తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
ఒక్కరు కాదు.. ఇద్దరుకాదు.. వందల మంది ఉపాధ్యాయులు ఒక్క చోటికి చేరారు. వారికి తోడుగా వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. అందరూ కలిసి ‘సోలో ఆంధ్రప్రదేశ్’ అని నినదించారు. గురువులకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఉపాధ్యాయులు నివాళులర్పిస్తూ నల్లని జెండాలతో స్వార్థ రాజకీయ నాయకుల వైఖరిని ఎండగడుతూ రిలే నిరసన దీక్షకు కూర్చున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తాడేపల్లిగూడెంలో గురువారం ‘గురువుల మహా దీక్ష’ ద్వారా నిరసన తెలిపారు. స్థానిక కేఎన్ రోడ్డులోని తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు వేసిన 30 షామియానాలలో 1600 మంది ఉపాధ్యాయులు దీక్షలలో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో వెయ్యి మంది ఉపాధ్యాయులు, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు చెందిన 600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్షలలో పాల్గొని నిరసన తెలిపారు.
నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా ఉన్న సర్వేపల్లి ఫ్లెక్సీని దీక్షా శిబిరాల వద్ద ఉంచి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం దీక్షలలో పాల్గొన్నారు. గంధం జోన్స్‌కు చెందిన విద్యార్థులు 20 అడుగుల నల్లని జెండాతో నిరసన ప్రదర్శన, షిర్డిసాయి విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఎవరి అండదండలు లేకుండా మహోద్యమంగా జరుగుతున్న ఉద్యమం సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అని అన్నారు. విభజన నిర్ణయం ఆగిన తర్వాత ప్రజలు వివిధ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఐటీ ఒక చోట, సినీ పరిశ్రమ ఒక చోట అన్నట్లుగా అభివృద్ధి చెందాలన్నారు. మరో స్వాతంత్య్ర సంగ్రామంలా ఉద్యమం సాగుతుందని జేఏసీ గౌరవాధ్యక్షుడు బుద్దాల రామారావు అన్నారు. దీక్షాపరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట గోపి, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు, యర్రా నవీన్, జేఏసీ నాయకులు మాకా శ్రీనివాసరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, ఫైలు శ్రీనివాసరావు, అపుస్మా నాయకులు గంధ ం సుధాకర్, గురువు హరిబాబు, అత్తింటి సుబ్బరాజు, జంగా బాలాజీ, ఎంఎల్‌ఎస్‌ఎన్ రెడ్డి, గూడెం పరిసర ప్రాంత విద్యాసంస్థల యజమానులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు టీవీ రామకృష్ణ పాల్గొన్నారు.
గురువుల మహాదీక్ష
Published Fri, Sep 6 2013 4:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement