సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం అవమానించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధాని మాట్లాడారు. ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారని.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని ధ్వజమెత్తారు. ప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందన్నారు. దళిత నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ అవమానించలేదా?. సీతారాం కేసరిని బాత్‌రూమ్‌లో బంధించలేదా?’’ అంటూ మోదీ నిలదీశారు.
‘‘ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారు. వేలాది మందిని జైళ్లకు తరలించారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుట్రలు పన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలు అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు’’ అని మోదీ గుర్తు చేశారు.
‘‘రాజ్యాంగాన్ని సవరించి పేదలకు రిజర్వేషనుల ఇచ్చాం. ఓబీసీలకు న్యాయం చేయడం కోసం మేం రాజ్యాంగాన్ని సవరించామని ప్రధాని అన్నారు. ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ప్రజలను విభజించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాం. అందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుంది. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.
‘‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడా. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుంది. రాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారు. వివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత. భారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించింది. ఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటింది. భారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పది. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు. ప్రజా స్వామ్య దేశాలు భారత్‌ను విశ్వసిస్తున్నాయి.’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment