంభించారు. బయోమెట్రిక్‌కు సంబంధించిన పరికరాలు పాఠశాలలకు అందించినా, వీరి వేలి ముద్రలు ఇంకా నమోదు కాలేదు. కొన్ని చోట్ల సిగ్నల్స్ లేకపోవడం, మరికొన్ని చోట్ల యంత్ర పరికరాలు మొరాయించడంతో ఈ ప్రక్రియ సక్రమంగా కొనసాగడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఐడీ నంబర్‌ను నమోదు చేసి వేలిముద్ర వేయాల్సి ఉంది. దీని వల్ల సమయం ఎక్కువగా తీసుకుంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెషిన్లు పనిచేయకపోయినా హాజ రు నమోదు కాదు. మధ్యాహ్నం భోజన పథకానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థులకు బయోమెట్రిక్ వేయటానికి గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. వేలిముద్రలు వేయటానికి వచ్చినప్పుడు సర్వర్లు పనిచేయక విద్యార్థులు వేచి ఉండటంతో బోధన వారికి అందటం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చాలా చోట్ల మామూలు విధానం అమలవుతోంది. మరో వైపు జిల్లాలో వివిధ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం మిథ్యగా కొనసాగుతోంది. నాసిరకం బియ్యం, పప్పు దినుసులను వినియోగిస్తూ రుచీపచీ లేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. బియ్యం నాసిరకం కావడంతో అన్నం కొన్నిసార్లు ఉడకడం లేదు. పలుసార్లు పిల్లలు అన్నం పారబోస్తున్నారు. పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. వారానికి మూడుసార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండడంతో చిన్న సైజు గుడ్లను, కుళ్లిన గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేస్తుండడంతో వాటిని చూస్తేనే విద్యార్థులు వాంతి చేసుకుంటున్నారు. వారంలో మూడు సార్లు గుడ్డు అందించడం సాధ్యం కాదని ఆ పథకం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచితేనే మూడో గుడ్డు ఇవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి నమోదైన విద్యార్థుల్లో సుమారు 56 వేల మంది దీనికి దూరంగా ఉంటున్నారు. చాలా చోట్ల విద్యార్థులు నేలపైనే మధ్యాహ్న భోజనాన్ని ఆరగిస్తున్నారు. పాఠశాలల్లో భోజనం చేసేందుకు కుర్చీలు, టేబుల్స్ ఉండటం లేదు. -
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్
► 2016-17 విద్యాసంవత్సరం నుంచి అమలు ► మధ్యాహ్న భోజన పథకానికి వర్తింపు ► ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ కర్నూలు: రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో ఈ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల హాజరును పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ హాజరుకు, రికార్డుల్లోని సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షలకుపైగా విద్యార్థులు అదనంగా కనిస్తున్నట్లు సమాచారం. వాస్తవ సంఖ్య తేలాలంటే బయోమెట్రిక్ విధానమే మేలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయుల్లో అధిక శాతం మంది విధులకు డుమ్మాకొట్టడం, బోధనేతర కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సొంత పనులకు సమయం వినియోగించడం తదితర విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. మధ్యాహ్న భోజన పథకంలోనూ అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భోజనం చేసే వారి సంఖ్యను పెంచి వాటి నగదు ఏజెన్సీలు, హెచ్ఎంలు పంచుకొంటున్నారు. ఇలాంటివి అరికట్టడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాల్సిందేనని సర్కారు నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఆయా విద్యార్థుల పుట్టిన తేదీ, తండ్రి పేరు, వయస్సు, సామాజికవర్గం తదితర వివరాలను కంప్యూటరీకరణ ద్వారా నమోదు చేస్తారు. డీఈఓలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు, కేజీబీవీల ఎస్ఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్ పరిధిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా నిధుల విడుదల, ఉపాధ్యాయుల నియామకంలోని లోపాలను సరిదిద్దుతారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుండటంతో విద్యావ్యవస్థ గాడిలో పెట్టేందుకు దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి కర్నూలు జిల్లావ్యాప్తంగా 2,972 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిలో 4.41 లక్షల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3.98 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలో జిల్లాలో చాలా మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపి.. అందుకు సంబంధించిన నిధులు పాఠశాల సిబ్బంది దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యే విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదోని డివిజన్లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు విధులకు డుమ్మాకొట్టి బోధనేతర వ్యహారాలు చూస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. ఇక కర్నూలు నగరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా విరివిగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. స్వాగతిస్తున్నాం కానీ.. ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ.. అంతకంటే ముందు పాఠశాలల్లో సూపర్వైజ్ సిస్టమ్‌ను బలోపేతం చేయాలి. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలను నియమించాలి. వారితో తరచూ పాఠశాలలను పర్యవేక్షింపజేస్తూ.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేయడం అంటే కంపెనీలకు లాభం చేకూర్చడమే అవుతుంది. - రామశేషయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు