
ప్రసంగం చాలా బాగుంది!
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని నగరంలోని లక్షలాదిమంది విద్యార్థులు విన్నారు.
మోడీ ముచ్చట్లపై సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని నగరంలోని లక్షలాదిమంది విద్యార్థులు విన్నారు. ఈ సందర్భంగా నగరంలోని సుమారు 3 వేల పాఠశాలల విద్యార్థులు టీవీ, రేడియో, ఇంటర్‌నెట్ ద్వారా ప్రధాని ప్రసంగాన్ని ఆలకించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొన్ని స్కూళ్లలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రధాని ప్రసంగపాఠం అన్ని పాఠశాలల విద్యార్థులు వినేందుకు వీలుగా ఆయా పాఠశాలల్లో టీవీ, రేడియో, ప్రొజెక్టర్, సెట్‌అప్ బాక్స్‌లు, స్క్రీన్‌లు, జెనరేటర్ తదితర పరికరాలను యాజ మాన్యాలు సమకూర్చుకున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో మొదటి అరగంట విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి మాట్లాడారు.
కార్యక్రమం పూర్తయిన తర్వా త పాఠశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ ప్రధాని కార్యక్రమం వినూత్నంగా ఉందని.. తమకు చాలా నచ్చిందని తెలిపారు. తాను ప్రధానిని ఒక ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అవకాశం రాకపోవడంతో కొంచెం బాధగా ఉందని చాందినీచౌక్ ప్రాంతంలోని ప్రభు త్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అక్షత్ శర్మ చెప్పాడు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ సందర్భంగా పీఎంను ప్రశ్న అడిగే అవకాశం దక్కింది. వారి ప్రశ్నలకు మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమాధానమిచ్చారు.
తన ప్రసంగంలో ఆయన ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్రపై మాట్లాడారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, ప్రస్తుతం దేశం టీచర్ల కొరతను ఎదుర్కొంటోందని,ఆ పరిస్థి తి మారాలని అన్నారు. కాగా, ఢిల్లీ విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నగరంలో ఉన్న 3 వేల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు పది లక్షల మంది విద్యార్థులు ప్రధాని మోడీ ప్రసంగాన్ని విన్నారని తెలిపారు. వీరిలో చాలామంది విద్యార్థులు ప్రధానితో ముఖాముఖిని బాగుందని చెప్పగా, ప్రధాని మాట్లాడిన హిందీ అర్ధం కాక బోర్ కొట్టిందని మరికొంతమంది చెప్పడం గమనార్హం.
‘విద్యార్థులతో ముఖాముఖి అనగానే ఇది మామూ లు రాజకీయ నాయకుల ప్రసంగంలాగే ఉంటుందిలే అనుకున్నా.. అయితే ప్రధాని తన అనుభవాలను చెప్పడంతో చాలా ఆసక్తిగా విన్నా..’ అని మండీ మార్గ్‌లోని హర్‌కోర్ట్ బట్లర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న రోహన్ సింగ్ చెప్పా డు. అయితే అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థి రోహన్ అభిప్రాయంతో విభేదించాడు. ప్రధాని తన ప్రసంగంలో హిందీలోని చాలా క్లిష్టమైన పదాలు వాడారని, దాంతో వినడానికి బోర్ కొట్టిందని వ్యాఖ్యానించాడు. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ‘ప్రధాని చెప్పిన సామెతల్లో వాడిన హిందీ పిల్లలకే కాదు కొందరు ఉపాధ్యాయులకు కూడా అర్థం కాని విధంగా ఉంది.. విద్యార్థులతో మాట్లాడేటప్పుడు వారికి అర్థమయ్యే భాషే వాడుంటే బాగుండేది..’ అని అన్నాడు.
తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు..
అయితే ఈ కార్యక్రమం తర్వాత విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు ఇళ్లకు పోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం రద్దీ సమయంలో విద్యార్థులకు కావాల్సినన్ని డీటీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. నగరంలో సాధారణంగా, చాలామంది తల్లిదండ్రులు సాయంత్రం కార్యాలయాలనుంచి వస్తూ పిల్లల కోసం స్కూళ్లకు వెళ్లి తమతోపాటు తెచ్చుకుంటారు. అయితే ఈ రోజు పిల్లల కోసం చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రులు కార్యాలయ పనివేళలకంటే ముందుగానే బయటపడాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా, కార్యక్రమానికి విద్యార్థులను చేరవేసేందుకు పలు ప్రాంతాల్లో సుమారు 1,000 బస్సులను నడిపిన డీటీసీ, కార్యక్రమం పూర్తయిన తర్వాత వారిని తిరిగి గమ్యస్థానాలకు చేర్చడానికి బస్సులు నడిపేందుకు నిరాకరించింది. ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేయడం తమ వల్లకాదని చేతులెత్తేసింది. కాగా, ప్రధాని కార్యక్రమాన్ని పాఠశాల సమయంలో ఏర్పాటుచేసి ఉంటే బాగుండేదని, అప్పుడు ఇన్ని సమస్యలు ఏర్పడి ఉండేవి కావని ఒక విద్యార్థిని తండ్రి వ్యాఖ్యానించాడు. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యాశాఖ తీరును తప్పుపట్టాయి. పీఎం ప్రసంగం ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లను తప్పనిసరిగా చేసుకోవాలని, అలా చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని రెండు రోజుల కిందట ఢిల్లీ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.