‘డిటెన్షన్’ సమాజానికి చేటు!
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
డిటెన్షన్ పద్ధతి ఉపాధ్యాయుడికీ, విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయవద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను ఉపసంహరించుకోండి.
పుండు ఒకచోట ఉంటే మందు ఇంకోచోట పెట్టడం మన దేశంలో పరిపాటిగా మారింది. ఇది అనాదిగా మన విద్యా వ్యవస్థకు పట్టిన దౌర్భా గ్యం కూడా. సీబీఎస్‌ఈ అధికార యంత్రాంగం డిటెన్షన్ పద్ధతిని మర లా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రాల అభిప్రాయాలను కోరారు. డిటెన్షన్ ప్రవేశపెట్టి 10 ఏళ్ల కంటే ఎక్కువే అయింది. అప్పుడు విద్యావేత్తలు హెచ్చరికలు చేశారు. కేవలం డిటెన్షన్ పద్ధతే కాకుండా విద్యార్థి ప్రమాణాలు సాధించాడా? లేదా? కనుక్కొ నేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నాడు చెప్పడం జరి గింది. ఇవాళ విద్యార్థుల్లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే నెపంతో సమస్యను తిరగదోడుతున్నారు. డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతుల విద్యార్థుల్ని చదువు నుంచే కాకుండా పౌర సమాజం నుంచే దూరం చేసే ప్రయత్నం జరుగు తోంది. చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాను చెప్పిన చదువు పిల్లలకు అర్థమవుతోందో, లేదో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. అందువల్ల ఈనాడు ఉపాధ్యాయుడు, విద్యార్థి వీరిద్దరినీ ఎవాల్యుయేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థికి అర్థం కాకపోతే ఉపాధ్యాయుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. విద్యార్థికి అర్థమవడం వ్యక్తిగత విషయం. బోధన మాత్రం సామాజిక ప్రక్రియ. కొన్ని సార్లు సామూహిక ప్రక్రియ వ్యక్తికి ఉపయోగపడకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాకపోవడానికి కారణం తెలుసుకొని, అది బోధనాపరమైన కారణమా? వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. బోధనాపరమైన కారణాలు ఉంటే ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి.
తరగతిలో చెప్పిన అంశం విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పే దిశగా ఉపాధ్యాయుడు ఆలోచిస్తే అతనికి కూడా కొన్ని కొత్త బోధనా పద్ధతులు తెలుస్తాయి. అది లాభమే. తప్పులు చేసిన ప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అర్థం కాని పిల్లవాడే కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరించవచ్చు. విద్యార్థి వ్యక్తిగత కార ణాలు ఏమైనా ఉంటే అతడిని ప్రేమించేందుకు పాలకవర్గం నుంచి ప్రయత్నం జరగాలి. మన సర్కారీ బడులకు వస్తున్న వారిలో చాలా మంది విద్యార్థులు ఫస్ట్ లెర్నర్స్ కాబట్టి వ్యక్తి గతమైన కారణాలు బలమైనవి ఉండవచ్చు. ఇతర దేశాల్లో ఆ కారణాలను కనుక్కొనేందుకు యంత్రాంగాన్ని సృష్టించుకున్నా రు. పాఠశాలల్లో సరైన బోధనా పద్ధతులు, మౌలిక వసతులు కల్పించకుండా, వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైతం చొరవ చూపకుండా కేవలం పిల్లల్ని డిటైన్ చేస్తామనడం సరి కాదు.
దేశంలో దారిద్య్రం తాండవిస్తోందని దరిద్రుల్ని చంపుకుం టామా? అలాగే పిల్లవాడికి చదువు రాలేదని చదువు నుంచి దూరం చేస్తామా? చదువంటే కేవలం పుస్తక పరిజ్ఞానమే కాదు. కొందరికి అకడమిక్‌గా రాకపోవచ్చు. అతను వేరే రంగంలో ప్రతిభాశీలి కావచ్చు. గొప్ప క్రీడాకారుడు కావచ్చు. సంగీత విద్వాంసుడు కావచ్చు. లేకపోతే ఏ చేతివృత్తిలోనో రాణించ వచ్చు. ఈ ప్రయత్నాలేవీ చేయకుండా బడి నుంచి పిల్లల్ని తొల గిస్తామనడం మన వైఫల్యాలను ప్రపంచానికి ఎత్తి చూపడమే అవుతుంది తప్ప మరొకటి కాదు.
గత పదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. చివరకు ఏ తరగతికి ఏ విద్యా ప్రమాణాలు కావాలో మనం సూచించ లేదు. పదో తరగతికి వచ్చిన విద్యార్థి తీరుతెన్నులను చూస్తు న్నాం. ఇతర దేశాలలో అయితే ఏ సంవత్సరానికి ఆ సంవ త్సరం విద్యార్థిని సమీక్షిస్తారు. ప్రతి తరగతికి కొన్ని ప్రమాణాలు ఏర్పా టు చేసుకున్నారు. ఆ వారంలో అవి రాకపోతే పాఠశాల తరగ తుల అనంతరం అదనపు సమయాన్ని కేటాయించి దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే విధంగా సెలవుల్లోనూ విద్యా ర్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఇవేమీ లేకుండా కనీసం విద్యార్థి ప్రమాణాల స్థాయిని పెంచేందుకు ప్రయత్నాలు చేయకుండా ఏకంగా డిటెన్షన్ విధానంతోనే విద్యార్థిని శాశ్వ తంగా బడి నుంచి పంపిస్తామనడం సమాజానికి అనర్థం. విద్యా ర్థిని ఒక్కసారి బడి నుంచి తొలగిస్తే అతడు తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. అతడు తర్వాతి జీవితంలో సృష్టించే సంపదను దేశం కోల్పోతుంది.
ఈ విధంగా లెక్కవేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు వెళ్లే ప్రమాదం ఉంది. దీనితో సహా తరగతి గది ప్రమాణాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారతా యి. అర్థంకాని పిల్లవాడు కొత్త రీసెర్చ్‌కు కారణమవుతాడు. మనం ఒక మంచి పుస్తకం నుంచి మరో పుస్తకానికి విషయాన్ని మార్చడమే చదువు అనే భ్రమలలోనే ఉన్నాం. చదువు అంటే లెర్నింగ్. దానిపై పరిశోధనలు నిరంతరం జరగాలి. కాబట్టి డిటెన్షన్ పద్ధతి అటు ఉపాధ్యాయుడికీ, ఇటు విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయ వద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను తక్షణమే ఉపసంహరించుకోండి. పేదపిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఇతర దేశాలలో చేపట్టిన అన్ని ప్రయత్నాల మీద ఇప్పటికైనా పరిశోధన చేయండి. ఇప్పటి వరకు చదువులో ఆసక్తి ప్రదర్శించిన వారి పట్లే ఎక్కువ దృష్టి పెట్టాం. ఇకనైనా వెనుకబడిన కుటుంబాల వారి పిల్లలకు నాణ్య మైన విద్యను అందించే దిశగా దృష్టి సారించండి. బడుగు, బల హీనవర్గాల పిల్లలు బడికి ఎందుకు రాలేకపోతున్నారో తెలుసు కోండి. వ్యక్తిగత కారణాలను సైతం అధ్యయనం చేసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి. నైపుణ్యాలు కలిగిన మానవ సంపదను పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయండి. విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేయండి.
చుక్కా రామయ్య
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)