సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే బయోమెట్రిక్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ లేని కారణంగా చాలా చోట్ల వేలిముద్ర వేయడానికి కూడా కుదరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల హాజరుశాతం లెక్కించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలను నివారించడం కోసం పెట్టిన ఈ విధానం సాంకేతిక సమస్యల కారణంగా అభాసుపాలవుతోంది. నాలుగు నెలల క్రితమే ట్యాబ్‌లు పంపిణీ చేసినా ఇటీవలే ఈ ప్రక్రియను కొన్ని స్కూళ్లలో ప్రారంభించారు. బయోమెట్రిక్‌కు సంబంధించిన పరికరాలు పాఠశాలలకు అందించినా, వీరి వేలి ముద్రలు ఇంకా నమోదు కాలేదు. కొన్ని చోట్ల సిగ్నల్స్ లేకపోవడం, మరికొన్ని చోట్ల యంత్ర పరికరాలు మొరాయించడంతో ఈ ప్రక్రియ సక్రమంగా కొనసాగడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రతి విద్యార్థి తన ఐడీ నంబర్‌ను నమోదు చేసి వేలిముద్ర వేయాల్సి ఉంది. దీని వల్ల సమయం ఎక్కువగా తీసుకుంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెషిన్లు పనిచేయకపోయినా హాజ రు నమోదు కాదు. మధ్యాహ్నం భోజన పథకానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థులకు బయోమెట్రిక్ వేయటానికి గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. వేలిముద్రలు వేయటానికి వచ్చినప్పుడు సర్వర్లు పనిచేయక విద్యార్థులు వేచి ఉండటంతో బోధన వారికి అందటం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చాలా చోట్ల మామూలు విధానం అమలవుతోంది. మరో వైపు జిల్లాలో వివిధ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం మిథ్యగా కొనసాగుతోంది. నాసిరకం బియ్యం, పప్పు దినుసులను వినియోగిస్తూ రుచీపచీ లేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు.
బియ్యం నాసిరకం కావడంతో అన్నం కొన్నిసార్లు ఉడకడం లేదు. పలుసార్లు పిల్లలు అన్నం పారబోస్తున్నారు. పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. వారానికి మూడుసార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండడంతో చిన్న సైజు గుడ్లను, కుళ్లిన గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేస్తుండడంతో వాటిని చూస్తేనే విద్యార్థులు వాంతి చేసుకుంటున్నారు. వారంలో మూడు సార్లు గుడ్డు అందించడం సాధ్యం కాదని ఆ పథకం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచితేనే మూడో గుడ్డు ఇవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి నమోదైన విద్యార్థుల్లో సుమారు 56 వేల మంది దీనికి దూరంగా ఉంటున్నారు. చాలా చోట్ల విద్యార్థులు నేలపైనే మధ్యాహ్న భోజనాన్ని ఆరగిస్తున్నారు. పాఠశాలల్లో భోజనం చేసేందుకు కుర్చీలు, టేబుల్స్ ఉండటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment