teachers problems
-
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పీఆర్టీయూతోనే టీచర్ల సమస్యలకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూటీఎస్) 51వ ఆవిర్భావ ఉత్సవాలు హైదరాబాద్‌లోని సంఘం భవనంలో బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్థన్ రెడ్డి, కూర రఘోత్తం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఊపిరిగా పీఆర్టీయూ పనిచేస్తోందన్నారు. 75 వేల మంది సభ్యులున్న సంఘం పెన్షన్ మొదలుకొని, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ వరకూ అనేక జీవోలు సాధించిందని తెలిపారు. 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ సాధన, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ళకు పెంచడం, ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌తో పాటు 5500 ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. 317 జీవో వల్ల ఎదురైన ఇబ్బందులు, స్పౌజ్, జూనియర్ ఉపాధ్యాయుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: టీటీజేఏసీ
సాక్షి, హైదరాబాద్ : దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీటీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో టీటీజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. టీచర్ పోస్టుల్లో కొత్తగా నియమితులైన వారిని వెంటనే నియమించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపడుతూ, రేషనలైజేషన్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి విద్యార్థుల సంఖ్యను పరిగణనలో తీసుకొని రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి , మాజీ ఎమ్మెల్సీ రవీందర్, టీటీజేఏసీ సెక్రటరీ జనరల్ విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సమస్యలన్నింటిపై ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డి టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఆయన ఇటీవలే పీఆర్టీయూ–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఉపాధ్యాయులకు కొత్త చిక్కు
పాపన్నపేట(మెదక్): ‘‘ఆమె పాపన్నపేట మండలంలోని మారుమూల గ్రామంలో ఒక టీచర్. ఈ నెల 21న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేగోడ్ మండలంలో విధులు నిర్వహించారు. ఎన్నికల తంతు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఒంటి గంట అయింది. తెల్లవారి 22న తిరిగి పాఠశాల విధులకు వెళ్లారు.’ ఇక్కడ కాస్త ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది లేదు. కానీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పరిస్థితి వేరు. 25న పంచాయతీ రెండో విడత ఎన్నికలు.. తెల్లవారితే పాఠశాలలో గణతంత్ర వేడుకలు. ఇక్కడ కాస్తా అటు ఇటుగా వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏడాదిలాగే గ్రామంలో నిర్ణయించిన ఎజెండా కనుగుణంగా జెండాలు ఎగురుతుంటాయి. కాస్తా ఆలస్యమైతే అందరి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే టీచర్లంతా టెన్షన్‌తో సతమతమవుతున్నారు. 25న జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇందులో కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుండగా, మిగతావి రెండు అంత కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు. ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు పడకపోయినా, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రం 90 శాతం మందికి ఎన్నికల విధులు పడినట్లు తెలుస్తోంది. 25న జరిగే ఎన్నికల కోసం 24వ తేదీనే ఉపాధ్యాయులంతా, సంబంధిత మండలాలకు వెళ్లాల్సి ఉంటుంది. 25న ఎన్నికల విధులు ముగించుకొని తమ తమ ఇళ్లకు వచ్చే సరికి, వారి వారి దూరాన్ని బట్టి రాత్రి 1 నుంచి 2 అయ్యే అవకాశం ఉంది. తెల్లవారి ఉదయం 7 నుంచి 8 లోపు గణతంత్ర వేడుకలకు సంబంధించి జెండాలు ఎగురవేయాలి. జాతీయ పండగ కావడంతో గ్రామాల్లో ప్రభాత్ భేరిలు నిర్వహిస్తూ, వరస క్రమంలో జెండాలు ఎగురవేస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల సమయానికనుగుణంగా జెండా ఎగురవేయాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట కొత్త సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. అందుకే టీచర్లు ఎన్నికలు విధులు ముగించుకొని సమయానికి గణతంత్ర వేడుకలకు హాజరవుతామా? లేదా? అని ఆందోళనకు లోనవుతున్నారు. ఒకవేళ తాము పనిచేసే పాఠశాలలు మారుమూల గ్రామాలైతే..బస్సు సౌకర్యాలు లేకపోతే వారి పరిస్థితి దయనీయం. అలాగే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం, స్వీట్లు పంపిణీ చేయడం, చివరకు సమావేశాలు నిర్వహించడానికి సమయం సరిపోక ఆగమవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్ళిన చోట ఎన్నికల నిర్వాహణలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడినా. సమస్యలు తలెత్తినా రాత్రి వరకు తేలని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఎన్నికలకు వెళ్లిన మండలం నుంచి సకాలంలో బస్సులు వేసి గమ్యం చేర్చాలని అధికారులను కోరుతున్నారు. -
బాబోయ్... భయోమెట్రిక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇప్పటికే బయోమెట్రిక్ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్స్ లేని కారణంగా చాలా చోట్ల వేలిముద్ర వేయడానికి కూడా కుదరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల హాజరుశాతం లెక్కించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలను నివారించడం కోసం పెట్టిన ఈ విధానం సాంకేతిక సమస్యల కారణంగా అభాసుపాలవుతోంది. నాలుగు నెలల క్రితమే ట్యాబ్‌లు పంపిణీ చేసినా ఇటీవలే ఈ ప్రక్రియను కొన్ని స్కూళ్లలో ప్రారంభించారు. బయోమెట్రిక్‌కు సంబంధించిన పరికరాలు పాఠశాలలకు అందించినా, వీరి వేలి ముద్రలు ఇంకా నమోదు కాలేదు. కొన్ని చోట్ల సిగ్నల్స్ లేకపోవడం, మరికొన్ని చోట్ల యంత్ర పరికరాలు మొరాయించడంతో ఈ ప్రక్రియ సక్రమంగా కొనసాగడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఐడీ నంబర్‌ను నమోదు చేసి వేలిముద్ర వేయాల్సి ఉంది. దీని వల్ల సమయం ఎక్కువగా తీసుకుంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెషిన్లు పనిచేయకపోయినా హాజ రు నమోదు కాదు. మధ్యాహ్నం భోజన పథకానికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థులకు బయోమెట్రిక్ వేయటానికి గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. వేలిముద్రలు వేయటానికి వచ్చినప్పుడు సర్వర్లు పనిచేయక విద్యార్థులు వేచి ఉండటంతో బోధన వారికి అందటం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చాలా చోట్ల మామూలు విధానం అమలవుతోంది. మరో వైపు జిల్లాలో వివిధ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం మిథ్యగా కొనసాగుతోంది. నాసిరకం బియ్యం, పప్పు దినుసులను వినియోగిస్తూ రుచీపచీ లేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. బియ్యం నాసిరకం కావడంతో అన్నం కొన్నిసార్లు ఉడకడం లేదు. పలుసార్లు పిల్లలు అన్నం పారబోస్తున్నారు. పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. వారానికి మూడుసార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉండడంతో చిన్న సైజు గుడ్లను, కుళ్లిన గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేస్తుండడంతో వాటిని చూస్తేనే విద్యార్థులు వాంతి చేసుకుంటున్నారు. వారంలో మూడు సార్లు గుడ్డు అందించడం సాధ్యం కాదని ఆ పథకం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచితేనే మూడో గుడ్డు ఇవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి నమోదైన విద్యార్థుల్లో సుమారు 56 వేల మంది దీనికి దూరంగా ఉంటున్నారు. చాలా చోట్ల విద్యార్థులు నేలపైనే మధ్యాహ్న భోజనాన్ని ఆరగిస్తున్నారు. పాఠశాలల్లో భోజనం చేసేందుకు కుర్చీలు, టేబుల్స్ ఉండటం లేదు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవీ ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ, డీఏ బకాయిలు లేకుండా తాత్సారం చేయడం దారుణం అన్నారు. జిల్లా విద్యాశాఖ పీఎస్, ఏపీజీఎల్ఐ రిమ్స్‌లలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడారు. సీపీఎస్ రద్దుకు పర్యటనలు.. ఉద్యోగులను భూతంలా పట్టి పీడిస్తున్న సీపీఎస్ రద్దుకై జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసి ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలిస్తామన్నారు. అలాగే ఈ విషయాన్ని శాసనసభలో తీర్మానం చేయాలన్న కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 19న మైదుకూరు 21న బద్వేల్ , 23న రాజంపేట, 25న కడప నియోజకవర్గంలో పర్యటించి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మజ, ఇతర నాయకులు వీరప్రసాద్, ఈశ్వరచంద్ర, వీరాంజులరెడ్డి, కాశీం, నాగిరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఓబులేసు, వేంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
సాక్షి,హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె. జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిష్కరించాల్సిన సమస్యలల్లో ప్రధానంగా రెండు విడతల డీఏ, సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, పదవ పీఆర్సీలోని అనుబంధ జీవోల విడుదల, పీఆర్సీసీలో రావాల్సిన పది నెలల బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమ, పండిట్, పీఈటీ పోస్టుల పదోన్నతి, రూ.398లతో పని చేసిన స్పెషల్ టీచర్లకి నోషనల్ ఇంక్రిమెంట్లు, మున్సిపల్ టీచర్ల అంతర్ మున్సిపాలిటీ బదిలీలు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 హెడ్ కింద జీతాలు చెల్లింపు, ఏకీకృత సర్వీసు రూల్స్ రాష్ట్రపతి ఆమోదముద్రతో ఎంఈవో, డివైఈవో, లెక్చరర్స్, డైట్ లెక్చరర్ పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ పాఠశాలపై విద్యాశాఖ పెత్తనాన్ని సహించం:ఎంటీఎఫ్ మున్సిపల్ పాఠశాలలో విద్యాశాఖ అపాయింట్మెంట్ ఇవ్వడం మున్సిపల్ చట్టానికి వ్యతిరేకమని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్(ఎంటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జే. రమేష్‌లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామన్ సర్వీసు విషయంలో కూడా మున్సిపల్ టీచర్లను చేర్చని కారణంగా విద్యాశాఖ ఇచ్చే ఉత్తర్వులు చెల్లవన్నారు. కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్‌కు మాత్రమే మున్సిపల్ పాఠశాలలోని టీచర్ల నియామకం, బదిలీ, సర్వీసు క్రమబద్దీకరణ వంటి వాటిని నిర్వహించే అధికారముందని స్పష్టం చేశారు. విద్యాశాఖ పెత్తనం చెల్లాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు.