భావి భారత విధాతలు | Funday cover story | Sakshi
Sakshi News home page

భావి భారత విధాతలు

Published Sun, Sep 2 2018 12:31 AM | Last Updated on Sun, Sep 2 2018 12:31 AM

Funday cover story - Sakshi

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగానే కాకుండా స్వపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం!ఈ సందర్భంగా విజయవాడలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమొరియల్‌ స్కూల్‌లో పిల్లల్ని ‘సాక్షి’ కలిసింది! ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లలేక ఈ బంగారాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు! పేదరికం... ఒంటిమీదున్న బట్ట, కడుపులోని ఆకలితో కనబడుతుందేమో కానీ,ఈ పిల్లల కళ్లలో, మాటల్లో మాత్రం మహోన్నతమైన సంపద కనబడుతుంది. దేశానికి, సమాజానికి దిశను ఇవ్వగల నాయకుల్లా కనబడతారు. ఈ పిల్లల మాటలు విన్నాక ఇక వీసమెత్తు సంకోచం కూడా లేదు.. మన దేశ భవిష్యత్‌ నిజంగా బంగారమే! జైహింద్‌!! 

‘‘అధ్యక్ష్యా..! మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం హామీలు చేశామో.. అన్నీ నెరవేర్చాం అధ్యక్ష్యా! రైతు రుణాలు మాఫీ చేశాం. ఉద్యోగాలు ఇచ్చాం.. అనుకున్న రీతిలో రాజధాని నిర్మాణం పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష్యా..! రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల క్షేమమూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, విద్య, ఉపాధి మీదే దృష్టి పెట్టాం. హోం శాఖ కూడా శాంతి భద్రతలను అద్భుతంగా పరిరక్షిస్తోంది. అన్ని శాఖలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి’’ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుకుపోతుండగానే..ప్రతిపక్షనేత లేచి.. ‘‘ఏం అభివృద్ధి అధ్యక్ష్యా..! ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది అసలు నిజాలేంటో? రుణాలు మాఫీ కాక.. భారం పెరిగి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష్యా! ఇక.. భూములు ఇచ్చిన రైతులకు ఇంకో ఉపాధి అంటున్నారు.. అసలు సారవంతమైన ఆ నేలలను రాజధాని నిర్మాణం కోసమని కాంక్రీట్‌మయం చేస్తారా అధ్యక్ష్యా? ఎంత తప్పు! పర్యావరణానికి ఎంత హాని! అభివృద్ధి అంటే ఇదా అధ్యక్ష్యా?’’ అంటూ ముఖ్యమంత్రిని నిలదీశాడు. ‘‘అధ్యక్ష్యా..! ప్రతిపక్షనేతకు లెక్కలతో మా అభివృద్ధిని వివరిస్తాం’’ అంటూ ఆర్థిక మంత్రి ఇంకేదో చెప్పబోతుండగానే.. ప్రతిపక్షంలోని ఓ ఎమ్మేల్యే లేచి.. ‘‘లెక్కలు తెలియంది ఎవరికి అధ్యక్ష్యా! అన్నీ తెలుసు. అన్నీ చూస్తున్నాం..’’ అంటూ ఆర్థికమంత్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. 

‘‘ఆడవాళ్ల భద్రత కోసం ఇది చేశాం.. వాళ్ల రక్షణ కోసం అది చేశాం.. అంటూ ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రిగణమంతా ఊదరగొడ్తున్నారు అధ్యక్ష్యా! అంత చేస్తుంటే ఇన్ని నేరాలు ఎందుకు నమోదవుతున్నాయి అధ్యక్ష్యా..?  మొన్నటికి మొన్న మా ఇంటి సందులోనే ఓ అమ్మాయి మీద దాడి జరిగింది. అంతకుముందు రాజధానిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. ఇవి మన ముందు జరిగినవే.. మన వెనక, మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో? అధ్యక్ష్యా..! అధికార పార్టీ వాళ్లు చెప్తున్నదానికి.. బయట జరుగుతున్న దానికి ఏమన్నా పోలిక ఉందా అధ్యక్ష్యా?’’ అంటూ ఇంకో ఎమ్మెల్యే ప్రశ్నించాడు.  ‘‘అవును అధ్యక్ష్యా..! ఒక్క భద్రత విషయమే కాదు ... మహిళల ఆరోగ్య విషయాన్నీ అటకెక్కించారు అధికార గణం వారు. రక్తహీనతతో బాధపడ్తున్న స్త్రీల విషయంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అమరావతి నిర్మాణంలో చాలా బిజీగా ఉన్న మన ప్రభుత్వాన్ని  కాస్త వీలు చూసుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైపు ఒక్క అడుగు వేయమనండి అధ్యక్ష్యా..! వాటి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది’’ అని ఇంకో ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును వేలెత్తి చూపుతున్నంతలోనే మరో ఎమ్మెల్యే లేచి ‘‘అధ్యక్ష్యా..! మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా ఏం అభివృద్ధి సాధించాం అధ్యక్ష్యా? ఫ్లై ఓవర్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లా అధ్యక్ష్యా? 70 ఏళ్లకు పూర్వం బాల్య వివాహాల రద్దు కోసం పోట్లాడాం. అయినా రద్దు చేయగలిగామా? లేదు. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష్యా! ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. పదహారేళ్లు నిండకుండానే పిల్లల్ని కని రక్తహీనతకు లోనవుతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు.దీనికి సంబంధించిన లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష్యా..! మేమూ ఇస్తాం’’ అని ఆయన పూర్తిచేసే లోపే మహిళా ఎమ్మెల్యే నిలబడి.. ‘‘అధ్యక్ష్యా..! బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాం అంటూ అధికార పార్టీ గట్టిగా చెప్తోంది. మన అసెంబ్లీ ముందున్న హోటల్‌కి వెళ్లి చూడండి.. ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారో? దీనికి మించిన ఎగ్జాంపుల్‌ ఏముంటుంది అధ్యక్ష్యా? ఎంతో మంది పిల్లలు బడి లేక పాచి పనులు చేసుకుంటూ బాల్యాన్ని ఈడుస్తున్నారు అధ్యక్ష్యా.. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. 

అధికార పక్షం  తలవంచింది!
గొడవలు, అరుచుకోవడాలు.. తిట్టుకోవడాలు లేకుండా ఇంత  పద్ధతిగా.. హుందాగా ఎలా మారిందబ్బా మన అసెంబ్లీ అని ఆశ్చర్యం వేస్తోంది కదా! ఆవులించినంతలోనే ఆశ్చర్యం ఆవిరయ్యే మాట కూడా చదవండి.. అది నిజమైన అసెంబ్లీ కాదు.. మాక్‌ అసెంబ్లీ!విజయవాడ, సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్‌ హై స్కూల్‌.. తొమ్మిదో తరగతి ‘బి’ సెక్షన్‌ పిల్లలు నిర్వహించిన మోడల్‌ అసెంబ్లీ. అసలు ఇది ఎక్కడ.. ఎలా మొదలైందీ అంటే...సెప్టెంబర్‌ 5.. తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల దాకా సాగింది. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా.. స్వపరిపాలనా దినోత్సవంగా జరుపుతోంది ప్రభుత్వం. ఆ సందర్భంగా ఈ స్కూల్లోని పిల్లలను కలిసింది ‘సాక్షి ఫన్‌డే’. ‘‘మీరే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, ఆర్థిక మంత్రి, స్త్రీశిశు సంక్షేమ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్సైజ్‌ శాఖ, ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌... ఇలా పాలనా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే  .. మీరేం చేస్తారు?’’ అని ప్రశ్నించాం క్లాస్‌ అందరినీ.  నేటి పిల్లల్లో సామాజిక స్పృహ ఏదీ అని పెదవి విరిచే వాళ్లకు దీటైన సమాధానాలు ఇచ్చారు ఆ పిల్లలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా..‘‘నేను ప్రైమ్‌మినిస్టర్‌ అయితే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా. విడిపోతే ఏం బాగాలేదు. అందరం కలిసే ఉండాలి. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఆగిపోయిందనే కదా.. విడిపోయింది. ఇప్పుడు కలిసిపోయి పాత తప్పులు మళ్లీ జరగకుండా చూస్తా.. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. అంతా సమానంగా డెవలప్‌ అయ్యేలా చూస్తా’’ అన్నాడు యు. శశి కుమార్‌ అనే విద్యార్థి. 

రైతులకే ప్రత్యేకతలు
 అబ్దుల్‌ రహీమ్‌ అనే అబ్బాయి ‘‘నేను ప్రైమ్‌మినిస్టర్‌ అయితే రైతులందరూ క్షేమంగా.. హ్యాపీగా ఉండేలా చూస్తా. మనది వ్యవసాయ ఆధారిత దేశం. రైతలు లేనిదే మనం లేము. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తా. వాళ్లకే  అన్ని ప్రత్యేకతలిస్తా’’అంటూ చెప్పాడు. షోయబ్‌ అఖ్తర్‌  అనే ఇంకో స్టూడెంట్‌  ‘‘నేను ముఖ్యమంత్రి అయితే కూడా రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తా. వ్యవసాయరంగం ఆధారంగానే అభివృద్ధికి ప్లాన్‌చేస్తా..’’ అని అంటున్న అతని  వాగ్ధాటిని అడ్డుకోవాల్సి వచ్చింది ‘‘అంటే ఎలా?’’ అనే ప్రశ్నతో. ‘‘వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టాలి. ఎగ్జాంపుల్‌ పత్తి పండిస్తే.. కాటన్‌ పరిశ్రమ బాగా అభివృద్ధి అయ్యేలా చూస్తా. లోకల్‌గా ఉన్న వాళ్లకు ఎక్కువ జాబ్స్‌ ఇప్పిస్తా.  జ్యూట్, ఆయిల్‌ పరిశ్రమలు వంటివాటిని బాగా డెవలప్‌ చేస్తా.  పర్యావరణాన్నీ కాపాడేలా చర్యలు తీసుకుంటా. అడవులు నరికేయకుండా చట్టాలను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తా. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొక్కలు నాటిస్తా’’ అని షోయబ్‌  చెప్పబోతుంటే నౌషీన్‌ అనే అమ్మాయి ‘‘అవును. నేను కూడా మినిస్టర్‌ అయితే బాగా మొక్కలు నాటిస్తా. వర్షాలు పడ్డానికి ఎలాంటి వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణం నెలకొల్పేలా చూస్తా. సైంటిస్ట్‌లతో ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు చేయిస్తా.. ఇప్పుడు కేరళకు వచ్చినటువంటి వరద ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఎన్విరాన్‌మెంట్‌ సైంటిస్ట్‌ల సలహాలు తప్పకుండా వింటా’’ అని చెప్పుకొచ్చింది. 

క్యాస్ట్‌ లేకుండా చేస్తా..
‘‘నేను ప్రధానమంత్రి అయితే.. దేశంలో కులం పోయేలా చేస్తా. చదువులో, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూస్తా.  కులం వల్లనే మనకు ఇన్ని గొడవలు, ఇబ్బందులు. అవన్నీ పోవాలంటే కులం పోవాలి. డబ్బున్న వాళ్లు, లేని వాళ్లు సమానం కావాలి’’ అని చెప్పాడు జేవీఎస్‌  శ్రీకాంత్‌. అందరికీ చదువు.. ఆకతాయిలను పనిలో పెడతా‘‘నేను విమెన్‌ అండ్‌ చైల్డ్‌వెల్‌ఫేర్‌ మినిస్టర్‌ అవుతా. ఆడవాళ్ల సంక్షేమం కోసం పనిచేస్తా. ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే దేశం ఫ్యూచర్‌ బాగుంటుంది’’ అంది ఆవేశంగా వాణిశ్రీ అనే విద్యార్థిని. ఫణిభూషణ్‌ అనే అబ్బాయి ‘‘నేను హోం మినిస్టర్‌ అయితే.. ఆడపిల్లల మీద దాడులు జరగకుండా ఆపుతా. పనీపాట లేకుండా ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చూస్తా.  ఖాళీగా.. రోడ్ల మీద తిరుగుతూ.. అమ్మాయిలను ఏడిపిస్తూ ఎవరైనా కనపడితే ముందు వాళ్లను జైల్లో పెట్టకుండా పనిలో పెడతా. అయితే వాళ్లకు ఇన్ని గంటలే పని అని కాకుండా..   పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేయిస్తా. అట్లా వాళ్లకు పనిష్మెంట్‌ ఇస్తా. దాంతో వాళ్ల కాన్సన్‌ట్రేషన్‌ పనిమీదకే మళ్లుతుంది’’ అని చెప్పాడు. 

ట్రాఫిక్‌ కంట్రోల్‌చేస్తా.. బాల్య వివాహాలు ఆపుతా
‘‘నేను చీఫ్‌ మినిస్టర్‌.. కనీసం మినిస్టర్‌ అయినా సరే.. ముందు మన రోడ్ల మీద ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తా. ప్రైవేట్‌ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్‌ వెహికిల్సే  నడిచేలా చూస్తా. స్టూడెంట్స్‌తో ట్రాఫిక్‌ రూల్స్‌ మీద అందరికీ అవేర్‌నెస్‌ క్లాసెస్‌ ఇప్పిస్తా. అలాగే బాల్య వివాహాలు రద్దు చేస్తా. మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్‌కి పదమూడేళ్లకే పెళ్లి చేశారు. ఒక యేడాది అయ్యేసరికి  ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ పిల్ల ఇప్పుడు వాళ్లమ్మవాళ్లింటికి వచ్చేసింది. చదువు లేదు. ఏదో గుళ్లో పనిచేసుకుంటోంది. ఆ అమ్మాయి లైఫ్‌ అలా పాడైపోయింది. అది చూసైనా ఆమె పేరెంట్స్‌ మారాలి కదా! మారకపోగా.. ఇప్పుడు వాళ్ల చెల్లికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ల చెల్లి వయసు ఇప్పుడు పన్నెండేళ్లు. నేను, నా ఫ్రెండ్‌ ఇద్దరం కలిసి వాళ్ల చెల్లికి చెప్పాం.. ‘‘పెళ్లిచేసుకోకు.. చదువుకో’’ అని. కాని వాళ్ల పేరెంట్స్‌ వినరని పెళ్లికి ఒప్పేసుకుంటోంది. అలాగే నా ఫ్రెండ్‌కీ చెప్పా.. ‘‘ఇప్పుడన్నా చదువుకో’’ అని. పని చేయకపోతే ఇంట్లో తిడతారు అని భయపడుతోంది. మా ఇంటి దగ్గరే నేను ఇలాంటి పరిస్థితులను చూస్తున్నానంటే దేశం మొత్తం మీద ఇంకా ఎన్ని ఉండొచ్చు? అందుకే ముందు ఆడపిల్లలందరికీ చదువు చెప్పిస్తా. బాల్యవివాహాలు రద్దు చేయిస్తా. దీనికోసం ఉన్న చట్టాలు స్ట్రిక్ట్‌గా అమలు అయ్యేలా చేస్తా’’ అని చెప్పింది వాణిశ్రీ. 

లంచం లేకుండా చేస్తా.. పేదలకు ఇల్లు కట్టిస్తా
‘‘నేను ఫైనాన్స్‌ మినిస్టర్‌ అవుతా. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా. మన దేశంలో ఇల్లు లేనివాళ్లు ఉండకూడదు. అందరికీ పని కూడా ఇప్పిస్తా. విజిలెన్స్‌ వాళ్లతో చెప్పి ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో చెక్‌చేయిస్తా. అవినీతి శాఖ వాళ్లు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండేలా చేస్తా. లంచం అనేదే లేకుండా చేస్తా. లంచం లేకుండా పోతే గవర్నమెంట్‌ పనులన్నీ కరెక్ట్‌గా టైమ్‌ వేస్ట్‌ కాకుండా జరుగుతాయి’’ హుషారుగా చెప్పాడు  మదుసూధన్‌. ‘‘ఫైనాన్స్‌ మినిస్టర్‌కి ఇవన్నీ అధికారాలు ఉండవు తెల్సా? బడ్జెట్‌ ఒక్కటే నీ పని’’దుర్గా సత్యనారాయణ అనే అబ్బాయి అంటుంటే ‘‘తెలుసు.. కానీ అన్ని శాఖలతో  ఫ్రెండ్‌షిప్‌ చేసి  .. వాళ్ల హెల్ప్‌ తీసుకుంటా. వాళ్లకు నేను హెల్ప్‌ చేస్తా’’జవాబిచ్చాడు మధుసూదన్‌.

లిక్కర్, సిగరేట్‌ బ్యాన్‌ చేస్తా.. 
‘‘నేను ఎక్సైజ్‌  మినిస్టర్‌ అయి లిక్కర్, సిగరేట్, డ్రగ్స్‌ అన్నిటినీ బ్యాన్‌ చేస్తా. మా ఇంటి దగ్గర ఒక అంకుల్‌ 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఏ పనీ చేయడు. ఆంటీ, వాళ్ల పిల్లలు... నా కన్నా చిన్నవాళ్లు  వాళ్లు.. పని చేసి డబ్బులు తెస్తారు. గొడవపడి ఆ డబ్బులు లాక్కెళ్లి మళ్లీ తాగుతుంటాడు ఆ అంకుల్‌. అందుకే వాటన్నిటినీ బ్యాన్‌ చేస్తా’’ అని కృపాప్రసాద్‌ అంటున్న మాటలకు పొడిగింపుగా లక్ష్మీపావని మాట్లాడుతూ ‘‘అవును.. వాటిని బ్యాన్‌ చేయాలి. గుట్కాను కూడా బ్యాన్‌చేయాలి. ఆరోగ్యానికి హానికరం అని వాటిమీదే ప్రింట్‌ చేసి మళ్లీ వాటినే అమ్ముతారెందుకు? అంటే ప్రజల హెల్త్‌ పాడైపోవాలనా? ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే పాలించే ప్రభుత్వం మనది అని పుస్తకాల్లో చెప్తారు. అదే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పాడయ్యే వస్తువులను అమ్ముతోంది ఎందుకు? బ్యాన్‌ చేయాలి కదా?’’ అంది. ‘‘వాటి మీద వచ్చే ఇన్‌కమ్‌తో వెల్‌ఫేర్‌ ప్లాన్స్‌ చేస్తుందట గవర్నమెంట్‌. అందుకే వాటిని బ్యాన్‌ చేయరట. కృపాప్రసాద్‌ నువ్వు ప్రైమ్‌మినిస్టర్‌ అయినా వాటిని బ్యాన్‌ చేయడానికి లేదు’’ చెప్పింది మహాలక్ష్మి. ‘‘ఎందుకు? అప్పుడు టాక్సెస్‌ బాగా పెంచాలి’’ సలహా ఇచ్చింది గ్రేస్‌ మేరీ. ‘‘ధరలు పెరిగితే మామూలు వాళ్లకు  కూడా ప్రాబ్లమ్స్‌  తెల్సా?’’ మళ్లీ మహాలక్ష్మి. ‘‘అయితే నేను బ్లాక్‌ మనీ అంతా బయటకు తీస్తా. దాంతో  పేదవాళ్లకు చాలా చేయొచ్చు కదా  లిక్కర్, సిగరేట్లు లేకుండానే’’ వెలుగుతున్న మొహంతో కృపాప్రసాద్‌. 

అమ్మాయిలు గోల్డ్‌మెడల్స్‌ కొట్టేలా..
‘‘నేను కబడ్డీ ప్లేయర్‌ని. నేషనల్స్‌ ఆడాను. నేను చీఫ్‌ మినిస్టర్‌ అయితే.. అమ్మాయిలు స్పోర్ట్స్‌ బాగా ఆడేలా చూస్తా. వాళ్లు గోల్డ్‌ మెడల్స్‌ కొట్టేలా చేస్తా. పేద ఆడపిల్లలకు ఫ్రీగా కోచింగ్‌ ఇప్పిస్తా. కేవలం అమ్మాయిలకే కాదు.. పేదవాళ్లందరూ ఆటల్లో ఫస్ట్‌ ఉండేలా చేస్తా. స్పోర్ట్స్‌ కోటాలో వాళ్లందరికీ జాబ్స్‌ కూడా ఇప్పిస్తా’’ అంది లహరి. 

స్మార్ట్‌ ఫోన్స్‌ బ్యాన్‌ చేస్తా.. 
‘‘నేను వెల్‌ఫేర్‌ మినిస్టర్‌ అయితే పిల్లలు చూడని తల్లిదండ్రులందరి కోసం ఓల్డేజ్‌ హోమ్స్‌ కట్టిస్తా. ముందు వాళ్లను అందులో ఉంచాక.. వాళ్ల పిల్లను పిలిచి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తా. ఆర్ఫనేజెస్‌ కూడా కట్టిస్తా’’ అని చెప్పాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను ఏ మినిస్టర్‌ అయినా ఫస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ బ్యాన్‌ చేయిస్తా. వాటిల్లో వచ్చే బ్లూవేల్‌ వంటి పిచ్చి గేమ్స్‌ వల్ల వాటికి అడిక్ట్‌ అయిపోయి  పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలంతా చదువుకునేలా చూస్తా. జాబ్స్‌లో వాళ్లకు రిజర్వేషన్స్‌ ఇప్పిస్తా’’  చెప్పింది ఆర్తీ. పావని అనే అమ్మాయి కంటిన్యూ చేస్తూ ‘‘అవును నేను కూడా చీఫ్‌ మినిస్టర్‌ అయినా,  న్యాయశాఖ మంత్రి అయినా ఆడవాళ్లకు, పేదలకు న్యాయం జరిగేలా చూస్తా. అమ్మాయిలందరూ చదువుకునేలా చేస్తా’’ అని చెప్పింది. 

ప్రాజెక్ట్‌లు.. పక్కా ఇళ్లు కట్టిస్తా.. 
‘‘నేను ఇరిగేషన్‌ మినిస్టర్‌ అయితే.. ముందు ప్రాజెక్ట్‌లు కట్టిస్తా. వాటర్‌ వేస్ట్‌ కాకుండా చూస్తా. ఒకవేళ చీఫ్‌ మినిస్టర్‌ అయితే.. మన దగ్గర ఇళ్లు లేనివాళ్లందరికీ ఇళ్లు కట్టిస్తా. అసలు ఇల్లు లేనివాళ్లు లేకుండా చూస్తా. ఇంకా ఆడపిల్లలు సేఫ్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతి ఒక్కరు చదువుకునేలా చేస్తా. అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్‌గా ఉండేలా చట్టాలు తెస్తాను. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా  కౌన్సెలింగ్స్‌ ఇప్పిస్తా. నాకు ఒక అక్కయ్య ఉంది. మా పేరెంట్స్‌కు కూడా చెప్తుంటా..‘‘ నేను, అక్క ఈక్వల్‌’’ అని. ఇంట్లో పనులకు మా అక్కతో పాటు నేనూ అమ్మకు హెల్ప్‌ చేస్తుంటా. అట్లాగే దేశంలో అబ్బాయిలందరూ  ఇలాగే  ఉండేలా చూస్తా’’ అంటాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను కూడా మా ఇంట్లో మా అమ్మకు, చెల్లికి హెల్ప్‌ చేస్తా. కూరలు తరుగుతాను, గిన్నెలు కడుగుతాను.. అన్ని పనులు చేస్తా’’చెప్పాడు అనిల్‌.‘‘నేను అగ్రికల్చర్‌ మినిస్టర్‌ అవుతా. రైతులందరికీ భూమి ఇస్తా. రుణమాఫీలు చేస్తా. పంటలు పండే నేలను పంటలకే ఉపయోగించేలా చేస్తా. అక్కడ ఫ్యాక్టరీలు.. బిల్డింగ్స్‌ కట్టకుండా బ్యాన్‌ చేస్తా’’ కంటిన్యూ చేశాడు అనిల్‌. 

మనకు మనమే ఆహార కొరత సృష్టించుకున్నట్టు.. 
‘‘అనిల్‌ చెప్పినట్టు.. పంటలు పండే నేలను పంటలకే ఉంచాలి. దాంట్లో బిల్డింగ్స్‌ కట్టడం వల్ల ఆ నేలలో పండే పంటనంతా నష్టపోయినట్టే కదా మనం? అలా ఆహార కొరతను మనకు మనమే సృష్టించుకుంటున్నట్టు కదా! దీనివల్ల రైతులకే కాదు మనకూ నష్టమే. అందుకే పంటలు పండే నేలను పంటలకే కేటాయించేలా చూడాలి. నేను చీఫ్‌ మినిస్టర్‌ అయితే.. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలనూ డెవలప్‌చేస్తా. ఏ ఊరికి ఏ ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకత ఇంకా పెరిగేలా చూస్తా. నీటి వసతి అంతగాలేని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టిస్తా. దీనివల్ల అక్కడి ప్రాంతంలోని వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి.పంటనేలా కాలుష్యం కాదు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఏరియా అంతా  మొక్కలు నాటించి చిన్నసైజు అడవుల్లా పెంచుతా. దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే వాతావరణ కాలుష్యమూ అంత హానిగా మారదు’’ చెప్పింది హిమబిందు.

గవర్నమెంట్‌ స్కూల్స్‌.. హాస్పిటల్స్‌.. 
‘‘నేనూ అంతే.  చీఫ్‌ మినిస్టర్‌ అయితే.. గవర్నమెంట్‌ స్కూల్స్, హాస్పిటల్స్‌ బాగా నడిచేలా చూసుకుంటా. ప్రైవేట్‌ స్కూల్స్, హాస్పిటల్స్‌ చాలా కాస్టీ›్ల. అందుకే గవర్నమెంట్‌ వాటినే బాగా నడిపిస్తా. ధరలు పెరగకుండా చూసుకుంటా. డబ్బున్న వాళ్లు కరెక్ట్‌గా టాక్స్‌లు కట్టేలా చర్యలు తీసుకుంటా’’ తన అభిప్రాయాన్ని చెప్పింది అనిత. 

వరకట్నం తీసుకునే వాళ్లను.. 
‘‘నేను చీఫ్‌ మినిస్టర్‌ అయితే.. ముందు వరకట్నం తీసుకునేవాళ్లను జైల్లో పెడ్తా. బయటకు రాకుండా చూస్తా. అలాగే యాసిడ్‌ అటాక్స్‌ చేసేవాళ్లను కూడా జైల్లో పెడ్తా. అమ్మాయిలను ఏడిపించడం ఎంత తప్పో.. స్కూల్లోనే లెసన్స్‌ చెప్పిస్తా. అమ్మాయిలు బాగా చదువుకునేలా.. వాళ్లను వాళ్లు రక్షించుకునేలా అందరికీ స్కూళ్లల్లో కరాటే క్లాసెస్‌ ఇప్పిస్తా’’ మనసులో మాట చెప్పాడు నర్సింహ. వీళ్ల అభిప్రాయాలు అన్నీ విన్న తర్వాత.. అసలు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎలా నడుస్తుందో తెలుసా అని అడగాలనిపించి.. అడిగాం. ‘‘తెలుసు.. టీవీల్లో చూస్తాం. కాని చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు అసహ్యంగా’’ అని ముక్త కంఠంతో జవాబిచ్చారు అంతా.  మరి ఎలా ఉండాలో మీరు చూపిస్తారా? అని అంటే.. అదిగో పైన ఇంట్రడక్షన్‌లో ఇచ్చాం కదా.. అలా ప్రశాంతంగా అసెంబ్లీని నడిపించి చూపించారు. పిల్ల మాటలు.. పిల్ల చేష్టలు అని కొట్టిపారేయొద్దు. ఈ పిల్లలకు పెద్దల కన్నా గొప్ప పరిశీలన ఉందని.. సమాజాన్ని గమనిస్తూ ఉన్నారని వాళ్ల అభిప్రాయాలతో చెప్పారు! వాళ్ల అభిప్రాయాలకు విలువనిద్దాం. ప్రభుత్వాలు, మనం.. విస్మరించిన చాలా విషయాలను, వివరాలను చక్కగా... సూటిగా.. గుండెకు తగిలేలా చెప్పారు. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, కూడు, గుడ్డ, నీడ.. ఇంకా అందని ఫలాలేని,  మహిళలను గౌరవించాలని, మద్యాన్ని పారించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పథకాలను రూపొందించొద్దని.. బాలలందరికీ  బడికి వెళ్లే హక్కుందని.. పర్యావరణ హితాన్ని మరచిపోవద్దనే సత్యాలనూ బోధించారు. పచ్చి గోడ మీద అచ్చులా పడ్డ ఆ బాలవాక్కుని మెదళ్లలో నిక్షిప్తం చేసుకుందాం. కార్యాచరణగా చూపిద్దాం!ఈ భవిష్యత్‌ పరిపాలనా దక్షులకు వాళ్ల భవిష్యత్‌ తరాల కోసం ఇంకేవైనా కొత్త పనులు చేసే అవకాశం ఇద్దాం! చర్విత చర్వణాలను ఇప్పటికైనా చరమగీతం పాడదాం! స్వయం పాలనలో ఈ భావి భారత విధాతలు నేర్పుతున్న పాఠం ఇదే!
– సరస్వతి రమ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement