సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కడప ఎడ్యుకేషన్:
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీవీ ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా పీఆర్‌సీ, డీఏ బకాయిలు లేకుండా తాత్సారం చేయడం దారుణం అన్నారు. జిల్లా విద్యాశాఖ పీఎస్, ఏపీజీఎల్‌ఐ రిమ్స్‌లలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడారు.
సీపీఎస్ రద్దుకు పర్యటనలు..
ఉద్యోగులను భూతంలా పట్టి పీడిస్తున్న సీపీఎస్ రద్దుకై జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసి ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలిస్తామన్నారు. అలాగే ఈ విషయాన్ని శాసనసభలో తీర్మానం చేయాలన్న కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 19న మైదుకూరు 21న బద్వేల్ , 23న రాజంపేట, 25న కడప నియోజకవర్గంలో పర్యటించి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మజ, ఇతర నాయకులు వీరప్రసాద్, ఈశ్వరచంద్ర, వీరాంజులరెడ్డి, కాశీం, నాగిరెడ్డి, వెంకటసుబ్బయ్య, ఓబులేసు, వేంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.