ప్రతిపక్షనేతగా లోక్‌సభలో రాహుల్‌గాంధీ తన గళం విప్పారు. పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా నిలదీశారు. ప్రతిపక్షనేతగా ముందు ముందు తన శైలి ఎలా ఉండబోతుందనేదానిపై తొలి సెషన్‌లోనే సంకేతాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి.
ఈ సందర్భంగా మోదీ మొదలుకుని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. వీరికి సమాధానం చెబుతూనే అటు స్పీకర్ ఓంబిర్లాకు రాహుల్ పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు పదే పదే అంతరాయం కలిగించారు. మొత్తంగా సోమవారం(జులై1)న లోక్‌సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది.
పదేళ్లలో నేనూ బాధితుడినే..
దేశమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేసిందని రాహుల్‌గాంధీ అన్నారు. గత పదేళ్లలో బీజేపీని ఎదుర్కొన్న లక్షలాదిమందిపై దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని తనపై చాలా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు తీసేసుకున్నారు.
ఈడీ విచారణను 55 గంటల పాటు ఎదుర్కొన్నానని రాహుల్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలోనే సత్యం ఉందన్నారు. పవర్‌లో ఉండటం కంటే ఇదే గొప్పదన్నారు.
శివుడి ఫొటో చూపిస్తూ మాటల తూటాలు..
ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ సభలో ఒక సందర్భంలో శివుని ఫొటో చూపించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న తత్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు.
హింసకే అయితే కుడిచేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్ ఒప్పుకోవని స్పీకర్ ఓం బిర్లా రాహుల్‌కు చెప్పారు.
ప్రధానితో సహా బీజేపీ నేతల ఎదురుదాడి..
ఇంతలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్ పేర్కొనడం సరైనది కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని, షా వ్యాఖ్యలకు రాహుల్ స్పందించారు. తాను కేవలం బీజేపీని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ స్పష్టం చేశారు.
రైతులకు కనీసం సంతాపం తెలపలేదు..
రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదని, నీట్‌ను వాణిజ్య పరీక్షగా మార్చారని రాహుల్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో కనీసం మౌనం కూడా పాటించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు.
మీ విధానలతో ప్రజలకు ఒరిగిందేంటి..
దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధానే చెప్పిన విషయాన్ని రాహుల్ సభలో గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందని మండిపడ్డారు. అల్లర్లతో మణిపుర్ అట్టుడికినా ప్రధాని అటువైపు వెళ్లలేదు.మణిపూర్‌లో తన కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయిందన్నారు. జీఎస్టీ కారణంగా వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభమేంటని రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
స్పీకర్‌కూ రాహుల్ చురకలు..
ప్రసంగిస్తుండగా తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. తొలి రోజు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు స్పీకర్ తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలుచున్నారని రాహుల్ గుర్తుచేశారు. తన కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచానని స్పీకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment