ఏడవ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు గాఢనిద్రకు గల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తనకున్న ఒక అలవాటును వివరిస్తూ, దాని కారణంగానే తాను ప్రతిరోజూ సులభంగా గాఢ నిద్రలోకి జారుకుంటానని తెలిపారు.
తాను గాఢ నిద్రలోకి వెళ్లడానికి కేవలం 30 సెకన్లు మాత్రమే సరిపోతుందని ప్రధాని మోదీ తెలిపారు. మంచంపై పడుకున్నాక కేవలం 30 సెకన్లలో గాఢ నిద్రలోకి జారుకుంటానని, ఇది సంవత్సరంలో 365 రోజులూ జరుగుతుందని మోదీ పేర్కొన్నారు.
‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను పనిచేసే సమయంలోనే పనిచేస్తానని, నిద్రపోయే సమయంలో మాత్రమే నిద్రపోతానని అన్నారు. మేల్కొన్నప్పుడు పూర్తి మెలకువలో ఉంటానని, నిద్రించేటప్పుడు పూర్తి నిద్రలో ఉంటానని పేర్కొన్నారు. ఇదే ప్రధాని మొదటి గాఢ నిద్రా రహస్యం.
ఇక ప్రధాని మోదీకి అలవాటైన రెండో గాఢ నిద్రా రహస్యం సమతుల ఆహారం. వయసును బట్టి సమతులాహారం తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా గాఢ నిద్రకు సహాయ పడుతుందన్నారు.
గాఢ నిద్రకు ప్రధాని మోదీ చెప్పిన మూడవ కీలక సూత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కుస్తీ తరహాలోని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని, తేలికపాటి వ్యాయామాలు కూడా గాఢ నిద్రకు సహాయపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాఢ నిద్రతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు.
విద్యార్థుల విజయానికి ప్రధాని సూచనలు
ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోండి.
జీవితంలో పోటీతత్వం ఉండటం చాలా ముఖ్యం.
తల్లిదండ్రులను తక్కువ చేసి చూడకూడదు.
మంచి విద్యార్థులతో స్నేహం చేయండి. వారిపై అసూయ పెంచుకోవద్దు.
ఉపాధ్యాయుని పని కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. జీవితాలను మెరుగుపరచడం.
పరీక్షకు ముందు విద్యార్థులు తగిన శ్రద్ధ వహించాలి. అప్పుడు పరీక్ష సులువవుతుంది.
రాసే అభ్యాసం కూడా విద్యార్థులకు చాలా ముఖ్యం.
మొబైల్‌కు ఛార్జింగ్ ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యానికి క్రీడలు కూడా అంతే ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment